Tuesday, 23 February 2016



అయ్య పేరుతో  'శివతాండవం'  ముడివడిపోయి ఇప్పటికి  అరవైయేళ్ళు దాటిపోయింది. 1955నాటి ద్వితీయ ముద్రణ గుంటూరు ఆంధ్ర సంసత్ వాళ్ళు చేసినది. అప్పటికి,  నలభై పదుల వయసున్న నారాయణుని ముందు మాటలొ తొణికిసలాడుతున్న వినయ సంపదకు ముగ్ధులవని వారుంటారా, అనిపించింది నాకైతే! యీ పోష్ట్ లో, దీనితోపాటూ, అయ్య యే విషయం గురించైనా  వ్రాసుకునే నోట్స్ స్వదస్తూరిలో ఉన్నది  పొందుపరచాను. జాగ్రత్తగా చూడండి.  చిన్న చిన్న అక్షరాలలో, యెంతో శ్రద్ధగా,తనకు మరీ ముఖ్యంగా తోచిన విషయాలను, రేఖాంకితం చేసుకోవటం-  ఇవన్నీ, యెంతో  యేకాగ్రతతో చెసుకునేవారాయన యెప్పుడూ - రాత్రీ పగలూ తేడాల్లేకుండా!  మిద్దె మీద ఉన్నంతసేపూ, సాహితీ గహనవనాల్లో,  అలసటెరుగక  విహరించిన ఆ కవికిశోరం -  మిద్దె దిగి కిందికి, యీ వాస్తవ ప్రపంచంలొకి వస్తే, యెంత తేడా తెలుస్తుండేదో కదా!  అయ్య మాటల్లోనే....  'యెంతసేపూ,  పప్పూ, వుప్పూ, చింతపండూ సంపాదనలోనే  తనకలాడి, యేదో అలిసిపోయినట్టు, గుర్రుపెట్టేవాళ్ళకేంతెలుస్తుంది, యెంత శ్రమ పడితే, పాండిత్యం  ఒంటపడుతుందో!" ఇంతకూ, శివతాండవం శిఋషిక కిందున్న ఆంగ్ల కొటేషన్ గమనించండి. జీవిత రహస్యం యేమిటంటే, పెద్ద ఆశయాలను సాధించే క్రమంలో, చిన్న చిన్న అకర్షణలను త్యగం చేయవలసు ఉంటుందని...నాకైతే, ఇదేవిధంగా  అర్థమైంది...మీరూ  ఆలోచించండి - మీకేవైనా కొత్త అర్థాలు తడుతాయేమో!























 

Monday, 15 February 2016



రాసీమ రత్నం- బెళ్ళూరి

అయ్య బెళ్ళూరి శ్రీనివాసమూర్తిగారిని చాలా  ఇష్టపడేవారు. చిన్న తనంలో వారిని బాగా దగ్గరగా చూసినట్టే గుర్తు. వారు, మా తాతగారు  శ్రీమాన్ పుట్టపర్తి శ్రీనివాసాచార్యులవారికి శిష్యుడుకూడా కావటంవల్ల, వాళ్ళిద్దరి మధ్యా స్నేహ బంధమలా పెనవేసుకుందేమో!   వారి రచనల బైండింగ్ ఒకటి  నాకు శ్రీమాన్ రావినూతల శ్రీరాములుగారి ద్వారా యెప్పుడో అందింది.  తపోవనము (1954)  తో పాటూ ఇందులో,   కావ్యగంగ (1957) అన్న దనిలోని కొన్ని రసగుళికలు, మీకోసం! ఇందులో  వున్నవి.. గురు ప్రశంస పేరిట, మా తాతగారిగురించిన పద్యాలు, అయ్యకు అనంతపురంలో వీడ్కోలు సందర్భంగా వారు  చదివిన పద్యలూ, రాయలసీమ గురించి వారి రసరమ్య భావనలూ...వీటిని ఆస్వాదించండి!  ఇంకా యీ సంకలనం ఆకర్షణను  అద్భుత చిత్రాలు (చిత్రకారునిపేరు  నా కంటికి  కనబడలేదు మరి) అదనం....





















