Tuesday 16 June 2020


                        

                                           పితృదేవోభవ !!! 


                            
 
                       సరస్వతీపుత్రులుగా వినుతికెక్కిన మా అయ్యగారు సాహితీప్రక్రియలన్నింటిలోనూ ఆరితేరినవారు. పైగా చతుర్దశాభాషా జ్ఞాన సంపన్నులు. ఇవే కాక, సంగీత నాట్య కళల్లో చక్కటి అభినివేశమున్నవారనేందుకు  వారి శివతాండవ కావ్యమే సాక్ష్యం.

                 అంతే కాదు, అష్టాక్షరీ ముద్ర తో దాదాపు ఏడువేల భక్తి కీర్తనలను కూడా వారు వ్రాశారు. అందులో అష్టాక్షరీకృతులు అన్న పేరుతో,  250 దాకా ఒక ముద్రణగానూ (1970లలో) , మా అమ్మగారు, భక్తి కవయిత్రి ఐన మా అమ్మగారు శ్రీమతి పుట్టపర్తి కనకమ్మ గారూ, మా అయ్యగారూ ఇరువురి భక్తి కీర్తనలను స్వర్ణగేయార్చనం అన్న పేరుతోనూ (నేనే ముద్రించాను, 2004 -05 ప్రాంతాల్లో) , కేవలం మా అయ్యగారు  పుట్టపర్తి వారి రచనలే 1001 కృతులు ఇటీవలే అయ్య శతజయంతి వత్సరంలో నా సంపాదకత్వంలో  (2014)  ప్రచురితమయ్యాయి. ఇవికాక, కొన్ని ఆకాశవాణిలో ప్రసారమౌతున్నా, పుస్తక రూపంలో రానివింకా ఓ నూరు కీర్తనలదాకా ఉండవచ్చును. 
          
          ఇటీవల నా పుస్తకాలలో బయటపడిన కీర్తనలను చూస్తే, లీలగా గుర్తొచ్చింది - వీటిని ఆకాశవాణి కడప భక్తిరంజని కోసం వ్రాశారేమోనని!! మా చెల్లెలు శ్రీమతి అనూరాధకు పంపి, అడిగితే, ఔనంది. అప్పుడు కడప ఆకాశవాణి  లో సంగీత నిర్వహణాధికారిగా ఉన్న కౌతా ప్రియంవద గారు యీ పాటలకు సంగీతాన్ని సమకూర్చగా, భక్తిరంజనిలో ప్రసారమయ్యేవట!! హమ్మయ్య!! రాగాలు లీలగా గుర్తున్నాయన్నది. సరే!! సాహిత్యమైనా భద్రపరుద్దామనిపించి..ఇదిగో ఇలా మీముందుంచుతున్నాను. డెబ్భై ఏళ్ళ వయసులో, వారు వ్రాసిన యీ రచనల్లో, పరమాత్మలో లీనమయ్యేందుకు ఒక సిద్ధ జీవుని వేదనలాగా అనిపించింది నకు!! ఈ కీర్తనలను టైప్ చేస్తున్నంతసేపూ, కన్నీటి ధారల మధ్య.. మా అయ్య కరణం బల్ల ముందు కూర్చుని తదేకంగా రాస్తున్న బింబమే నా కళ్ళముందు !!             

