Thursday 24 September 2015

    ఇటీవల గోదావరి పుష్కరాల సమయంలోనూ, అటు మక్కా లోనూ జరిగిన ప్రమాదాల గురించి రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్న నేపథ్యంలో..  






      
      తప్పు యెక్కడ యే మతంలో యే ప్రాంతంలో   జరిగినా,  యెవరైనా 
దాన్ని సరైన కోణంలో చూడటం, వాస్తవాలను మాట్లాడగల్గటమే సరైన పద్ధతి. భగవంతుణ్ణయినా నిలదీయగలగటమే నిజమైన బాధ్యతగల్గిన పౌరుని (కళాకారులందరితో సహా) కనీస కర్తవ్యం.                    
        1967 ఆగష్ట్ 15, కామకోటి (కామకోటి పీఠ ప్రచురణ) సంపాదకీయంలో 
మా అయ్యగారు:
        ' ఈ నడుమ తిరుమలలో శ్రీనివాసుని ఆలయ ప్రాంగణమందే 
పంధొమ్మిది మంది మరణించినారు. కారణము-జనుల త్రొక్కిడి. క్యూ లో నిలిచికొన్న జనులకు అధికారులు  కల్పించిన అనుకూలముల వైభవము. ...ఈ దురాగతము పైన ఒక ట్రస్టీ బోర్డ్ సభ్యుడు చేసిన విచిత్ర వ్యాఖ్యానమొకటి ఉన్నది. అది మనందరమూ తెలిసికొనదగినది. 'పవిత్రమైన పుణ్య క్షేత్రములో ఇటువంటి సంఘటన జరగటమంటే,  స్వామికి యెక్కడైనా, యేదైనా అపరాధము యాత్రికుల వల్ల కానీ, పరిచారకుల వల్లకానీ, జరిగిందేమోనని అనుమానము కలదు.' ఓహోహో! తమ రాజకీయముల వాసన వెంకటేశ్వరుని  నామములకు కూడానంటించినారు. వారికి పై పద్ధతి యలవాటు. పాపమేమి సేతురు? ఒకడు తప్పు చేసిన, వాడు దిక్కులేనివాడైనచో, వాని బలగమునంతటినీ, మారణహోమమొనర్చెడు చిత్తవృత్తి రాజ్జకీయములందే! ఒక వేళ భగవంతుడు, వీరనుకొనునట్టివాడేయైనచో, అపరాధిని గుర్తించలేనట్టి గుడ్డివాడా  వెంకటేశ్వరుడు?
 ..శ్రీహరి సూక్తి 'యెక్కడో తన్నిన యెక్కడో యేమో జరిగినట్లున్నది.ఓహో స్వామి! నీవు దయామయుండవని మా విశ్వాసము. అన్నమయ్య నిన్ను
 'దయ కరుడుగట్టిన మూర్తి'గా వర్ణించెను. అట్టి నీవు, రాజకీయ వాదుల సూక్తులలో యెన్ని వేషములు వేయుచున్నావు? నీ దర్శనమునకై వచ్చిన జనముల్ను తొక్కుకొని  నిన్ను జూడ వచ్చిన 'మనుష్యు ' లకు దర్శనమిచ్చినావా? నిజమా? ఇవ్వవలసినట్టిచ్చినావా? అయినచో నీకన్నను దయ్యమే మేలు.'

(త్రిపుటి-పుట్టపర్తి నారాయణాచార్యులవారి అపురూప పీఠికలు, వ్యాఖ్యలు, వ్యాస సంకలనం నుంచి - 2012 లో ప్రచురితం)  
                                  .........................                     

No comments:

Post a Comment