Tuesday, 5 September 2017
Sunday, 27 August 2017
Monday, 14 August 2017
Thursday, 20 April 2017
.........................
మొగలి పూతావులు .. నారాయణాక్షర మౌక్తిక మణులు...అక్షర అక్షయ నిధులు....... అయ్య యెంత శ్రద్ధగా తాను చదివిన విషయాలను భద్ర పరచుకునే వారో చూడండోసారి ! వీటి ఆధారంగా...యెదో వ్యాసాన్ని వ్రాసే ఉంటారు....లేదూ..తన ఉపన్యాసాల్లో ప్రస్తావించే ఉంటారు...ఇలాంటివి విజయనగర సామ్రాజ్యం గురించిన చిన్న చిన్న బుక్-లెట్లూ, తిరుప్పావై ప్రసంగ పాఠాలూ..రాస పంచాధ్యాయి..(ఇవన్నీ చిన్న బుక్ లెట్స్ గా కుట్టి ఇచ్చే పని నాదే అప్పట్లో) సంగీతంలో మృదంగ జతులు (తాను 65 యేళ్ళ వయసులో ఆకాశవాణి కడప మృదంగ విద్వాంసుడు శ్రీ భాస్కర భట్ల వారి వద్ద అభ్యసించినవి) ఇవన్నీ నా దగ్గర ఉన్నాయింకా...వీటిని అద్యయనం చేయటానికి యెంత సమయం పడుతుందో నాకు...
......................................
Tuesday, 11 April 2017
అయ్య చూసి (పి) న హంపీ(2nd Part)
..........................
కృష్ణదేవ రాయలకు తన ప్రజలపట్ల, సైనిక సంపద పట్లా, వాణిజ్య సముదాయం పట్లా, యెంతటి ప్రేమాదరాలుండేవో, కళల పట్ల కూడా అంతకన్నా రెట్టింపు అభిరుచి ఉండేదన్నది - మనకు సాక్ష్యాలతో కూడా దొరికిన ఆధారం.
కృష్ణదేవరయలవారి
కీర్తి పతాకలుగా నేటికీ, గర్వంగా నిలచి ఉన్న హంపీ విరూపాక్ష దేవాలయం,
రాతిరధం, విఠలేశ్వరాలయం, రాణివాసపు స్నానాగారమైన లోటస్ మహల్, సప్తస్వర
మండపం, బృహదీశ్వరాలయం, లేపాక్షి, తిరుమల వేంకన్న దేవాలయ స్వర్ణ ఖచిత
గోపురం, పెనుగొండ రామాలయం, ఇంకా యెన్నెన్నో !
భువన
విజయ కవులైన, పెద్దన, తిమ్మన, మాదయగారి మల్లన, దూర్ఝటి, అయ్యలరాజు
రామభద్రుడు, పింగళి సూరన, రామరాజ భూషణుడూ, తెనాలి రామలింగ కవీ- వీరి వైభవం
మాటల్లో వర్ణించలేనిది. వీరందరి ప్రబంధ రాగ ఝరులలో మునకలు వేసి
రసానందాన్ని గ్రోలిన రాయలకు, ఆముక్త మాల్యద రూపంలో తన రచనాభినివేశాన్ని
ప్రదర్శించుకోనిదే కునుకుకూడా పట్టలేదు అంటే అతిసయోక్తి కాదేమో ! కావ్య
రచన సేయుమని ఆజ్ఞాపించినది అంధ్ర విష్ణువే ఐనా, అప్పటికే అన్నమయ్య తేట
తెనుగు పదాలలో తియ్యందనన్ని జుర్రుకుని ఇంకా తనివితీరనట్టుగా వెలితిగా
నిలుచుని వున్న యేడుకొండల రేనికే తన కావ్య కన్నియను సమర్పించి, తెలుగు
రాయనిగా తన జీవితం సఫలమైనదని హాయిగా నిట్టూర్చాడా ఆంధ్ర భోజుడు !
కర్ణాటక
సంగీత శిక్షణకు ఒక నిబద్ధతను కల్పించిన పురందర దాసులవారు కృష్ణదేవరాయల
సమకాలికుడు. ఇంకా వాదిరాజులవారు, ప్రముఖ కన్నడ భక్త కవి కనకదాసు కూడా రాయల కాలంలోని స్వర్ణయుగానుభవాన్ని చవిచూసినవారే ! అదే కాలంలో భరత ముని నాట్య శాస్త్రం ఆధారంగా భరత నాట్యమూ పరిఢవిల్లిందట !
కన్నడ
సరస్వతిని అర్చించి వీరశైవామృత, భావచింతారత్న, సత్యేంద్ర చోళగాధె వంటి
రచనలు చేసిన మల్లనార్యుడు, కృష్ణ నాయక రచయిత తమ్మన్న కవి, భేదోజ్జీవన
తాత్పర్య చంద్రిక న్యాయామృత తర్క తాండవ వంటి అజరామర గ్రంధలను రచించడమే
కాదు. కృష్ణదేవరాయలవారి కులగురువుగా గౌరవాన్నందుకున్న వ్యాసరాయలవారూ,
రాయలపై వాత్సల్య ధారలు కురిపించిన వారిలో ప్రధములు.
విజయనగరసామ్రాజ్యస్థాపనకోసం విద్యారణ్యులవారి సమయోచిత చర్య ఇప్పటికీ ఆశ్చర్యజనకమైంది. బలవంతంగా మతమార్పిడికి లోనై, కుంగిపోయివున్న హరిహర బుక్కరాయలను మళ్ళీ హిందూమతంలోకి మార్చి, వారిరువురిలోనూ ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేశారు వారు. తన వుపాసనాశక్తితో అమ్మవారిని వేడుకున్నారు-హిందూసామ్రాజ్యస్ థాపన స్వప్నానికి తగిన భాగ్యరాశులను కురిపించమని! అమ్మ కనకవర్షం కురిపించి కరుణించింది. ఆ ధనంతో హరిహర బుక్కలకు తగిన సైనిక బలం అన్ని హంగులతో చేకూరింది. విద్యారణ్యులవారి కల విద్యానగర రూపంలో సాకారమైంది.విజయపరంపరలతో విజయనగరమైంది.
కృష్ణదేవరాయలవారి కులగురువుగా గౌరవాన్నందుకున్న వ్యాసరాయలవారూ, రాయలపై వాత్సల్య ధారలు కురిపించిన వారిలో ప్రధములు. అసలు
కృష్ణ దేవరాయల అస్థిత్వానికే ఆధరంగా నిలిచిన వ్యాసరాయలవారిని కూడా
స్మరించి తరించవలసిన అవసరం మా అయ్యగారి మాటల్లోనే ఇలా ఉంది.