Saturday, 13 February 2016

Alarulu kuriyaga adenade.....by Tallapaka Annamacarya







ఈ రోజు ప్రేమ దినోత్సవం. నిన్నటి నా పుస్తక శోధనలో బయటపడిన 12,మే 1982 నాటి ఆంధ్ర ప్రభ ప్రత్యేక సంచిక (వారపత్రిక) లో చిన తిరుమలయ్య వ్రాసిన శృంగార మంజరిలొని యీ ముచ్చటగొలిపే వివరణ చూడండి.






గాలిపటాలలో, కస్తూరిలో అద్దిన లేఖినితో ప్రేమలెఖ వ్రాసిన ఆ నాయకి వర్ణన యెంత మనోజ్ఞం!
యేమొకో చిగురుటధరమున.....ఇదీ అంతే!
 రుక్మిణీదేవి కూడా, శ్రీకృష్ణుని వలచి ప్రేమలెఖ పంపింది కదా మరి!
అన్నమయ్య అలమేలు మంగ, తన పతి మనసు గెలుచుకునేందుకు, అరతెర మరుగున నుంచీ నాట్యం చేసిందని అన్నమయ్య అంటాడు అలరులుగురియగ ఆడెనదే..అన్న పదంలో!
 అప్పటి రోజుల్లో, వీధినాటకలలోనో మరెక్కడో,(అప్పటికి భామాకలాపం వుండేదా?)
 తెరమరుగు నుండీ నాయిక పాత్ర ప్రవేశించే విధానం అన్నమయ్య రచనలో ప్రతిబింబించిందని అయ్య చెప్పినట్టు గుర్తు - నాచేత శ్రీ రామకృష్ణాహైస్కూల్ లో యీ పాటకు నాట్యం చేయించినప్పుడు!
మా తులజక్కయ్య, బాలసరస్వతిగారి నాట్యాభినయ గ్రంధాన్ని దగ్గర పెట్టుకుని, ముద్రలూ అవీ అయ్య సూచనల ప్రకారం నాకు నేర్పించింది.
   'కందువ తిరువెంకతపతి మెచ్చగా అన్న చోట, దశావతారాలూ యివిధంగా అభినయించమని చెప్పి చెసి చూపించారు అయ్య స్వయంగా! .
ఇక ప్రదర్శన తరువాత, మ అయ్య నన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నరు - మురిపెంగా! అమ్మ ఇంట్లో దిష్టి తీసింది! 
 అయ్యో..కేవలం స్మృతి పటలంపై మాత్రమే రికార్డ్ చేసుకోగలిగానే, అని ఇప్పుడు యెంత ఆవేదనో!
 అప్పటి ఫోటొలు కూడా యేవీ లేకపోవటం - యెంతటి తప్పిదం కదా! (ఆ పాట ఇప్పటి నా గానంలో _ శంకరాభరణ రాగం)




 ............................
అలరులు కురియగ నాడెనదే |
అలుకల గులుకుల అలమేలు మంగ || అరవిరి సొబగుల నతివలు మెచ్చగ | అరతెర మరగున నాడెనదే |వరుస పూర్వదువాళపు తిరుపుల | హరిగరగింపుచు అలమేలు మంగ ||మట్టపు మలపుల మట్టెల కెలపుల | తట్టెడి నడపుల దాటెనదే |పెట్టిన వజ్రపు పెణ్డెపు తళుకులు | అట్టిట్టు చిమ్ముచు అలమేలు మంగ ||
చిందుల పాటల సిరి పొలయాటల | అందెల మోతల నాడెనదే |కందువ తిరువేఘ్కటపతి మెచ్చగ |అందపు తిరుపుల అలమేలు మంగ ||....
.............................




