Wednesday, 17 June 2015



భౌతికంగా దూరమైనా, అయ్యగారి స్మృతులతో మమేకమై నిలచిపోయిన రామావఝల శ్రీశైలంగారికి అశృనివాళి యెలా సమర్పించాలో అర్థం కావటం లేదు.  అయ్యగారి గ్రంధాల ప్రసక్తి యెక్కడ వచ్చినా, ఒక కొత్త విషయాన్ని ప్రస్తావించి మమ్మల్ని ఆశ్చర్యచకితులను   చేసేవారాయన! వారి నిత్య నూతన ఆసక్తి అబ్బురపరచేది. తనగురించి, తన రచనల గురించి అస్సలు ప్రస్తావించేవారు కాదు. యెదైనా  మేమే చూసి మీ వ్యాసం బాగుంది శ్రీశైలంగారూ అంటె,  ఆ..యేదోలెండి..అని తేల్చేసేవారు.   యెమ్మెస్ సుబ్బులక్ష్మిగారి గురించి వారి స్మృత్యంకంలో కవిత రాశారు. అందమైన దస్తూరీ గురించి చక్కటి వ్యాసం వ్రాశారు.ఇంక చాలానే వ్రాసి ఉంటారు. చాల లోతైన మనిషి వారు.  అటు సాహిత్యము, ఇటు భక్తి, అటు వైజ్ఞానిక రంగం,  ఇటు సంప్రదాయ వాదం- అన్నిటినీ సమానంగా గ్రొలటమే కాక, ఆయా విషయాల గురించిన బోలెడు సమాచారం అంగ్లంలోనైన, తెలుగులోనైన తీసి పదిల పరచటం వారి  అపురూపమైన అలవాటు. అత్యంత ప్రీతి దాయకమైన అలవాటు. వారి  కుటుంబ సభ్య్లెవరూ వారి అభిరుచికి అడ్డు చెప్పిన దాఖలాలే లేవు ఇప్పటివరకూ! పైగా సహకరించటమే యెక్కువ. ఇటీవల మా  అయ్యగారి సాహిత్య సర్వస్వ  ప్రచురణ సమయంలో, వారి అబ్బయి శ్రీ సాయి కృష్ణ రాత్రనక, పగలనకా, వారి నాన్నగారు నాకు  అందివ్వమన్న సమాచారాన్ని వెంటవెంటనే అందివ్వటం చూస్తే వీరి ఋణం తీర్చుకోవటం బహు కష్టం అనిపించేది. అయ్య గారి  పట్ల శ్రీశైలంగారికున్న అభిమానం,వారి కుటుంబ సభ్యులందరిదీ అవటం మనసుకెంతో ఆనందాన్ని కలుగ జేసేది. ఇవన్నీ నిన్నటి మాటలైపోవటమే విచారకరమైన విషయం. శ్రీశైలం గరి వద్ద ఫైళ్ళలో ఉన్న అత్యంత విలువైన సమచారాలన్నీటినీ  వెలుగులోకి తెచ్చే బృహత్తర కార్యాన్ని వారి  కుటుంబ సభ్యులు చెపడితే,  శ్రీశైలంగారి కృషికి  సార్థకత చేకూరుతుందనిపిస్తూంది. ఇప్పుడిక  యీ  దుఖ సాగరంలొ యీదటం అలవాటైన తరువాతైనా, యీ ఫనిని చేపట్టవలసినదిగా వారి  తనయులకు వినమ్ర విజ్ఞప్తి.  