ఒక దేశాధినేతగా, ఒక పరిపాలనాదక్షునిగా,ఒక కళాభిమానిగా,
ఒక వాణిజ్య వేత్తగా, న్యాయ
సం రక్షకునిగా, బహుముఖీనమైన వ్యక్తిత్వంతో దక్షిణ భరత దేశ
చరిత్రనే తన వెంట నడిపిన ధీశాలి రాయలవారిని తన ఉపాసనాబలంతో తిరుగులేని
నాయకునిగా నిలిపిన పరమ పవిత్ర యోగివర్యుడే వ్యాస రాయలవారు.
మధ్వ మత సమున్నత వ్యాప్తికి మూలస్థంభమనదగిన శ్రీపాద రాయలవారి శిష్యుడైన వ్యాస రాయలవారు, పుట్టుకతోనే అసమాన మేధస్సుకూ, అమేయ సాధనాసంపత్తికీ, ప్రసిద్ధి చెందిన కారణం, అసలు బాలునిగానే వారు సన్యాసం స్వీకరించటం, భగవదాజ్ఞ
వల్లే సాధ్యమైనదని తెలిపే కథ. సాళువ నరసిం హ రాయని కాలంలోనే తిరుమల
పవిత్ర మందిరంలో కలియుగ ప్రత్యక్ష దైవం పూజాదికాలలో జరిగిన దోష నివారణకై, వ్యాసరాయలవారిని ప్రార్థించి, అక్కడ వారిని ఉండేలా నిలిపారట ! పన్నెండు వత్సరాలు, నిరాఘాటంగా, పూజాదికాలు జరిపి, దోష నివారణ చేసి, అటు తరువాతి నిత్య పూజలకై, వంశపారంపర్య పూజారులను నియమించి తాము తపస్సమాధిలోకి వెళ్ళీపోయారు - వ్యాసరాయలవారు. ఈలోగా, విజయనగర
సామ్రాజ్య రమ శ్రీకృష్ణదేవ రాయలవారిని వరించింది. కానీ చిన్న అపశృతి.
రాయలవారి జాతకరీత్యా వున్న కుహూ యోగం వారిని కబళించివేస్తుందని జాతక
పండితుల హెచ్చరిక !
అమరసిం హుని 'నామలింగానుశాసనం' లో వక్కాణించినట్లు, ఒక అమావాస్య నాడు, రవి, కుజ, శని, రాహువుల కలయిక పన్నెండవ ఇంటిలో జరిగినపుడీ ప్రమాడం సూచించబడినట్టు తెలుస్తున్నది. (తేదీల ప్రకారం, 4 ఫిబ్రవరి, 1514 వ సంవత్సరం, అమావాస్య రోజు, స్వభాను వత్సరం, మాఘ అమావాస్య, శతభిష నక్షత్రం ఆరోజు సూర్య గ్రహణమూ వుండివుండవచ్చునని స్వామి కన్నుపిళ్ళెగారి వ్యాఖ్య ) ఫలదీపిక (6/61) ప్రకారం, యీ ' కుహూ ' యోగ ఫలంగా - జాతకునికి బంధు మిత్ర పరివార జనులందరినుండీ వియోగమే కాక, నివసించేందుకు నీడ కూడ కరవై, ఆఖరికి, ప్రాణహాని సంభవించే ప్రమాదమున్నదని చెప్పటం మరింత అందోళనకు గురి చేసింది అందరినీ !
ఈ ఆపదనుంచీ, తనను రక్షించే మహాపురుషునికై పరితపిస్తూ, గజరాజానికి పూలదండ నిచ్చి, అది యెటు వెళ్తే అటు పరుగులు పెడుతున్న సమయం. అది యెక్కడో, కొండకోనల్లో
ధ్యానమగ్నుడై వున్న వ్యాసరాయలవారి కంఠసీమలో పూలమాలను అలంకరించింది.
శ్రీకృష్ణదేవరాయలకు ఊపిరి లేచి వచ్చింది. వారి పదములంటి, శరణు వేడాడు. వారంగీకరించారు. విజయనగర ప్రవేశం చేశారు. కుహూ యోగమున్న రోజు, సిం హాసనాన్ని అధిష్ఠించారు. వారిని ఆ ఘడియలలో కుహూ యోగం, ఒక విష సర్పం రూపాన కాటువేసేందుకు వచ్చింది. అప్పుడు వారు దాని వైపోచిరునవ్వుతో చూశారు. అలా నవ్వుతూనే, దానిపై, తన ఉత్తరీయాన్ని వేశారట ! అది కనురెప్ప పాటులో, మలమల మాడి, బూడిదగా కిందికి రాలింది. తాను సం హాసనాన్ని అధిరోహించిన అవసరం, అలా శుభప్రదంగా పరిణమించిన మరుక్షణం, వ్యాసరాయలవారు, శ్రీకృష్ణ దేవరాయలను పున: పట్టాభిషిక్తుని చేశారట ! తనకు ప్రాణ భిక్ష పెట్టినందులకు కృతజ్ఞతాసూచకంగా, వారికి స్వర్ణ సిం హాసనం పై, నవరత్నాభిషేక మహోత్సవం రాయలవారు అనితరసాధ్యంగా చేశారని చరిత్ర !
విజయనగరాధీశుని కుహూ యోగం విపత్తు నుంచీ, విముక్తి కలిగించిన వ్యాస రాయలవారు ఉపాసనా బలంతో, భక్తి తన్మయతతో, బాల కృష్ణుని సైతం తమ కనుసన్నలలో ఆడించేవారట ! యమునాకల్యాణి రాగంలో 'కృష్ణా నీ బేగనె బారో' అంటూ కృష్ణుని రా రమ్మంటూ, తమ మధుర స్వరంలో వారు పిలిస్తే చాలు, పట్టుపీతాంబరం ధరించి, శ్రీచందన ఘుమ ఘుమలు అలముకొంటుండగా, కాళ్ళగజ్జియల ధిమిధిమి ధ్వనులతో నాట్యమాడుతూ, ఆ లీలామానుష వేషధారి, ప్రత్యక్షమవ్వాల్సిందే మరి !