Friday, 12 February 2016

Veena vadini varde! var de! (Nirala)






                     మా అయ్యగారికి హిందీ కవులలో నిరాలా అంటే యెందుకో చాలా ఇష్టంగా వుండేది. ఒకనొక ఇంటర్వ్యూ లో వారన్నారు..'నాకూ, నిరాలాకూ చాలా పోలికలున్నందువల్లేనేమో, అతనంటే, నాకు మహా ఇష్టం. అతనూ నావలెనే చాలా కష్టపడినాడు జీవితంలో. ధనాభావంతో, నిష్టుర దారిద్ర్యంతో చివరి రోజుల్లో, ఆయన బిడ్డకు జబ్బు చేస్తే పాపం సరైన వైద్యమూ చేయించలేక పోయినాడు. ప్రపంచంలో దారిద్ర్యంకంటే మించిన పాపం లేదేమోననిపిస్తుంది. ఇప్పుడు ఆయన రచనలకు నీరాజనాలర్పిస్తున్నారు.' (నేను 2002 లో ప్రచురించిన 'సరస్వతీపుత్రునితో సంభాషణలు' పేజీ 38)


       నిరాలా వ్రాసిన 'రాం కీ శక్తి పూజా'  మాకు ఎం. ఏ. లో వుండేది. యెన్నిసార్లు చదివి వుంటానో లెక్కలేదా రచనను! ఆధ్యాత్మ రామాయణ ప్రభావం బాగా కనిపిస్తుందందులో!







 (అరుణ్ రామాయణ్ అన్న అరుణ్ పోద్దార్ హిందీ రామాయణం చదివినప్పుడూ నేనిలాగే యెంతో వుద్వేగానికి గురైనాను. నేను సౌందర్య లహరి బాగా పారాయణం చేసేదాన్నప్పట్లొ. మొదటిరొజు మొదటి శ్లోకం 108 సార్లు చేసి, తక్కిన శ్లొకాలన్నీ చదివేయటం. రెండొ రోజు రెండవ శ్లొకం 108 సార్లు. మూడో రోజు మూడవ శ్లోకం- అలా, నూటా యెనిమిది శ్లోకాలూ, 108 రోజుల్లో పారాయణం చేయమని అమ్మ ఇచ్చిన సలహాను నేను అలా దీక్షగా చేస్తుంటే అయ్య కూడా యెంతో ఇష్టంగా గమనించేవారు కూడా! అప్పుడు అమ్మా, అయ్యా యేంచెబితే అవి చేయటమే, జీవిత లక్ష్యాలు అప్పట్లో! .) 
       నిరాలా వ్రాసిన యీ సరస్వతీ వందన పాడాలని యెన్ని రోజులుగానో అనుకుంటున్నాను. రేపు మాఘ పంచమి. సరస్వతిదేవి మా నాయనమ్మ. ఆమెకు ప్రణమిల్లుతూ రికార్డ్ చేశాను మరి! (అభేరి రాగ చాయలతో) మా అయ్య ఇంకా వాళ్ళమ్మ దగ్గరే కూర్చుని, తన కావ్యగానం చేస్తూనే వున్నారో, లేదూ, అమ్మ ఆశీర్వాదంతో, యెక్కడైన అవతరించి వుంటారో, తెలియదు. యీ నా జన్మకు యీ కృప చాలునంటారేమో మరి!
......................  

