Sunday 25 October 2015


      మన దేశం, తత్వవేత్తలకూ, ఆధ్యాత్మిక గురువులకూ చాలా పేరొందినది. ఆయా కాలాలలో పలువురు ఆధ్యాత్మికవేత్తలు దేశ భవితను తీర్చిదిద్దే ప్రక్రియలోనూ తమవంతు పాత్ర పోషించినట్టు చరిత్ర చెబుతున్నది.
       విజయనగరసామ్రాజ్యస్థాపనకోసం విద్యారణ్యులవారి సమయోచిత చర్య ఇప్పటికీ ఆశ్చర్యజనకమైంది.  బలవంతంగా మతమార్పిడికి లోనై, కుంగిపోయివున్న హరిహర బుక్కరాయలను  మళ్ళీ హిందూమతంలోకి మార్చి, వారిరువురిలోనూ ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేశారు వారు. తన వుపాసనాశక్తితో అమ్మవారిని వేడుకున్నారు-హిందూసామ్రాజ్యస్థాపన స్వప్నానికి తగిన  భాగ్యరాశులను కురిపించమని! అమ్మ కనకవర్షం కురిపించి కరుణించింది. ఆ ధనంతో హరిహర బుక్కలకు తగిన  సైనిక బలం అన్ని హంగులతో చేకూరింది. విద్యారణ్యులవారి కల, విద్యానగర రూపంలో సాకారమైంది.విజయపరంపరలతో  విజయనగరమైంది.
       తులసీదాసు రామాయణం- ఉత్తర హిందూదేశంలో ప్రతిగడపలోనూ ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. తులసీదాసు కేవలం రామాయణ కావ్యకర్తగానే కాక,అప్పటి హిందూ సామ్రాజ్య పరిరక్షణకై సహకరించిన ఒక తపస్విగా కూడా మనకు పరిచయమవుతాడు 
రాణా ప్రతాపసిమ్హుని జీవిత సంఘటన ద్వారా!
          ఒకసారి వారు తన రామాయణ ప్రవచనం చెబుతున్నారట! సుందరకాండలో హనుమ వీరోచిత కార్యాలను సర్వమూ మైమరచి వింటున్నారందరూ! అందరికన్నా చివరగా ఆసీనుడై వున్నాడొక వ్యక్తి. ఆజానుబాహుడు.ముఖంలో నీరవత దోబూచులాడుతున్నా  రాజోచిత లక్షణాలతో ఏదో తెలియని ఆకర్షణ అతని ముఖంలో! ప్రవచనం ముగిసింది. అందరూ ఆనందోద్వేగాలతో కథగురించి చర్చించుకుంటూ వెళ్ళీపోయరు. కానీ యీ వ్యక్తి వెళ్ళలేదు.    తులసీదాసులవారు అతన్ని పిలిచారు. యెందుకింకా ఇక్కడే వున్నావని అడిగారు. అతను . 'స్వామి! మీరు మహాతపస్సంపన్నులు. మీ మహిమతో హనుమను పిలిచి హిందూ సామ్రాజ్య రక్షణచేయించండి.'  అన్నాడు. తులసీదాసుగారి మోమున చిరునవ్వు. 'హనుమ వంటి రాణా ప్రతాపసిం హుడున్నప్పుడిక హిందూ సామ్రాజ్యానికి భయమెక్కడిది?' అన్నారాయన. ఆ వ్యక్తి తల వినయంగా వంచి కన్నీరు కనబడనీయకుండా అన్నాడు 'ఆ నిస్సహాయుడైన రాణా ను నేనే స్వమీ' అని.తులసీ ఆశ్చర్యపోయారు. అప్పుడు రాణా -  అక్బర్ సైన్యం ముందు తన  పరాజయం,  తనవద్ద తగిన సైన్య బలం లేని నిస్సహాయ స్థితిలో అడవులలో ఆకులూ, అలములూ తింటూ గడుపుతున్న ప్రస్తుత స్థితీ-  రాజా మాన్ సింగ్ ఆక్బర్ ఆజ్ఞ తో  తనకొసం తీవ్రంగా అడవులలోనూ గాలిస్తూ ఉండటం,  ఇవన్నీ వివరంగా చెప్పి, కాసేపు ఆగాడు. తులసీదాసుగారి వదనంలోనూ ఆందోళన! రాణా మళ్ళీ మొదలు పెట్టాడు. 'నా రోజులు బాగులేవు. నాకు కాస్త వ్యవధి చిక్కితే మళ్ళీ సైన్యాన్ని సమకూర్చుకుని ఆక్బర్ పై విజయం సాధిస్తాను.  ఇప్పుడీ మాన్ సింఘ్  నుంచీ నన్ను మీరే కాపాడాలి. అతన్ని నావైపు రాకుండా మీరే చేయాలి' అని విన్నవించుకున్నాడు. తులసీ హామీ ఇచ్చినమీదట అక్కడినుంచీ నిష్క్రమింఛాడు రాణా!
    రాణా  చెప్పినట్టే మాన్ సింగ్ వచ్చాడు. తులసీకి పాదాభివందనం చేశాడు. ఆద్యాత్మిక గురువులను యెవరైనా సరే గౌరవించే అచారం అప్పట్లో ఉండేది. 'నేనిచ్చే కానుకలు స్వీకరించండి. మీ సేవచేసుకునే భాగ్యం కలిగించండి'.అని ప్రార్థించాడు మాన్ సింగ్. తులసీ జవాబిది. 'ధనంతో నాకు పనేముంది నాయనా! నాకో మాటివ్వు. అది చాలు.'  మాన్ సింగ్ అంగీకారంగా తల వూచి, గురువుగారి ఆజ్ఞకై వేచి ఉన్నాడు.   తులసీ గంభీర స్వరం. 'రాణా నా ఆరాధకుడు. అతన్ని ప్రస్తుతానికి వదిలిపెట్టు. ఇది నా ఆజ్ఞ.' మాన్ సింఘ్ మారుమాట్లాడకుండా వెనక్కి వెళ్ళిపోయాడు. రాణ తరువాత కొద్ది రోజులకు సైనిక బలం చేకూర్చుకుని ఆక్బర్ ను యెదుర్కొన్నాడు.
   ఇటువంటి యెన్నో విషయాలు మా అయ్యగారి రామాయణ ప్రవచనాలలో చిన్నప్పుడు వినేదాన్ని. ఇవే కాక, కాలభైరవొపాసన రహస్యాలు, ప్రత్యంగిరాదేవి, విదేశీయులెందరో మన సంస్కృతిపట్ల ఆకర్షితులైన, ఇప్పటికీ ఆకర్షితులవుతున్న  తీరు- ఇవన్నీ కుర్తాళ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద  భారతీస్వాములవారి ప్రవచనాల్లో వింటూ రోజూ తరిస్తున్నాను. 


పూర్వాశ్రమంలో ప్రసాదరాయ కులపతిగా,సుప్రసిద్ధ రచయితగా విఖ్యాతులైన వారిగురించి అయ్య మాటల్లోనూ తరచూ వినేదాన్ని. ఇటీవల యేదో విషయంగా  నా వద్ద వున్న అయ్య పుస్తకాలను తిరగేస్తూ వుంటే, ఒక ఇన్ లాండ్ లెటర్ చాలా పాతది దొరికింది. యేమిటబ్బా అని చూస్తే, ఆనందం,  ఆశ్చర్యం- ఒకే సారి ముప్పిరిగొన్నాయి.దాన్ని మీతోనూ పంచుకుందామనిపించి ఇలా......
                                                                                                    25-10-15

No comments:

Post a Comment