హంపిలో ' యంత్రోద్ధారక ప్రాణదేవరు ' ప్రతిష్ట చేయాలని సంకల్పించారు వ్యాసరాయలవరు. వాయు చిత్రాన్ని వరు వ్రాసిన మరుక్షణం, ఆ చిత్రం మాయమైపోయేదట ! ఇలా పన్నెండు రోజులు గడిచింది. అ రోజు పదమూడోరోజు. వ్యాస రాయలవారు, వాయు పటం గీచి, దాన్ని ఒక యంత్రం మధ్యలో బిగించరు. పన్నెండు వానరాలు, ఒక
దాని వాలాన్ని మరొకటి పట్టుకుని ఉన్నట్టుగా ఆ వాయు చిత్రం చుట్టూరా
చిత్రీకరించారు వారు. ఇక ఆ బంధంలో నిలిచిన వాయు జీవోత్తముల వారు, బైటికి వెళ్ళలేక అలాగే అక్కడే నిలచిపోయారనీ, దాన్నే హంపి లో వారు స్థాపించారనీ, అ యంత్రం ఇప్పటికీ అక్కడ ఉన్నదనీ ప్రతీతి.
ఇదిలా ఉండగా, అయ్యా అమ్మా ప్రతి చోటా, ప్రాకారాలపై ఉన్న శిల్పాలను చాలా నిశితంగా చూస్తుంటే 'అబ్బా, యేముందబ్బా, యీ శిల్పాలలొ!' , అని
అప్పటికి (నాది చిన్న వయసు కదా అప్పుడు) విసుగొచ్చినా, తరువాత పెద్దైన
తరువాత చర్విత చర్వణం చేసుకుంటే, అయ్య గత జన్మలో యీ ప్రాంతాలతో గట్టి బంధమే
కలిగి ఉండేవారనిపిస్తుంది, ఇప్పుడు !
శిల్పాల వెనుక ఆయా శిల్పుల సహజ నైజం కూడా కనిపిస్తుందట !
విట్ఠల, విరూపాక్ష, కృష్ణ స్వామి గోపురాలు, అచ్యుతాలయం - ఇక్కడి కల్యాణ
మంటప స్థంభాలపై ఉన్న బొమ్మలలోని సహజ శృంగారం, ఆ బంధాలూ, అన్నీ కళాశాస్త్ర
బద్ధంగానే ఉన్నయని అమ్మా, అయ్యా అనుకునే వారని, తరువాతెప్పుడో, (నేను
పెద్దైనతరువాత అమ్మతొ అక్కడికి వెళ్ళినప్పుడు) తనే చెప్పింది. ఇలాంటి
విశేషాలు మనకు దొరకాలంటే కళ్ళల్లో వొత్తులు వేసుకుని వెదకాలట మరి ! క్రోధ
ప్రదర్శన కోసం, భీమసేన దర్వాజా దగ్గరి, భీమసేన విగ్రహం ముఖ కళను చూడాలట !
మహర్నవమి దిబ్బ వెనకున్న గుడిలోని భేతాళాకారాన్ని చూడాలట ! విఠలాలయం కల్యాణ
మండపం లోపలి స్తంభాలలో చెక్కి ఉన్న శిల్పం మరీ ప్రత్యేకమైనదట ! ఒక
హైందవుడు, ఒక తురకవానిని క్రోధం నిండిన కళ్ళతో గడ్డం కింద కత్తి పెట్టి
చంపబోతున్న వైనం చూసి తీరాల్సిందేనట ! విఠలాలయ భిత్తికా భాగాలలో, చుట్టూ
ఉన్న బొమ్మలలో, గుర్రాలను నడిపించుకుని వస్తున్న ఒక పోర్చుగీసు వ్యాపారి
బొమ్మ ఉందట . అతని కన్నుల్లో, తన గుర్రాలకు తగిన ధర వస్తుందా లేదా అన్న
సందేహమూ, కొట్టవచ్చినట్టు కనబడేలా ఆ శిల్పి చెక్కిన తీరు, అత్యద్భుతమట !
ఇటువంటివి, నిజానికి, చిత్ర ప్రపంచం లోనో, కవిత్వ వర్ణనల్లో చూడగలమెమో కానీ
శిల్ప ప్రపంచంలో చూడటం తటస్థిస్తుందా అసలు అని అనుమానం వస్తుంది తప్పక.
కదూ?
హంపీ శిల్ప కళగురించిన అతి గొప్ప విశ్లేషణ అయ్య మాటల్లోనే , కవి
సార్వభౌముడు, కలి మహరాజ చండ ముద్రాధరులచే, అనిపించినట్లు, స్వచ్చమైన జాతి
భూలోకంలో లేదు. కాల చక్రపు చంక్రమణంలో ప్రతి జాతీ, అనేక కారణాలచేత, సంకరమై
ఉంటుంది . ఈ సాంకర్యమే, రసపోషణకు మూలమని కొందరు శాస్త్రజ్ఞుల అభిప్రాయం.
కాబట్టి ప్రతి జాతికీ, యెక్కడొ ఒకచోట, సాంకర్యం తప్పదు. విజయ నగర శిల్పం
కూడా ఆ సాంకర్య సూత్రానికి లోబడినదే ! దీని సహజ లక్షణం - హైందవం. హైందవములో
ద్రావిడము. ద్రావిడ శిల్ప కళలో, యెన్ని సాంకర్యములున్నాయో, అవి అన్ని
ఇందులోనూ కనబడతాయి. అరబ్బీ, యవన కళా లక్షణములక్కడక్కడా యీ శిల్ప కల్ళలో
ఇమిడి ఉన్నాయి. ఇలాంటి సాంకర్యములో, యీ శిల్ప కళ, తేజోవృద్ధిని చెందినదే
కానీ, తన సహజ భావాన్ని కోల్పోలేదు. విజయ నగరాన్ని చూచిన వారందరూ, దాన్ని
స్వర్గ ఖండమంటారేకనీ, విదేశ ఖండమని యెంత మాత్రమూ అనరు. ' ( 'హంపీ-విజయ
నగరము ' -పుట్టపర్తి, )
..................