Wednesday, 10 February 2016

Jalaja Nayana... A sweet Sanskrit Mangala Harathi





                      ఆనంద భైరవి
......................
ఈనాడు మనకందరికీ  మైసూర్ గా చిర పరిచితమైన ఆ నగరాన్ని, ఇదివరకు, అంటే పాత కాలంలో యేమని పిలిచేవారో తెలుసా? మహీశూర పురం! యెంత బాగుంది కదా! ఆ మహీశూర పురంలోనే శ్రీవైష్ణవ సంప్రదాయానికి చెందిన ప్రాచీనమైన పరకాల మఠం వుంది.(నేను మైసూరుకు ఉద్యోగంలో వున్నప్పుడు రెండు మూడు సార్లు అక్కడికి వెళ్ళి, ఆ పూర్వ వైభవాన్ని దర్శించి,  ధన్యురాలై వచ్చాను)  మరి ఇప్పుడా ప్రసక్తి యెందుకంటే, ఆనంద భైరవి రాగం లోని యీ మంగళహారతి శ్రీ శ్రీ శ్రీ కృష్ణ బ్రహ్మ తంత్ర పరకాల మహాదేశికుల వారు  (వీరు పరకాలమఠ యేకత్రింశనాం స్వామివారు-31వ పీఠాధిపతి) తన పూర్వాశ్రమంలో రచించినది. నా చిన్నప్పుడు, యీ మంగళహారతిని, మా అమ్మ, శ్రీమతి కనకమ్మా, మా అక్కయ్యలు కరుణ, తరులతల యుగళగళాలలో యెన్నో సార్లు విన్న అందమైన  జ్ఞాపకం యీనాడీవిధంగా మీముందుకు తీసుకువస్తున్న సంతోషం! నోరు తిరిగేందుకు, గాదె కింద కంది పప్పు...ఇంకా... నల్ల లారి మీద యెర్ర లారీ...ఇలాంటి ప్రయోగాలేమంటారొ మరిచిపోయానిప్పుడు కానీ యీ పాటలోని పదాలను క్షుణ్ణంగా,  తప్పులు లేకుండా పలకడం అంత  సులువేంకాదు సుమా! ఒక సారి ట్రై  చేయండి మీకే తెలుస్తుంది! సంస్కృత రచనే ఐనా, ద్రాక్షాపాకమండీ! యెంత మధుర పదజాలం! యెంత చక్కటి భావం! ముందు రచన చూడండి. తరువాతే పాట వినండి  దయచేసి.....(   'కల్యాణ గీత మంజరి'   పేరుతో 1966లొ ముద్రితమైన యీ చిన్ని పొత్తాన్ని, పుట్టింటి ఆస్తిగా వెంట తెచ్చుకున్నాను - యెప్పుడో.! .యేమిటో..నా  పిచ్చి నాకు ఆనందం!)
........................
 జలజ  నయన  తవసు మంగళం
   భుజగ శిఖరి,   కలిత నిలయ  భవతు మంగళం....
   జలధి  శయన  విబుధ   వినుత  లలిత  లలిత  చరిత  భరిత
   వలభి  దుపల  పటల  రుచిర  చలిత  లులిత  చికుర  నిటిల...
                     .జలజ  నయన  తవసు మంగళం
                      భుజగ శిఖరి  కలిత  నిలయ  భవతు  మంగళం...
శరణ  వరుణ  కుతుకి దేవతా
     భరణ రుచిత.. కరుణ నిగమ  సుగమ  దైవతా..
     అరుణ తరుణ  తరుణి  కిరణ
    చరణ  చరణ హరిణ  హరణ 
    హరిణ  కిరణ  వదన  జనన
   సరణి  తరణ  కరణ  శరణ...
             .జలజ  నయన  తవసు మంగళం
             భుజగ శిఖరి  కలిత  నిలయ  భవతు  మంగళం.....
 సురత  మృదిత  జలధితాస్తనా..
     భరత సహజ
    హరిత  తురగ  తనుజ  పాలనా..
   స్ఫురద  విరత సతత కఠిన
    విరుత భువన కదన జనన
    దురిత భరిత  చరిత  సదన
    నిఋతి  వితతి విరతి లకన 
                          .జలజ  నయన  తవసు మంగళం
                           భుజగ శిఖరి  కలిత  నిలయ  భవతు  మంగళం..
 పవన  తనయ  వినుతి  భాజనా 
      పవన  హరణ 
      నవన  వచన  నివహ  పావనా..
     పవన  లవన  యవన  గహన 
     జవన  వలన  వహన  పవన 
     నవ  సుదుర్గ  భవన  కృష్ణ 
     కవన  సరణి  జవన  చరిత...
                      .జలజ  నయన  తవసు మంగళం
                      భుజగ శిఖరి  కలిత  నిలయ  భవతు  మంగళం..
.

