Tuesday, 29 September 2015

 'మరపురాని మధుర గాధ' 




'మరపురాని మధుర గాధ' 

   విజయనగర సామాజిక, చారిత్రక విశేషాలెన్నో వెలువరించే యీ గ్రంధాన్ని, 
(ఇదివరకు విజయనగర సామాజిక చరిత్ర అన్న పేరుతో 45 సంవత్సరాల క్రితం ముద్రింపబడి చాల సంవత్సరాలుగా మరుగున పడిఉన్న గ్రంధమిది) '70 ప్రాంతాలలో యెన్ని  సార్లు చదివి ఆ  లోకంలోనే విహరించి ఉంటానో గుర్తే లేదు.2009 లో దీన్ని విజయనగర సామ్రాజ్య కాలంలోనీ మరికొందరు సుప్రసిద్ధూలూ, సిద్ధులూ గురించి అయ్య ఆంధ్ర ప్రభలో వ్రాసిన లఘు వ్యాసాలతో కలిపి 'మరపురాని మధుర గాధ' గా ముద్రించాను. ఈ గ్రంధం గురించి లక్ష్మీదేవిగారి సహృదయ  స్పందన చూసి ఆనందం పట్టలేక పోతున్నా! నేను చేస్తున్న పని ఇలా జ్ఞానకాంక్ష ఉన్న పదుగురి దాహాన్ని తీరుస్తున్నదంటే ఆనందం! మహదానందం!  ఈ సందర్భంగా అయ్య అలభ్య గ్రంధాలనిలా పునర్ముద్రించటం వెనుక, నా ఆరాధనా, తపనా కూడా  మిత్రులతో పంచుకుందామనిపిస్తున్నది.  1996 లో నేను మా అయ్యగారి అలభ్య గ్రంధాలనూ,అసంకలిత వ్యాసాలనూ (సంకలనాలుగా) ముద్రించటం మొదలు పెట్టిన తొలి రోజుల్లో 'మహభారత విమర్శనం' (దీన్ని కూడా  తెలుగు యెమ్మే చేసేటపుడు చదివి, అయ్య పట్ల ఆరాధన హిమాలయమంత పెరిగిపోయింది.) ముద్రించి, మా అయ్య పాదాల దగ్గర పెట్టి, నా జన్మ ధన్యమయిందని అనంద బాష్పాలతో విన్నవించుకున్నాను. అటు తరువాత,నా తపన, నన్ను విశ్రాంతి తీసుకోనివ్వలేదసలు.. 'ప్రాకృత వ్యాస మంజరి'(అయ్యగారి  అసంకలిత ప్రచురిత వ్యాసాలు) 'వ్యాస వల్మీకం' (అయ్యగారి, దాక్షిణాత్య  సాహిత్య వ్యాసాలు)'సరస్వతీపుత్రునితో సంభాషణలు' (వివిధ పత్రికలలో వచ్చిన అయ్యగారితో ముఖాముఖి-పరిచయాలు)  'శివకర్ణామృతం' (అయ్య సంస్కృత రచన అర్థంతో సహా+శివతాండవ సహితంగా - యీ సంస్కృత కావ్యం ప్రచురణ వెనుక పెద్ద కథే ఉంది),'పెనుగొండలక్ష్మి', 'మరపురాని మధుర గాధ' (విజయనగర సామాజిక చరిత్ర+విజయనగర సామ్రాజ్య కాలానికి చెందిన ఇతర వ్యాసాలు)   అ తరువాత,ఇటీవల 'త్రిపుటి' (అయ్య అపురూప వ్యాసాలు+పుస్తక సమీక్షలు+పద్య వ్యాఖ్యలు+కామకోటి పత్రికకు వ్రాసిన సంపాదకీయాలు) ఇవన్నీ చేస్తున్న సమయాల, నా నరనరాల్లోనూ, అయ్య నామస్మరణే!   ఒక్కొక్క గ్రంధం ప్రచురిస్తున్నప్పుడూ,ఇటీవలే శివైక్యం చెందిన  శ్రీ రామవజ్ఝల శ్రీశైలం గారి సహకరం మరువలేనిది. అయ్య అసంకలిత వ్యాసాలు వారు ఇచ్చినప్పుడల్లా, వాటిని ఒక శీర్షిక క్రింద యెలా ప్రచురించాలి, పుస్తకం పేరేమి పెట్టాలి,ముఖచిత్రం యెలా ఉండాలి...వీటన్నిటి గురించీ ఆలోచిస్తూ,  నిద్రలేని రాత్రులెన్నెన్నో!   నా పనులన్నిటిలోనూ అడ్డుపెట్టక సహకరించిన నా కుటుంబ సభ్యులందరికీ, ఆ గ్రంధాలన్నిటినీ కొని చదివి పుట్టపర్తివారి  సాహితీ త్రివిక్రమత్వాన్ని అనుభూతించిన అయ్య అభిమానులకూ ధన్యవాదాలు.   ('త్రిపుటి'  ' 'పెనుగొండలక్ష్మి'  'శివతాండవము' (బాపూగారి చిత్రాలతో సహా)  ప్రతులు శివతాండవం ఆడియో సీ.డీ.    నవోదయ -ఆర్యసమాజ్ దగ్గర, కాచిగూడ క్రాస్ రోడ్స్   వద్ద  లభ్యములు)..    ప్రియ మిత్రులకు విన్నపం.ఈ గ్రంధాల ప్రచురణ ఒక పద్మవ్యూహం వంటిది. చేయి తిరిగిన ప్రచురణకర్తలకు తప్ప యీ రంగంలో సామాన్యులైన మా అయ్యగారివంటి సమ్మాన్యులకు కూడా అపజయాలే చవిచూడవలసి వచ్చేది. నావంటి అర్భకురాలి సంగతి చెప్పేందుకేముంది? ఐనా, అయ్య సేవలో లాభనష్టాల గురించి ఆలోచించి అడుగు వెనకేయటం నాకస్సలు నచ్చలేదు. అందుకే ప్రచురణరంగంలో అభిమన్యుని ఆరాధకురాలిగా అడుగు పెట్టాను. ఈ   అమ్మకాలవల్ల వచ్చే డబ్బుతో అయ్య మరో గ్రంధం వెలుగులోకి వస్తుందన్న నమ్మకమే నన్ను  ముందుకు నడిపిస్తున్నది..        