Monday, 10 April 2017
అయ్య చూసి (పి) న హంపీ
మా రెండవ అక్కయ్య తరులతాదేవి కి హంపీ-కామలాపురం (హొసపేట-బళ్ళారి జిల్లా-కర్ణాటక) సంబంధం కుదరగానే అయ్య యెంతో ఉప్పొంగి పోయారు. మా
అక్కయ్య పెళ్ళైన తరువాత, తరచూ హంపీకి వెళ్ళే అవకాశం దక్కినందుకు, యెంత
సంబర పడిపోయారో ! వీలైనప్పుడల్లా, కామలాపురానికి బయలుదెరేవాళ్ళు, అమ్మ,
అయ్యా ! మా అక్కయ్య మామగారు, శ్రీమాన్ బాణగిరి శింగరాచార్యులవారు, ఆ
రోజుల్లో, అక్కడో పేరుమోసిన భూస్వామి. వాళ్ళింట్లో, ధాన్య లక్ష్మి నిరంతరమూ
తాండవిస్తుండేది. మా బావగారు, శ్రీమాన్ బాణగిరి రామానుజాచార్యులవారికీ మా
అయ్యా అమ్మా అంటే, చెప్పలేని గౌరవాదరాలు. అయ్యా, అమ్మా, అక్కడికి
వీలైనప్పుడల్లా, వెళ్తుండేవాళ్ళు. వాళ్ళతోపాటూ నేను కూడా ! అక్కడ వున్నన్ని
రోజులూ, విజయనగర శిధిలాల మధ్యే అయ్యకు కాలక్షేపం. ఆ 'కమలాపుర' ఒక
పల్లెటూరు. అక్కడినించీ, హంపీ కి కూతవేటు దూరమే ! మామిడి తోటలూ, చెరకు
పొలాల మధ్య సాగే దాదాపు ఇరవై అడుగుల సన్నటి బాట. యెద్దు బళ్ళ
అదిలింపులూ, వాటి మెడల్లోని గంటల గణగణలూ, చెట్లపైనుంచీ అహ్వానగీతాలు
పాడుతున్నట్టు రకరకాల పక్షుల కిలకిలరావాలూ ఆ బాట సోయగాన్ని
ఇనుమడింపజేస్తుండేవి. పల్లె నుంచీ ఒక మైలు నడిచామో లేదో, 'లోటస్ మహల్' అని పిలువబడే, రాణిగారి స్నానాగారం కుడివైపున కనిపించేది.
ఇక
అక్కడినుంచే అయ్యలో ఉద్వేగం. రాణుల స్నానాగారంలోకి నీళ్ళు వెళ్ళేందుకు
చేయబడిన యేర్పాట్లు యెంత పకడ్బందీగా ఉండేవో చూపిస్తూ మరీ వివరించేవారు.
చుట్టూ ఉన్న పొలాలు చూస్తూ, రాయల కాలంలో వ్యవసాయానికి పెద్దపీట వేసేవారనీ,
వూరు వూరునా యెన్నో చెరువులు త్రవ్వించి, పంట కాలువలకు వాటిని
మళ్ళీంపజేసే వ్యవస్థ ఆనాడు ఉండేదనీ అందుకే వాటిలో చాలా వాటికి 'రాయల చెరువు' , 'రాయ కాలువె' అనీ పేర్లిప్పటికీ ఉన్నాయనీ చెప్పేవారు.
మరచెంబుల్లో, వెంటతెచ్చుకున్న తుంగ భద్ర నీళ్ళను
తాగుతూ, ఆ తీయదనపు మధురానుభూతిలో తుంగభద్ర కథను ఇలా చెప్పేవారాయన ! విజయ
నగర సామ్రాజ్య స్థాపనకై విద్యారణ్యులవారు తుంగభద్ర ఒడ్డునే కలలు కనేవారట !
అక్కడికి అతి సమీపంలో ఉన్న పంపా విరూపాక్ష దేవాలయపు ధ్వజ స్థంభపు గంటల మధుర
నాదాలు, వారికి, భవిష్య పధకాలకు మంగళాచరణం వలె వినిపించేవి. ఆ తేట నీటి
మాధుర్యం, రాబోయే రోజుల మధుర కవితా సుధలా అనిపించేది. అసలు తుంగభద్రనీటి
కంతటి ప్రాశస్త్యం యెలా వచ్చింది?
తుంగభద్ర తెలుగు జాతి
చరిత్రతో పెనవేసుకుపోయిన మహానదులలో ఒకటి. పురాణ కాలల నుండే దీని గురించిన
కథలున్నాయి. హిరణ్యాక్షుని బారినుండీ, భూదేవిని కాపాడిన తరువాత, విష్ణువు,
పశ్చిమ సముద్ర తిరంలోని పర్వతాలలో వి శ్ర మించాడు. అందుకే ఆ ప్రాంతానికి 'వరాహ గిరి' అన్న పేరు వచ్చింది. ఆ వరాహ రూప గిరి కోరల నుండీ రెండు నదులు పుట్టాయి. అవే, తుంగ, భద్రలు. హరిహర అన్నచోట ఆ రెండూ యేకమై. తుంగభద్ర గా ముందుకు నడిచాయి. మత్శ్య పురాణంలో
' తుంగభద్రా,సుప్రయోగా, వాహ్యా, కావేరి చైవతు,
దక్షిణాపథ నద్యస్తా, సహ్య పాదా ద్వినిస్సతా:'
తుంగభద్ర, సుప్రయోగ, వాహ్య, కావేరి
అన్న నదులు సహ్యాద్రి నుంచీ పుట్టాయి అని దీని అర్థం. భాగవతంలో నూ స్థల
వర్ణన సందర్భంలో ఐదవ స్కంధం, 19వ అధ్యాయంలో తుంగభద్రా, కృష్ణవేణ అన్న
ప్రస్తావన వుంది. రామాయణం, అరణ్యకాండ చివరి సర్గలోనూ, కిష్కింద కాండ మొదటి
సర్గ లోనూ తుంగభద్ర ప్రస్తావన ఉంది.
(వాల్మీకి తుంగభద్రను 'పంపానది' అనే
అన్నాడు. తుంగభద్రాతీరంలోని విరూపాక్షేస్వరునికి పంపాపతి, అనే పేరు.
పంపయ్య, హంపాపతి, హంపయ్య అనే పేర్లు, బళ్ళారి, అనంతపురం జిల్లాలలో ఇప్పటికీ
ప్రచురంగా వినిపిస్తాయి మరి. )
అరణ్య మధ్యంలో ప్రవహించే తుంగభద్ర, దాని ఇరుగట్లూ, వివిధ పుష్ప
వృక్షాలూ, ఆ ఆహ్లాదకరమైన ప్రకృతి రామునికి సేద తీర్చాయట ! (కిష్కింద-మొదటి
సర్గ) 131 శ్లోకముల యీ సర్గలో, పంపా
తీర మనోహర దృశ్యాలను రాముని మాటల మాధ్యమంగా వాల్మీకి వర్ణించిన తీరు
అద్భుతం. 'లక్ష్మణా ! ఈ పంపా సరస్సు, చాలా అందంగా ఉంది. దీనిలోని జలము,
వైదూర్య మణివలె నిర్మలము. ఇది పద్మలతోనూ, కలువలతొనూ నిండి ఉన్నది. దీనిని
అనేక వృక్షములు శోభింపజేయుచున్నవి. లేళ్ళతోనూ, పక్షులతోనూ వ్యాప్తమైన యీ
ప్రాంతములో చెట్లనుండీ అనేక పుష్పములు రాలి, కంబళ్ళు పరచినట్టుగా,
నల్లగానూ, పచ్చగానూ ఉన్న యీ పచ్చిక బీడు అధికముగాప్రకాశించుచున్నది.