Saturday, 6 February 2016

Kadaku migiledi.....Dr.Puttaparthi's Devotional (non-denominational) song








7-2-16
................

అయ్యకూ, అయ్య అభిమనులకూ- అందరికీ యెంతో ఇష్టమైన భక్తిగీతమిది. ఒక విధంగా, జీవిత సారాన్నంతా, మూడు చరణాల్లో విశదపరచే యీ భక్తి గీతం-1970లలో, ఆకాశవాణి హైదరాబాద్ వారి కోరికపై అయ్య రాశారు. శ్రీ పాలగుమ్మి విశ్వనాధం గారి సంగీత నిర్వహణలో, హైదరబాద్ సోదరీమణులుగా విఖ్యాతులైన శ్రీమతి లలిత, హరిప్రియ గారలు గానం చేశారు. యెంతో అర్థవంతమైన యీ పాట, రికార్డింగ్ ను సరైన రీతిలో, భద్రపరచలేకపోయినందుకు, వ్యక్తిగతంగానూ, ఆకాశవాణి ఉద్యోగినిగానూ, యెంతో బాధపదుతున్నా, నాకు వచ్చినరీతిలో, ఇలా మీముందుంచగలుగుతున్నందుకు లేశమాత్రం సంతోషంగా ఉంది. ఇదిగో సాహిత్యం-మీకొసం.....

కడకు మిగిలేది ఇది ఒకటే,

యెడద జపించిన భగవన్నామము..కడకు...

అష్టైశ్వర్యములమరినగానీ,

ఆచారమ్ములు నెరపిన గానీ,

అఖిల శాస్త్రములు చదివిన గానీ,

ఆహా! యను యశమమరినగానీ...కడకు...

హఠయోగమ్ములు బట్టినగానీ,

ఆశ్చర్యంబులు చూపినగానీ,

అతివలకన్నుల క్రీనీడలలో,

ఆత్మార్పణములు చేసినగానీ...కడకు..

ఆకాశంబులు గొలిచినగానీ,

అబ్ధి జలము శోధించినగానీ,

చంద్రలొకమునకేగినగానీ,

సకలజగముతానేలినగానీ..కడకు...












Friday, 5 February 2016

   (Ayya with Dr.Tripuraneni Hanuman Choudary garu in the backdrop of the main door I painted - might be in 1975 or '76)