Tuesday, 16 June 2015

మా అయ్యగారికున్న కొద్ది మంది అంకిత శిష్యుల్లో రామావఝల  శ్రీశైలంగారు ముఖ్యులు.నా  12, 13 యేండ్ల  వయసునుండీ వారిని నేనెరుగుదును. అయ్య పాల్గునే ప్రతి సభా, సమావేశం వివరాలన్నింటినీ యెంతో పదిలంగా భద్ర పరచి ఉంచేవారాయన! అనేకానేక   వ్యాసాలూ,   సమీక్షలూ, వ్యాఖ్యలూ, అయ్యగురించి ఇతరుల సంభాషణల్లో ప్రస్తావనలూ..ఒకటేమిటి..యెన్నొ, యెన్నెన్నో!! అన్నీ వేటికవై ప్రత్యేకమైన ఫైళ్ళలో పొందికగా దాచి ఉంచేవారు. నెల్లూరు లోనూ, చుట్టుపక్కల యే ప్రాంతానికి వేళ్ళినా, శ్రీశైలం గారు అయ్య పక్కనుండేవారు. అయ్య వ్యాసాలు కొన్ని అపూర్వమైనవి, అలభ్యాలుగా   ఉంటే,  ఆఫీసు సెలవు తీసుకుని మరీ మద్రాస్ వెళ్ళి,   కన్నెమరా గ్రంధాలయంలో కొన్ని రోజులు కూర్చుని తన అందమైన వ్రాతలో ప్రతి ని తయారు చేసుకుని వచ్చారు 40 సంవత్సరాల క్రితం.!!.వారి శ్రీమతి, వారి పిల్లలూ, శ్రీశైలం గారి వీరావేశానికి ఏనాడూ అడ్డు చెప్పకపోవటం నేను చూసిన సత్యం. సహకరించటమే యెక్కువ. అయ్య ఒక సందర్భంలో జోక్ వేశారు కూడా..'నేనెక్కడైనా తుమ్మినా, దగ్గినా కూడా శ్రిశైలం దాని  వివరాలు సేకరిస్తాడు'. అని.అ కీర్తిశేషులైన  తరువాత కూడా, వారితో సోదరానుబంధాన్ని,  నేనూ, మా చెల్లెలు రాధా, కొనసాగిస్తునే ఉన్నాము.  .ఇటివల బ్రౌన్ అకాడెమీకి నేను మా అయ్యగారి గురించి మోనోగ్రాఫ్    వ్రాసినప్పుడు, దాని చిత్తు ప్రతి సరిదిద్దే బాధ్యత అంతా వారే యెంతో అంకిత భావంతో చూసుకున్నారు.  కారణం, నేను అమెరికా కు రావలసి  వచ్చిందప్పుడుకూడా! మళ్ళీ అయ్య సాహిత్య సర్వస్వం ప్రచురణలోనూ వారి సహకారం మరువలేనిది.నేను  ఇటీవల ప్రచురించిన అయ్యగారి అపురూప వ్యాస, వ్యాఖ్యా, సంపాదకీయ, సమీక్షల  సంకలనం 'త్రిపుటి' లో శ్రీశైలం గారి సేకరణే యెక్కువ. అందుకే పై అన్ని ప్రచురణల్లోనూ, వారికి కృతజ్ఞతలు తెలియజేసినా,  ఋణ విముక్తురాలను కాలేక పోయాను. కారణం, ఇంకా అయ్యగురించిన భావి ప్రచురణల్లో ఈ సహాయం అత్యంత అవసరం మరి!!       కానీ పైనున్న వాడికి, యెంత తొందరయిందో కానీ, చెప్పా పెట్టకుండా,  శ్రీశైలంగారిని హఠాత్తుగా పిలిపించుకున్నాడు. యే జబ్బూ లేదు. యే మందులూ వాడటం లేదు. పడుకున్న వారు పడుకున్నట్టే జీవిత చక్రం నుండీ నిష్క్రమించటం,  'అనాయాసేన  మరణం' అన్నట్టు వారికి బాగానే ఉండి ఉంటుందేమో కానీ వారి కుటుంబ  సభ్యులకూ, సాహీతీకుటుంబ సభ్యులకూ ఎంత దెబ్బ!! యెవరినీ నొప్పించకుండా మెత్తగా, పటిష్టంగా తన అభిప్రాయాలు చెప్పటం వారినుండీ నేర్చుకోవాలి యెవరైనా!! అయ్యగురించే కాదు..ఇంకా ఎంతోమంది సాహితీశిఖరాల గురించిన వ్యాసాలు,   శ్రీశైలం గారి సేకరణలో వెలుగు చూడనివి ఉన్నాయి. సంగీత, సాహిత్య, చిత్రకార, నాట్య శిఖామణుల వివరాలు, ప్రాచ్య, పాశ్చాత్య భేదాలు లేకుండా వారు శ్రమకోర్చి సేకరించటం చూసి ఒక దశలో అసూయ పడ్డాను కూడా!! అందుకే, వారిని బ్లాగ్  పెట్టమని పోరాను-ఒక చెల్లెలిగా!! ఇదిగో, అదిగో అంటూనే ఉన్నారు..అంతలోనే యీ వార్త!! 16 జూన్ తెల్లవారు ఝామున, నిద్రలోనే వారు, జీవితం నుంచీ తప్పుకోవటం, ఎంత బాధాకరమైన విషయమో నాకూ, మా చెల్లెలు రాధకు కూడా!!! రాధ బ్లాగ్ లోనూ  వారిచ్చిన అనేక వ్యాసాలు ఉన్నాయి. కన్నీరు ఆగటంలేదు. మనసులో ఎంతో వెలితి!! ఇంక చేయబోయే అయ్యగారి పనులకూ, ప్రచురణలకూ, మాకెవరిస్తారు, అంతటి తోడ్పాటు!! యేమో!! భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది!! యేమి చేయాలి!! ఈ ప్రశ్నలకు సమాధానం  దొరకదంతే  !! వారికి ఇప్పుడే నివాళి సమర్పించవలసివస్తుందనుకోలేదు..యెంత విషాదం!!!