పుష్పముల భారముతో నిండిన చెట్ల అగ్ర భాగములను, బాగా పుష్పించిన లతలు,
కౌగిలించుకొని ఉన్నవి. కొండలపైన ఉన్న పర్వతముల గుహల నుండీ బయల్వెడలిన
వాయువు, మదించిన కోకిల ధ్వనుల చేత వృక్షాలను నాట్యము చేయించుచూ, తాను పాట
పాడుటకు ఉపక్రమించినట్టులే ఉన్నది. యీ వాయువు వృక్షముల కొమ్మలను యెక్కువగా
కదుపుట చేత, యీ వృక్షములన్నీ ఒకదానితో ఒకటి చేర్చి కట్టబడినట్లున్నవి.'
ఇలా సాగిపోయే పంపా తీర వర్ణన, వాల్మీకి ప్రత్యక్ష ప్రసారంలా, మనలను తన వెంట పంపాతీరాల వెంట నడిపిస్తుందనేవారు అయ్య.
' నాకు
దేవేంద్ర పదవి కూడా అక్కరలేదు. సీత నాకు కనబడినట్లైతే, ఇక్కడే మనమంతా
నివసించగలిగితే, అయోధ్యకు తిరిగి వెళ్ళవలెననికూడా నాకు లేదు ' అని
సాక్షాత్తూ శ్రీరామచంద్రుని నోటనే పలికించిన యీ ప్రాంతం అందం వాల్మీకి
మాటల్లోనే ఇలా ఉంది. వాల్మీకి
కి ఉన్న వృక్ష విజ్ఞానమూ యిలాంటి వర్ణనల్లో సుస్పష్టం. పంపాతీరమంతా
కల్లికార, చూత, కింశుక, కరవీర, పద్మక, నీలాశోక, అంకోల, కురంట, చూర్ణక,
పారిభద్రక, పాటల, కోవిదార, ముచుకుంద, అర్జున, కేతక, ఉద్దాలక, శింశపా,
శిరీష, ధన, శాల్మలి, రక్త కురబక, తినిశ, నక్తమాల, చందన, స్యందన, హిం తాల,
తిలక, నాగాది అనేకానేక ఫల పుష్ప వృక్షాలతోనూ, మయూర, కోకిల, చక్రవాక,
కారండవాది అనేక పక్షిగణ కలకూజితాలతో ప్రతిధ్వనిస్తూ శ్రీరామ చంద్రునికి
కనబడగానే 'అయ్యో ! సీత యీ అందాన్ని చూడలేదే! తాను మనకు దొరికితే, ఇక్కడే
మనసుదీరా ప్రకృతి సహజ సౌందర్యలనాస్వాదిస్తూ ఉండిపోవాలని అనిపింపజేసిన
(శ్రీమద్రామాయణం-కిష్కింద/1 వ సర్గ) ఆ తీరంలో కూర్చుని, వాల్మీకి
ఆరాధకులైన మా అయ్యా అమ్మ ఆయా చెట్ల కోసం వెదుకుతూ కాసేపూ, ఆనాటి అందాలు
ఇప్పుడెక్కడికి పోయాయో అని కాసేపూ, కళ్ళనీళ్ళు పెట్టుకునే వారు.
తుంగభద్ర నీటి గుణాలను వైద్య శాస్త్రం కూడా ప్రశంసిస్తుందట ! 'రాజనిఘంటువు' అనే వైద్య గుణ
కోశం లో
తుంగభద్రా జలం స్వాదు, స్నిగ్ధం, ప్రోక్తం తధా గురు,
కండూ పిత్తా ప్రదం ప్రాయ: సాత్మం మేధాకరం మృతం
తుంగభద్ర నీరు తీయనిది. కనుకనే, 'గంగా స్నానం, తుంగా పానం ' అన్నారు
పెద్దలు. దురదలు, పిత్తదోషాలు, రక్తస్రావాది దోషాలు తుంగభద్ర జలపానం వల్ల
తగ్గుతాయట! ఒంటికీ మేధకూ కూడా హితమైన యీ జలాన్ని త్రాగే మహా పండితులూ,
మహా కవులెందరో యీ తీరంలో పుట్టారు. విద్యారణ్యులు యేకంగా వేదభాష్యమే
వ్రాశారిక్కడి జల పానం వల్ల అంటే అతిశయోక్తి కాదేమో !
తుంగభద్ర
గురించి చెప్పేటప్పుడు, అయ్యలోని చరిత్రకారుడూ విజృంభించేవాడు.
తుంగభద్రాతీరాన, విశ్వవిఖ్యాతమైన రీతిలో విలసిల్లిన విజయనగర సార్వభౌముల
కాలం నాటి అనేక శాసనాల్లో, తుంగభద్ర ప్రస్తావన ఉన్నదట ! 1521 వ సంవత్సరం
నాటి ఒక శాసనంలో, కృష్ణదేవరాయలు, రాయచూరు జయించినతరువాత, నారాయణయ్య మొదలైన
దండనాయకులకు, తుంగభద్రా తీరంలో పెక్కు గ్రామాలు పారితోషికంగా ఇచ్చినట్టు
శాసనాలలో ఉన్నది. ఆ నాయకులు వాటిని, బ్రహ్మేశ్వరాలయానికి సమర్పించారు.
' శ్రీ వీరప్రతాప
శ్రీవీర కృష్ణ రాయరు, రత్న సింహాసనారూఢరాగి, పృధ్వీరాజ్యవ నాళుత్తయిరలు,
గౌరవదణ యంకర, నారాయణయ్యదవరు, సాష్టంగనెరగి, పొడవట్టు, సమర్పిసిద గ్రామగళు.
రాయచూరను సాధిశిరమ్మ....అలంపూరు, దక్షిణ వారణాసి, తుంగభద్రా తీరదలు,
కృష్ణవేణీ, వేదవతీ, నాదావతీ, తుంగభద్రా తీరద కాశీక్షేత్రదళు. ...'