...............
'ఆ.. నాగా..ఇదిగో....
 (11-1-16 .. పోస్ట్ తరువాయి....)
        యీ ప్రభ మూడు నాలుగేళ్ళు నడిచిందనుకుంటా!  అయ్య '72లో రెటైర్  అయ్యారు.  మా అన్నయ్య అరవింద్ జీతం  పెద్దగా వుండేది కాదు ఇంటి అవసరాలు ఆదుకునే స్థాయిలో!  ముగ్గురు పెళ్ళిల్లైన అక్కయ్యలూ,  వాళ్ళ అవసరాలూ..అబ్బో! రోజులెట్లా గడిచెవో మరి!  యీ లోగా అయ్యకు పద్మశ్రీ రావటమూ, సంజీవరెడ్డిగారు కడప   కలెక్టర్ గా  వచ్చినప్పుడు, అయ్య షష్టి పూర్తి పెద్ద యెత్తున జరిగి ఓ ఇరవై ఐదు వేల రూపాయల పర్స్ (సరిగ్గా  గుర్తులేదండీ..ఐనా అవన్నీ పెద్దవాళ్ళ విషయాలు అప్పట్లో) ఇవ్వటమైంది. జిల్లెళ్ళమూడి అమ్మ కరుణతో, చీరాలా, పేరాలా (అప్పుడు అయ్యతో నేనూ వెళ్ళానండొయ్ అక్కడికంతా!)  అటు వైపు బాగా  సన్మనాలవీ జరిగి రెక్కలు అల్లార్చుకునే సమయానికి  అమ్మ తీవ్ర అనారోగ్యం! మాటి మాటికీ, ఆసుపత్రి పాలు  కావటం, డబ్బు నీళ్ళలా ఖర్చైపోవటమూ! ఆ రోజులు తలచుకుంటే కడుపులోంచీ యేడుపు యెగదన్నుకుని వస్తుంది. ఆర్థిక స్థోమత అవసరం అప్పుడప్పుడే తెలుస్తున్న రోజులవి!
       తరువాతి కాలంలో, అయ్య తన పెద్ద రచనలు పండరీభాగవతమూ ,  జనప్రియ రామాయణమూ, వేసుకున్నారు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడి రేట్లతొ ఇచ్చిన పేపర్తో కాస్త ధైర్యంగానే!  కానీ, అప్పటికే, తెలుగు సాహిత్యభిలాష మసకబారుతున్నట్టుందేది. ఆ గ్రంధాలెవరూ గ్రంధాలయాలకంటూ కొనలెదు.పండరీభాగవతం, చెక్క బీరువాల్లో  వుండటం వల్ల, వర్షపు నీళ్ళు దిగి, చెదలు పట్టి పోయాయి చాలా  కాపీలు!..అయ్య ఆ చెదలు పట్టిన పుస్తకాల మధ్య కూర్చుని నిర్వేదంగా, యే భావమూ ప్రకటించని గాజు కళ్ళతో,  అన్న మాటలు ఇంకా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి 'చివరికి,  నా  పండరీభాగవతాన్ని చెదలే చదివినాయన్నమాట  ప్రీతిగా! ' అని! 
      అట్లా, అయ్యకు తన పుస్తకాలను తానే  ముద్రించుకోవటం కూడా తప్పేనని  తెలుసుకునే వేళకు జరగాల్సిన నష్టం జరిగేపోయింది. జనప్రియ రామాయణం,  శ్రీనివాస ప్రబంధమూ, అయ్య పోయిన తరువాత, కొన్ని బ్రౌన్ లైబ్రరీకీ, కొన్ని..(యేడుపొస్తూంది) రక రకాలుగా  మాయమైపోయాయి.. . పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు,  అయ్యను చూసిన స్ఫూర్తి తో, నేనూ  యీ ప్రచురణ రంగంలోకి, అయ్య పుస్తకాలను  ప్రచురిస్తూ, ఆడ అభిమన్యునిగా ప్రవేశించాను. నేను వేసిన పుస్తకాలవల్ల,  లాభాలెన్ని వచ్చాయన్నది  కేవలం  అనుభవైక వేద్యమే !   వ్యాపార   చతురత ముఖ్యంగా వుండవలె కదా! వుద్యోగినులుగా వుంటూ, ప్రచురణ రంగంలో కూడా ప్రతిభ కనబరుస్తూ, సక్సెస్  సాధించిన  మహిళలు, చాలా  తక్కువే యెలాగైనా! యేమైనా చెప్పండి అదిప్పటికీ నాకు  రాని కళే! యేమైనా మాట్లాడేవాళ్ళని 'మీరూ పుస్తకాలు వేసి చూడండి, తెలుస్తుంది ఆ బాధేమిటో ' అనేస్తాను నేనైతే!   గట్టుపై కూర్చుని యెన్ని మాటలైనా మాట్లాడవచ్చు. దిగితే కదా లోతు తెలిసేది. అక్కడో  వూబే ఉండొచ్చు. మొసలే వుండొచ్చు. సుడిగుండమే కావచ్చు. యేమీ లేకపోనూ వచ్చు. అదంతా  అదృష్టం.. యెంతకూ దృష్టం కానిది మరి!   పుస్తకాలు వేసి అమ్ముకోవటానికి నానా  తిప్పలూ,  నానా  గడ్డీ తింటూ అగచాట్లూ పడుతున్న వాళ్ళకే యీ విషయాలు తెలుస్తాయి.  పైగా అయ్యనుంచీ, వారసత్వంగా వచ్చిన కొన్ని సుగుణాలుండనే  వున్నాయాయె! చొరవ   లేదు.  వుద్యోగస్తురాలినైనా, లంచాలిచ్చి పనులు చేయించుకోవడమన్న  విద్య రాకపాయె!  పుచ్చుకునే విద్య ఒస్తే, ఇచ్చే విద్యా వస్తుందట! అదే రాదు కదా మరి! యేమి మాట్లాడినా అయ్యకే చెడ్డపేరొస్తుందనే భయమూ!  ఐనా, కిందపడి దెబ్బ తగిలినా, అనుభవం మాత్రం చక్కటిదే, అన్నట్టు, పుస్తకాలమాటెటున్నా,    పుట్టపర్తాయన బిడ్డగా,  వచ్చిన గుర్తింపే యీ జన్మకు చాలు అన్నట్టుంది నాకైతే! యేమంటారు?   
............................
     

