పదునాల్గు భాషలందున
పదునెక్కిన ధిషణగలిగి పలు వేదికలన్,
విదితుడు వాణీపుత్రుడు
సదయుండగు పుట్టపర్తి స్వామిని గొలుతున్..
అగణితమ్మైన పాండిత్య గరిమ నీది,
సుగఠితమ్మైన సంగీతధార నీది,
తిగకంఠి తాండవ కర్తగా నిలచితీవె
గగనవీధిని నీవు నొక ధృవ తారవై...
మా అయ్య ఒకసారి గళమెత్తి పలికెనా,.
కురియులే లక్ష్మీశు కీర్తనములు,
మా అయ్య ఒకసారి కలము చేపట్టెనా,
విరియులే సత్కావ్య నందనములు,
మా అయ్య ఒకసారి వేదికను నిలచెనా,
మురియులే వివిధ కవితా విచయము,
మా అయ్య ఒకసారి నగవులే చిందెనా,
మరచులే తను తాను ధిషణయోష,
సరస సల్లాప హాస్యోక్తి,తనదు రక్తి,
సురస విద్వత్ సభాసక్తి, తనదు యుక్తి,
విరస పాండితీగీర్వాణ విముఖ ప్రకృతి,
పరుసవేదివే నీవయ్య పాండితికిని...
పుట్టపర్తీ! నీకిదే పాద్యమయ్య,
పుట్టపర్తీ! నీకివే జోతలయ్య,
పుట్టపర్తీ! నీవెకా మాదు అయ్య,
పుట్టపర్తీ1 మాదు గత భాగ్యమయ్య!!!!
........................... 28-3-15