తుంగభద్ర ప్రస్తావన
వచ్చినప్పుడు, అయ్య మేధ, ఆ తీరాలవెంట అతి సునాయాసంగా, వెనక్కీ, ముందుకూ
కూడా పరుగులు పెట్టేది. తుంగభద్రాతీరంలో వెలసిన క్షేత్రాలలో చివరిది
సంగమేశ్వరం. దానికి ముందున్నది అలంపురం. 'దక్షిణ కాశి' గా
ప్రసిద్ధి చెందిన యీ క్షేత్రం పశ్చిమ చాళుక్య సార్వభౌముడైన ఆరవ
త్రిభువన విక్రమాదిత్యుదు రాజ్యమేలుతున్నప్పుడు, అతని సామంతుడైన తెలుగు
చోళ నృపతి, బ్రహ్మ రాశి పండితుని పదార్చన చేసి, బ్రహ్మేశ్వరాలయానికి
తుంగభద్ర తీరంలోని కన్నెమునూరు లోని గ్రామం పులినూరును పరమేశ్వర దత్తంగా
అంగరంగ వైభోగంగా సమర్పించాడట ! ఈ శాసన కాలం క్రీ.శ. 1096.
త్రిభువన మల్లదేవుని పట్టమహిషి అభినవ సరస్వతీదేవి, మౌని
పండితుని పదార్చన చేసి, తుంగభద్రాతీరంలోని కన్నెమున్నూరులోని ఒక
గ్రామాన్ని, బ్రహ్మేశ్వరునికి దానమిచ్చిందట ! యీ శాసన కాలమూ క్రీ.శ. 1096
ప్రాంతమే ! త్రిభువన మల్లదేవుడు పరిపాలిస్తుండగా, అతని సామంతుడైన, మహా
మండలేశ్వర మల్లరసు, ఉత్తరాయణ పుణ్య కాలంలో, ధరణీంద్ర రాశి పండితునికి
పాదార్చన చేసి, తుంగభద్రాతీరంలోని, కందనవోలు గ్రామం నుండీ వచ్చే ఆదాయాన్ని
బ్రహ్మేశ్వర దేవుని అంగరంగ భోగానికీ, పంచోపచార పూజల కోసమూ సమర్పించాడట !
దీని కాలం క్రీ.శ. 1107, డిసెంబర్, 25 వ తారీఖు, బుధవారం. (వెరవాణి,
యైనూరుం బాడద బళియ తుంగభద్రెయ దళియ కందనవొళల సార్థ బణ్ణెగె కిరుగె )
కాకతీయుల కాలంలోనూ బ్రహ్మేశ్వరాలయానికి కాకతీయ రాజులు, వారి సామంతులూ
పెక్కు దానాలు చేశారట . ఆ గ్రామాలన్నీ, దాదాపు తుంగభద్ర తీరంలోనివే !
తుంగభద్ర మాధుర్యం, శ్రీనాధుని చాటువులలోనూ తొంగిచూస్తుంది.
పంపా విరూపాక్ష బహు జటాజూటి కా
రగ్వధ ప్రసవ సౌరభ్యములకు
తుంగభద్రా సముత్తుంగ వీచీ ఘటా
గంభీర ఘుమఘుమారంభములకు
కళసాపుర ప్రాంత కదళీ వనాంతర
ద్రాక్షా లతా ఫల స్తబకములకు
కర్ణాట కామినీ కర్ణ హాటక రత్న
తాటంక యుగ ధాళధళ్యములకు
రగ్వధ ప్రసవ సౌరభ్యములకు
తుంగభద్రా సముత్తుంగ వీచీ ఘటా
గంభీర ఘుమఘుమారంభములకు
కళసాపుర ప్రాంత కదళీ వనాంతర
ద్రాక్షా లతా ఫల స్తబకములకు
కర్ణాట కామినీ కర్ణ హాటక రత్న
తాటంక యుగ ధాళధళ్యములకు
ఇలా చెప్పుకున్నాడాయన తుంగభద్ర తో తనకున్న తీపి జ్ఞాపకాలను !
పాండురంగ మహాత్మ్య కవి యేకంగా , ఓ తుంగభద్రా ! నీవు సుగుణాల
రాశివి. సముద్రుడు నిన్నే చూసి వుంటే, ఇక ఇతర నదులను కలిసేవాడే కాదు సుమా !
అనేశాడు.
గంగా సంగమమిచ్చగించునె మదిన్ కావేరి దేవేరిగా,
అంగీకారమొనర్చునే యమునతో నానందమున్ పొందునే,
రంగత్తుంగ తరంగ హస్తములతో, రత్నాకరేంద్రుండు నీ,
అంగంబంటి సుఖించునేని గుణభద్రా ! తుంగభద్రా నదీ !
అప్పుడెప్పుడో, శ్రీపాద వారి ముందు తుంగభద్ర గురించి తాను చెప్పిన ఆశువు నూ ఆవేశంగా చదివేవారయ్య.
హేరాళంబిదె నాదు భాగ్యమని నీవెంతెంతొ ఘోషింతు, నీ
వారిన్ జూచితిలెమ్ము, లెస్సల్ చెప్పకుము గొప్పగా గౌతమీ,
ధారావర్ధిత గోస్తనీ రస సముద్యత్ తుంగభద్రానదీ,
స్వారస్యంబుల ముందు, తాపక పయ: పానంబు శోభించునా ?
ఇటువంటి సుందర తీరంలో విద్యారణ్యులవారి చిన్ననాటి కల నెరవేరిన క్రమం ఎంతో ఉత్కంఠ భరితం.
శృంగేరి పీఠాచార్యులు విద్యాతీర్థులవారు, తన శిష్యులను ఒక ప్రశ్న అడిగారు. ఒక్కొక్కరో
సమాధానమిస్తున్నారు. వేంకటనాధుని అడిగారు (వీరే భవిష్యత్తులో వేదాంత
దేశికులుగా జగత్ప్రసిద్ధులయ్యారు) అతడన్నాడు.' స్వామీ
! నేను భగవద్రామానుజుల సిద్ధాంతాల వ్యాప్తి కోసం కృషి చేస్తాను. వారి
రచనలకు వ్యాఖ్య వ్రాస్తాను. వేదోపనిషత్తులను బోధించే ఉపాధ్యాయుణ్ణవుతాను. '
విద్యాతీర్థులవారు సంతోషంగా తల పంకించి, సుదర్శన భట్టుని వైపు తిరిగారు.' స్వామీ ! నేను శ్రీరంగానికి వెళ్ళీ, శ్రీరంగనాధుని సేవలోనే శేషజీవితం గడుపుతాను. ' భోగనాధుడన్నాడు. 'ఆచార్యా ! నేను పండితులకు రారాజునవుతాను.' సాయనుని
సమాధానం ' స్వామీ! వేదాలకు వ్యాఖ్య రాయాలనీ, వేదంత సారాన్ని తెలుసుకుని
పదుగురికీ పంచెపెట్టాలన్నదే నా జీవిత లక్ష్యం. ' చివరికి, మాధవుని
వంతొచ్చింది. 'గురుదేవా ! మీ ప్రశ్నకు సమాధానం చెప్పటం చాలా కష్టంగా
తోస్తున్నది నాకు . మనిషిలో గర్వం ఉన్నంతవరకూ దేన్నైనా సాధించటం కష్టమే !