Thursday, 4 February 2016

Dari kace Sabari - A Telugu Devotional song







 సరస్వతీపుత్రుని అంతర్వాహిని :


....................


దారి కాచె శబరీ రాముండిటు వచ్చుననీ...


తన పూజ గొనునటంచు ..


          వనవనమూ చుట్టి చుట్టి నగనగమూ తిరిగి తిరిగి


          ననలెల్లను గొని తెచ్చి,తనిపూవుల నేరియుంచి...దారి...


సెలయేటను తానమాడి, తెలినార కట్టి,


చెలిచెక్కిట చెయి జేర్చి,తలవాకిట నిక్కి చూచి..దారి..


           యెలగాలులు వీచినంత తలయెత్తి ఆలకించు,


           గలగల ఆకులు కదలిన అలికిడియా పదములదని..దారి...


దూరాననుందునంచు తరువెక్కి నిక్కి చూచు,


గిరిపై నిలుచుండి చూచు,కరమడ్డముగాగ చూచు..దారి..


          రారామ రామయంచు రాగలడిదె వచ్చెయంచు,


          రేబగళ్ళు తపియించుచు వాపోయెను వత్సరములు....దారి..


దినమొక కల్పంబుగా, క్షణమొక్క యుగంబుగా,


తనువెల్ల తపంబుగాగ, మనసెల్ల నిరాశగాగా..దారి...


          పరవ శి0చు తలపులతో, భయకంపిత మనముతో,


          పగళ్ళెల్ల యెదురుచూచు, నిశలెల్లను మెలుకొంచు..దారి.


చనుదెంచునొలెదో, తనుజూచునొ చూడదో,


అని తపించి జపియించుచు, అనుమానము పెంగొనగా..దారి..


          రా రామ రామ రామా..ప్రియదాసుల గావరావ,


          కానరాని శబరి ప్రేమ నుడియుడిగిన మూగ ప్రేమ..దారి..


....................


మా అమ్మ శ్రీమతి పుట్టపర్తి కనకమ్మగారు వ్రాసిన యీ పాట, అమ్మను యెరిగున్నవాళ్ళందరికీ, యెంతో ప్రీతిపాత్రమైన పాట! మా అయ్యకూడా, కళ్ళు మూసుకుని, తాదాత్మ్య స్థితిలో, భక్తి పారవశ్యంలో యీపాట వినటం-మేము గమనించిన సత్యం. అమ్మ 1983 లో (22nd March) తన శ్రీరామ సాన్నిధ్యానికి చేరుకున్నప్పుడు, మేమంతా, ఆమె శాశ్వత వియోగాన్ని భరించలేక-యీ పాటను అశృతప్త నయనాలతో పాడుతుంటే, అయ్య, చిన్న పిల్లవాడివలె, భోరున యేడ్వటం- అందరి హృదయాలూ తరుక్కుపోయిన క్షణాలు. కరణం, మా అయ్య జీవితానౌక, నిజమైన సరంగు అమ్మే కదా మరి! ఇల్లాలిగానూ, సాహితీపధ సహగామిగానూ, ఆ సరస్వతీపుత్రుని అంతర్వాహిని అంతశ్శక్తి కూడా ఆమే! ఆమే! అమ్మకు కన్నీటి నివాళీ!