Tuesday 1 December 2015

Part 3
 

తెలుగులో నన్నయభట్టే ఆదికవి అని చాలారోజులు అనుకునేవాళ్ళం. నన్నయ భారతంవంటి ప్రౌఢరచన హఠాత్తుగా ఒకనాడు ఆవిర్భవించిందంటే నమ్మడం చాలా కష్టం. యెన్నో తరాలుగా యెంతమంది విస్మృత కవుల చేతిలోనో తెలుగు కవిత్వం క్రమ క్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చి, నన్నయనాటికి, భారతం పరిపక్వ స్థితికి వచ్చిందనుకోవటం సమంజసం. ముఖ్యంగా బౌద్ధులూ, జైనులూ దేశీయ భాష ఐన తెలుగులో యెన్నో కావ్యాలు వ్రాసివుంటారని నా విశ్వాసం. ఆ యుగాలనాటి మతకలహాలలో హిందూ దురభిమానులు తమది పైచేయైనప్పుడు, ఆ సాహిత్యాన్నంతా నాశనం చేసి ఉంటారు. గురజాడ బతికి వున్నప్పుడే యుద్ధమల్లుని బెజవాడ శాసనం దొరికింది. యుద్ధమల్లుడే ఆదికవి అని ఆయన సాహసంగా గుర్తించినాడు. కన్నడంలోని పంపభారతం గురించికూడా ప్రస్తావించినాడు. నన్నయ భారతంలో పంపభారతం యొక్క ప్రభావం కనబడుతున్నదని కొన్ని యేండ్ల కిందట ఆలంపూర్ సాహిత్య సభలో నేను సోదాహరణంగా నిరూపించినప్పుడు తెలుగు భక్తులందరూ నా మీద విరుచుక పడినారు. నేనసలు తెలుగువాణ్ణే కాదనీ, మారువేషంలో వున్న కన్నడంవాణ్ణనీ నన్ను నిందించారు. నేను చెప్పిన అభిప్రాయం గురజాడ ఆనాడే వెలిబుచ్చినాడు. కానీ తెలుగువాళ్ళ దురభిమానం మితిలేనిది. నన్నయ మహాకవి అంటే వాళ్ళకు తృప్తిలేదు. నన్నయ ఋషి అనే చాదస్తులూ, నన్నయ దేవుడు అనే మూర్ఖులూ బయలుదేరినారు..

గురజాడ చిన్నప్పటినుండే ఇంగ్లీషులో గద్య పద్యాలలో రచనలు చేసేవాడు. సంస్కృతం బాగా రావటమే కాక సంస్కృత వ్యాకరణంతో కూడా మంచి పరిచయం వున్నట్టు వూహించవచ్చు. అనంద గజపతి మహా ప్రౌఢుడైన కవి. అయనచుట్టూ, దిగ్దంతులవంటి పండితుల గౌరవం పొందినాడంటే వారి పాండిత్యం సామాన్యంగా వుండదు.
గజపతి వంటివారు, గురజాడను ఆదరించడం ఒక ఆశ్చర్యమైన విషయం.
.....................

గురజాడ సాధించిన సాహిత్య విప్లవం చాలా గొప్పది. బాల వ్యాకరణ ప్రౌఢ వ్యాకరణ సూత్రాలకు లోబడిన ప్రయోగాలు తెలుగులో చాలా యెక్కువగా వున్నయి. ఆంధ్ర శబ్ద చింతామణి మొదలుకొని తెలుగు వ్యాకరణాలన్నీ చాలా సంకుచితమైన దృష్టి గలవి. మన వ్యాకర్తలు శైవ సాహిత్యాన్ని గుర్తించనేలేదు. కృష్ణరాయల తరువాత వచ్చిన ప్రబంధాలకూ, మధుర తంజావూరు రాజుల కాలంలో వచ్చిన వచన సాహిత్యనికీ వాళ్ళూ యేమాత్రమూ విలువ ఇవ్వలేదు. అందుకనే ఆ వ్యాకరణాలు అంత సంకుచితంగా తయారైనాయి. అసలు ఒక జీవద్భాషను వ్యాకరణ సూత్రాలలో బంధింపజూడటమే కుంజర యూధమును దోమ కుత్తుకలో యిరికించడానికి చేసే ప్రయత్నం వంటిది. జీవద్భష ఐన తెలుగులో అనంతమైన ప్రాంతీయ భేదాలున్నాయి. అట్లే, సంస్కృతంలోనూ పాణిని వ్యాకరణానికి వ్యతిరేకమైన ప్రయోగాలు అనేకం - వ్యాసునిలో, వాల్మీకిలో, అంతకు పూర్వపు వైదిక సాహిత్యంలో వున్నాయి. సంస్కృతం జీవద్భాషగా వున్న రోజుల్లో బౌద్ధ జైన వాజ్మయాలలొ యీనాటి మహాపండితులకు కూడా అర్థం తెలియని ప్రయోగాలు అనేకం చేయబడ్డాయి. కాబట్టి జీవన భాషను వ్యాకరణపు సంకెళ్ళలో బంధించబూనుకోవడం సాహితీపరులెవ్వరూ సహింపకూడని విషయం. యీదృష్టితో వ్యాకరణ భక్తులకు వ్యతిరేకంగా గురజాడచేసిన రచనలు తెలుగు సాహిత్యానికి నూత్న యౌవనం ప్రసాదించినాయి. సశేషం...(ఇది 1968 ప్రాంతాలలో కడపలో జరిగిన గురజాడ వర్ధంతి సభలో పుట్టపర్తివారు వెలువరించిన అభిప్రాయాలకు అభిప్రాయాలకు విశాలాంధ్ర వార్తా పత్రిక ప్రకటించిన విపుల వార్తా వ్యాఖ్యలోని భాగం)
                                                    2-12-15


No comments:

Post a Comment