మానవసేవలోనే తరించాలన్నది నా భవిష్య నిర్ణయం. మానవుల్లోనే
భగవంతుడున్నాడంటారు కదా ! నాదేశం ప్రస్తుతం సుషుప్తావస్థలో ఉన్నది. దాన్ని
జాగృతం చేయాలి. ధర్మాన్ని కాపాడుకోవాలి. నా దేశ స్వాతంత్ర్యాన్ని
పరిరక్షించుకోవాలి. ఇదే నా ఆశయం. ' మాధవుని
సమాధానం విద్యాతీర్థులవారికెంతో తృప్తినిచ్చింది. తన శిష్యుని
అంతరంగాన్ని విని అతన్ని మనసారా ఆశీర్వదించి, విజయోస్తు అన్నారు.
గురువుగారి
ఆశీర్వాదాన్నందుకుని, ముందుకు అడుగేసిన మాధవుడు, పంపా క్షేత్రంలో
భగవత్సేవలో పవిత్ర జీవనం గడుపుతున్న మాయణాచార్య, శ్రీమతీదేవి గారల ప్రధమ
పుత్రుడు. ఆతని కనిష్ట సోదరులు,సాయణుడు, భోగనాధుడు, సోదరి సింగల.
శంకరానందులవారి వద్ద ప్రాధమిక విద్యనభ్యసించి, తరువాత, వారి సలహా మేరకు,
కంచిలో 'సర్వజ్ఞ విష్ణు' 'విద్యేశ' 'విద్యానంద' 'విద్యాశంకరా'ది
నామాలతో అప్పటికే సువిఖ్యాతులూ, సాక్షత్తూ దక్షిణామూర్తి అవతారంగా
పరిగణింపబడే విద్యాతీర్థులవారి వద్ద శిక్షార్హులైనారీ సోదరులు. కంచిలోనే
మాధవునికి, వేంకటనాధాచార్య (తదనంతర కాలంలో వేదాంతదేశికులవారు) సుదర్శన
భట్టర్, ద్వైత సిద్ధాంతంలో అప్పటికే పండితుడైన అక్షోభ్య తీర్థులవారితో
స్నేహం కలిసింది. ఇంకా భారతీ తీర్థులు, శంకరానందులు, శ్రీకంఠ తీర్థులవారి
దిశానిర్దేశం కూడా మాధవునికి అందివచ్చిన అదృష్టాలు. దేశంలో, ముఖ్యంగా
దక్షిణ భారత దేశంలో, హిందూ ధర్మాం దుర్దశ మాధవుని కలచివేస్తూ ఉంది.
ఆశయ సిద్ధికై మార్గాన్వేషణలో ఉండగానే అన్య మనస్కంగానే
కుటుంబ బాధ్యతలనూ మాధవుడు నిర్వర్తించాడు. సోదరి సింగల వివహం యోగ్యుడైన
వరునితో చేశాడు. వీతిహోత్రి కుమార్తె , వైతిహోత్రి తో అతనికి వివాహమైంది
కూడా ! జీవిక కోసం, పూజారిగానూ, విద్యాదానం చేస్తూ మరికాస్త పని
చేస్తున్నా, అతని అంతరంగంలో 'నాటి ఆశయమేమైనద ' న్న ప్రశ్న
ప్రతిధ్వనిస్తూనే ఉంది.
శ్రీరంగంలో మాలిక్ కాఫర్
ఆగడాలూ, శ్రీరంగనాధ దేవాలయానికి యెదురైన విపత్తు, శ్రీరంగనాధుల ఉత్సవ
మూర్తులను, కొందరు తిరుమలకు భద్రంగా తరలించగా, వేంకటనాధుడూ, సుదర్శన
భట్టులిద్దరూ కలిసి, శ్రీరంగనాధుని విగ్రహాన్ని, విలువైన ధర్మ గ్రంధాలనూ
కావేరీ తీరాల్లో దాక్కుని వుండి కాపాడిన తీరూ- అన్నీ తెలుస్తూనే ఉన్నాయి.
మాధవుని మనసూ, దేహమూ కూడా తెగ ఉడికిపోతున్నాయి. వేంకటనాధుడు తమ సత్య
మంగళంలోనూ, సుదర్శన భట్టర్ శ్రీరంగం లోనూ, మాధవుడు పంపాక్షేత్రంలోనూ -
ముగ్గురూ మూడు చోట్ల ఉన్న, ముగ్గురి మనసుల్లోనూ దేశంలో ధార్మిక
పరిస్థితులగురించే చింత. మాధవుడు
వుండబట్టలేక వేంకటనాధుని వద్దకు వెళ్ళాడు. మాలిక్ కాఫర్ దురాగతాలనూ,
కన్యాకుమారిలో విజయధ్వజాన్ని నిలబెట్టి హిందుత్వాన్ని పరిహసించిన తీరునూ,
ప్రజల నిస్సహాయతనూ పునరాలోచన చేసుకు న్నారు. ' ఈ పరిస్థితిలో నీవేమి
చేయదలచావు?' మాధవుని ప్రశ్నకు వేంకటనాధుని సమాధానం. 'ప్రజలలో యీ భయాన్ని
తొలగించేందుకు, వారిలో నిర్భయత్వాన్నీ, సమరోత్సాహాన్నీ నింపేందుకు 'అభీతిస్తవం' అన్న రచన చేశాను. వింటావా? 'అన్నాడాయన. 'తప్పక.' .అన్నాడు మాధవుడు.
మానవుడు ఇలపై యెదుర్కొనే
భయాలను ధైర్యంగా యెదుర్కొని అధిగమించేందుకు, భగవద్ భక్తీ, శరణాగతి అన్న
ఆయుధాలే చాలన్న తాత్పర్యమంతో 29 శ్లోకాలలో, అన్యాపదేశంగా వేంకటనాధుడు వ్రాసిన యీ రచన, మాధవాచార్యునిలో నూతనోత్సాహాన్ని నింపింది.