Thursday, 24 September 2015

    ఇటీవల గోదావరి పుష్కరాల సమయంలోనూ, అటు మక్కా లోనూ జరిగిన ప్రమాదాల గురించి రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్న నేపథ్యంలో..  






      
      తప్పు యెక్కడ యే మతంలో యే ప్రాంతంలో   జరిగినా,  యెవరైనా 
దాన్ని సరైన కోణంలో చూడటం, వాస్తవాలను మాట్లాడగల్గటమే సరైన పద్ధతి. భగవంతుణ్ణయినా నిలదీయగలగటమే నిజమైన బాధ్యతగల్గిన పౌరుని (కళాకారులందరితో సహా) కనీస కర్తవ్యం.                    
        1967 ఆగష్ట్ 15, కామకోటి (కామకోటి పీఠ ప్రచురణ) సంపాదకీయంలో 
మా అయ్యగారు:
        ' ఈ నడుమ తిరుమలలో శ్రీనివాసుని ఆలయ ప్రాంగణమందే 
పంధొమ్మిది మంది మరణించినారు. కారణము-జనుల త్రొక్కిడి. క్యూ లో నిలిచికొన్న జనులకు అధికారులు  కల్పించిన అనుకూలముల వైభవము. ...ఈ దురాగతము పైన ఒక ట్రస్టీ బోర్డ్ సభ్యుడు చేసిన విచిత్ర వ్యాఖ్యానమొకటి ఉన్నది. అది మనందరమూ తెలిసికొనదగినది. 'పవిత్రమైన పుణ్య క్షేత్రములో ఇటువంటి సంఘటన జరగటమంటే,  స్వామికి యెక్కడైనా, యేదైనా అపరాధము యాత్రికుల వల్ల కానీ, పరిచారకుల వల్లకానీ, జరిగిందేమోనని అనుమానము కలదు.' ఓహోహో! తమ రాజకీయముల వాసన వెంకటేశ్వరుని  నామములకు కూడానంటించినారు. వారికి పై పద్ధతి యలవాటు. పాపమేమి సేతురు? ఒకడు తప్పు చేసిన, వాడు దిక్కులేనివాడైనచో, వాని బలగమునంతటినీ, మారణహోమమొనర్చెడు చిత్తవృత్తి రాజ్జకీయములందే! ఒక వేళ భగవంతుడు, వీరనుకొనునట్టివాడేయైనచో, అపరాధిని గుర్తించలేనట్టి గుడ్డివాడా  వెంకటేశ్వరుడు?
 ..శ్రీహరి సూక్తి 'యెక్కడో తన్నిన యెక్కడో యేమో జరిగినట్లున్నది.ఓహో స్వామి! నీవు దయామయుండవని మా విశ్వాసము. అన్నమయ్య నిన్ను
 'దయ కరుడుగట్టిన మూర్తి'గా వర్ణించెను. అట్టి నీవు, రాజకీయ వాదుల సూక్తులలో యెన్ని వేషములు వేయుచున్నావు? నీ దర్శనమునకై వచ్చిన జనముల్ను తొక్కుకొని  నిన్ను జూడ వచ్చిన 'మనుష్యు ' లకు దర్శనమిచ్చినావా? నిజమా? ఇవ్వవలసినట్టిచ్చినావా? అయినచో నీకన్నను దయ్యమే మేలు.'

(త్రిపుటి-పుట్టపర్తి నారాయణాచార్యులవారి అపురూప పీఠికలు, వ్యాఖ్యలు, వ్యాస సంకలనం నుంచి - 2012 లో ప్రచురితం)  
                                  .........................                     

Monday, 14 September 2015

punnaga : విశ్వనాధ వారి కల్పవృక్షంలో సీత(నా పరిశోధనలోనుండి ...

punnaga :
విశ్వనాధ వారి కల్పవృక్షంలో సీత(నా పరిశోధనలోనుండి ...
: విశ్వనాధ వారి కల్పవృక్షంలో సీత(నా పరిశోధనలోనుండి కొన్ని అంశాలు)  ఆధునిక రామకావ్యాలలో విశ్వనాథ వారి కల్పవృక్షం, ఒక కమనీయ రమణీయ శిల్ప వృక...

Sunday, 13 September 2015

punnaga :  ఫోటోలో (చాలా అరుదుగా) త్రిపుండ్ర  ధారిగా  కనిపిస్...

punnaga :  ఫోటోలో (చాలా అరుదుగా) త్రిపుండ్ర  ధారిగా  కనిపిస్...:  ఫోటోలో (చాలా అరుదుగా) త్రిపుండ్ర  ధారిగా  కనిపిస్తున్న పుట్టపర్తివారి గురించిన వివరణ ఇది.అయ్యతో అనేక సంవత్సరాల అనుబంధం ఉన్న కామిశెట్టివార...

punnaga :  ఫోటోలో (చాలా అరుదుగా) త్రిపుండ్ర  ధారిగా  కనిపిస్...

punnaga :  ఫోటోలో (చాలా అరుదుగా) త్రిపుండ్ర  ధారిగా  కనిపిస్...:  ఫోటోలో (చాలా అరుదుగా) త్రిపుండ్ర  ధారిగా  కనిపిస్తున్న పుట్టపర్తివారి గురించిన వివరణ ఇది.అయ్యతో అనేక సంవత్సరాల అనుబంధం ఉన్న కామిశెట్టివార...