అయ్య తన 70 తరువాతి  వయసులో వ్రాసిన అముద్రిత కీర్తనలు..( వీటీలో అష్టాక్షరీ ముద్ర లేదు) 
.........................................................................
                     1. ఆది తాళం...లో
ప.    నామమును పాడవే!! మనస....                     .  నామ....
అను.   సోమ సూర్యులకు శోభ యగు..                      ..నామ...
చ.1.  ప్రేమ మను వీణియను కూర్చిన
       బాష్ప తంత్రులను సారించి....                         . .నామ..
చ.2   రోదనమె రాగముగ హృదయపు
       వీధులను, భావముల బారించి..                          నామ..
చ.3.  దైన్యమే లయగా, పరాత్పరు
       ధ్యానమే శ్రుతిగా, గమకముల..                          .నామ..
..................
                                   2. ఝంపె తాళం
ప.   విరహిణీ సందేశమందుకోవోయీ..
అను. పరమ పురుషా!! నీకు భ్రమసి తిరుగుచునున్న            ..వి..
చ.1.  నీటనుండెడు చేప నీరు కరవైనచో
       పాటింపదా యెట్లు  బ్రదుకగా గలదో..                           వి...
చ.2.  కనులలో చీకటులు గ్రమ్ముకొన్నటులయ్యె
       నీవు వచ్చెదవంచు నిడుద చూపుల జూచి.                     .వి..
చ.3.  పిలచి పిలచీ నాల్క, పిడుచగట్టినది, ము
       వ్వల మ్రోతవై, చెవుల  పారాడరా.. ముందు.                      .వి..
చ.3.  నీవు రాకుండితే నీ నామ జపములో
       నీవె నేనైపోదునేమో, జగన్నాధ !!....                             వి..                               ……                          …….3……………….
ప.   ఎక్కడ లేవూ, ఎల్ల దిక్కులన......              ఎక్కడ...
అ.ప. చక్కగ ప్రేమాంజనము బూసికొన..             ఎక్కడ..
చ. 1 రెక్క రెక్క గూర్చి, రెచ్చిన ముదమున
      కువ కువ గూయు పక్షుల కన్నుల..నీ.        .వెక్కడ..
చ.2. జోడు వీణెలతోడ నీదైన ఝంకృతి
      గూడ నడవులు జుట్టు కొదమ తుమ్మెదలన్ దెక్కడ...
చ.3. అలసానిలమ్ముగ నల్ల   వంపెడు  గాలి
      కాప్యాయముగ తూగునట్టి వల్లరుల...    ..ఎక్కడ..
చ.4. సర్వమూ నీవయ్య, శోధించునా స్వామి!!
      తిరిగి చూసుకున్న తీరి నా హృదయమన్. .దెక్కడ..
....................
                     .........4..........
ప.   ఎక్కడిదీ మురళీనాదం.....                         ..బెక్కడిదీ...
అను.  అక్కజముగ రసమై, రసమయమై..            ...ఎక్కడిదీ..
చ.1. తెలి కొండల చరియలపై భానుడు,
      కనులకించు రాగంబు బండునపు..              ....డెక్కడిదీ..
చ.2. వయసు చెల్ల భాస్వంతుడు పశ్చిమ
      గిరుల దరులలో విశ్రమించునపు....               ..డెక్కడిదీ..
చ.3. అమావాస్యలో పున్నమలో సా
      గరుని ఎడదలో గలుగు మారుపుల....             ..ఎక్కడిదీ..
చ.4. పలు దు:ఖమ్ములు సోకినపుడు నా
      హృదయ వీణలో జీవుని వేదన......                ...ఎక్కడిదీ..
                                       .......5..........
ప.    ఏకాంతమునను నుందువందురీ జనులెల్ల
       రీ సందడులలోన లేనటుల నీవూ..                    ..ఏకాంత..
చ.    బాటలను దీర్చుటకు పగులగొట్టెడు రాళ్ళ
       సవ్వడుల తెగ గారు చెమట వాగులలోన..
                  నీవు లేనటులూ....                            ..ఏకాంత..
చ.    నడిమింట సూర్యునెండల పొలము దున్ను హా
       లికుని యాకల నూర్పు సెగల నూర్పులలోన..
                  నీవు లేనటులూ...                               .ఏకాంత..
చ.    దయలేని మృత్యువృద్ధ  విడి ప్రేమల జంట
       విడదీయ వారి రోదనములో మూల్గులో
                  నీవు లేనటులూ.....                               ఏకాంత....
                                         .......6.........
ప..  ఏది నీవూ నడచుమార్గంబేవి నిన్నూ జూచు  కన్నులు.        ..ఏది..
అను. ఈ విధానంబింత దెలుపుము ఏర్పడని స్వామీ...                .ఏ..
చ.  ప్రేమ బాటలలోన నడచుచు దైన్యమై నను జూచు కన్నులు 
     విరహ    గీతిక   దారి బత్తెము, విక్లబిత జీవా.                       ..ఏ..
చ.  ఏది నీ వసియించు గృహమ్మేది నీ చేయూత ఏదీ,
     ఈ విధానంబింత దెలుపుము ఏర్పడని స్వామీ..
చ.  సర్వ హృదయము లాట పట్టులు సర్వ చేష్టలు నావి సుమ్మీ,
     విశ్వమున నా కన్న భిన్నత, లెందులేవోయీ..
     విశ్వమే నా చేతి వల్లకి విశ్వమే నేనౌదు రాగ వి
     లీన మానసమౌచు నిత్య సమాధి నిష్టుడనై...ఏ..
                         ............7.............
 ప.               ఎన్నడో సాయం ఘంట మ్రోగునోయీ...
 అను.            కన్నులుగప్పే కాలుడు గొని చను, కలకాలము
                   నీ మనుగడ సాగదు...                         ..ఎన్నడో
 చ.   తరుణియు కామికి దాటరాని కను
       మలురా!! అడుగులు   దెలివిగ    వేయుము.              ..ఎన్నడో
 చ.   మానంబొక ఉన్మత్త శునకమై
       కాటువేయురా..కన్ను గల్గి పా                 ..మ్మె..
 చ.   చదువులోన నీశ్వరుని వెదకెదవు
       చదువుగాదు, ప్రేమయె పాధేయము...                         ఎన్నడో...
                   ......................8……………..
    ప. కూడు  వండుట  గంజి కొరకైన యట్లయ్యె..
     వేడుకలకై బ్రదుకు నెచ్చమిడుదాన...         .కూడు..
 చ. కొలుచు దంచుట పొట్ట కొరకె యైనట్లయ్యె..
     వెలలేని సుఖములకు వేకారుదాన.....          .కూడు
 చ. కొండ ద్రవ్వుట ఎలుక కొరకైనయట్లయ్యె.
     దండుగకు  విత్తముల దగులువడుదాన  .    కూడు..
 చ. పరమ పురుషుని జాడ మరచి యట్టిట్టులుగ
     తరచు కోర్కెల వెంట, తడవాడుదానా.            ..కూడు..
                              .....................9………………….
  ప.  నాతి నవయుచునున్నదీ...
 అను.  ప్రీతియను జపమాల రేబవలు ద్రిప్పుచును....     నాతి..
  చ.  ఊరు పేరునులేని  యొకనికై మనసులో..
       సారంగ కేశి యొక సౌధంబు గట్టికొని  .               .నాతి..
  చ.  వచ్చునో! రాడొ ! తా వచ్చుటెన్నడొ! వలపు
       చిచ్చులో కర్పూరమై, జీవితము గరుగ...              నాతి..
  చ.  ఆశలకు ద్వారంబులైన యక్షి యుగమ్ము
       సతతంబు దెరచికొని, సకియ తా నిల్చికొని.           ..నాతి..
......................................................................
     
..................................................

No comments:

Post a Comment