పృధ్వీ వృత్తంలో ఉన్న యీ శ్లోకాలలో మొదటి పదిలోనూ
పరంజ్యోతి రూపుడైన శ్రీరంగనాధుని కల్యాణ గుణాలను కీర్తిస్తున్న వారిని
రక్షించే దయాళువుగా స్వామిని కీర్తించడం, 11 నుండీ 19 శ్లోకాల వరకూ
ప్రాపంచిక విషయానుభవాల వల్ల, బంధువులవల్ల, స్వర్గ నరకాలవల్ల, ఇతర
కారణాలవల్ల కలిగే భయం నుంచీ కాపాడమని ప్రార్థించడం, 20 నుంచీ 25 శ్లోకాల
వరకూ విభవావతారంలో భగవంతుడు, శరణాగతి ధర్మాన్ని ప్రకటించి, సకల జనులకూ అభయ
ప్రదానం చేసిన వాడనీ, ప్రహ్లాదాది భక్తులను రక్షించినవాడనీ, లోకంలో
జరుగుతున్న ఉపద్రవాలనుంచీ కూడా ఆయనే లోకాన్ని కాపాడగలడనీ, ఆయననే శరణు
వేడాలనీ ఉపదేశించటం ఉన్నది. ప్రత్యేకించి 22 వ శ్లోకం ఆర్థం ఇలా ఉంది.
కలి ప్రణధి లక్షణై: కలిత శాక్య లోకాయతై:
తురుష్క యవనాదిభిర్జగతి జృంభమాణం భయం,
ప్రకృష్ణ నిజ శక్తిభి: ప్రసభమాయుధై: పంచభి:
క్షితి త్రిదశ రక్షకై: క్షపయ రంగనాధ! క్షణాత్ !
శ్రీ రంగనాధా ! కలి పురుష లక్షణాలు కలిగి వున్న బౌద్ధులు,
లోకయతులు, తురకలు, యవనులు మొదలైన వారి చేత లోకమందు విజృంభిస్తున్న భయాన్ని
స్వశక్తితో వైదిక జనులను రక్షించే పంచాయుధాలచే త్వరగా నివారించు ' .
దేశ ప్రజ సరైన నాయకత్వం లేక యెటు వెళ్ళాలో, యేమి చేయాలో తెలియని అయోమయ
స్థితిలో ఉన్నది. ఈ స్తవాన్ని చదవగానే మాధవాచార్యునిలో ఆశలు మోసులు
వేసింది. నిజంగానే అతని మనసులో ఉన్న సందేహ మేఘాలు తొలగిపోయి, కాంతి
మార్గం కళ్ళెదుట కనిపించింది. మాధవాచార్యుడు, తిరిగి తన సంకల సాధన కై
సాధన చేయటం మొదలు పెట్టాడు. లోగా, అటు, వేంకటనాధుని అభీతి స్తవ ప్రభావం
తో, చెంచు దుర్గాధిపతి గోపనార్యుడు, తన సైన్యంతో సత్రువులను ఓడించి తరిమి
కొట్టాడని తెలిసి, వేంకటనధుడు ,మళ్ళీ శ్రీరంగనాధ స్వామి విగ్రహాలతో సత్య
మంగళం నుండీ శ్రీరంగ క్షేత్రానికి తెచ్చి పున: ప్రతిష్టించాడు కూడా !
ఈ వార్త మాధవాచార్యునిలో మరింత ధైర్యాన్ని నింపింది.
అతనిలో యెన్నో ఆలోచనలు. అసలిక్కడి ప్రజలకేమైంది? గంగ, రాష్ట్ర కూట,
చాళుక్య, కదంబ, హోయసల రాజులవంటి మేటి వంశాలవారు పాలించిన గడ్డమీద, అలనాటి
స్వర్ణయుగాన్ని తిరిగి స్థాపించాలన్న ఆలోచన యే ఒక్కరికీకూడా రాకపోవటం
ఆశ్చర్యం కదూ! అమ్మా ! భువనేశ్వరీ! యేమిటి నీ మాయ? ఈ ప్రజల్లో ధైర్యం
నింపేదెలా ? ఖిల్జీ ల పాలన వారిలో వారికే జరిగిన కుమ్ములాటల్లో
అంతమైంది. ఇప్పుడు తుగ్లక్ ల పాలన సాగుతున్నది. దక్షిణాపథంలోనూ వారి
పాలనకే జోహార్లు పలికినా, ఇక్కడా అంతా అస్తవ్యస్తంగానే ఉంది. ఇదే మంచి
సమయమనిపిస్తున్నది-సరైన నాయకత్వాన్ని వెదికి పట్టుకుని, యీ ధర్మ గ్లాని
నుండీ దేశానికి విముక్తి కలుగజేసేందుకు ! '
ఇదేసమయంలో అతని తల్లి
గతించటం, అర్ధాంగి అకాల మరణం ' - అతనికున్న రెండు బంధాలూ వాటంతటవే
వీడిపోయాయి. మాధవాచార్యుడు, ఇప్పుడు పూర్తిగా భువనేశ్వరి సేవలో
మునిగిపోయాడు. దేశాన్ని రక్షించే దారి చూపమని వేడుకుంటూ, తపస్సమాధిలో
మునిగిపోయాడు- తుంగభద్ర తీరాలలోనే ! అది పంపాంబిక, పరమేశ్వరుని పతిగా
పొందేందుకు తపమాచరించిన చోటు. అంజనాదేవి, ఆంజనేయుని వాయు పుత్రునిగా పొందిన
మహిమాన్విత ప్రదేశం. శ్రీరామచంద్రుడు, వాలిని సం హరించి, సుగ్రీవునికి
పట్టాభిషేకం చేసిన పవిత్ర భూమి. దీనికితోడు, కుక్కలను కుందేలు తరిమిందన్న
అద్భుత సంఘటన జరిగిన చోటు కూడా ! తపస్సు తీవ్ర రూపం దాల్చింది. తనయుదు,
అన్నాహరాలను వదలి 12 వత్సరాలు గాధ తపస్సులో చిక్కి శల్యమవటం చూసి
భువనేశ్వరీ దేవి మాతృహృదయం తల్లడిల్లింది. యెదుట ప్రత్యక్షమైంది.'
నీవిప్పటినుంచీ విద్యారణ్యుడవు. నీకోరిక నెరవేరుతుంది త్వరలో' అంది.
'త్వరలో యేమిటి?' అన్నాడా తపశ్శాలి. 'వచ్చే జన్మలో' అమ్మ సమధానం. కారణం,
'నీవు నీ బంధలనుంచీ విముక్తుడవై సన్యాసివవ్'వాలంది. 'అంతేనా! ఇదిగో ఈ
క్షణంలోనే ' భువనేశ్వరి పెదవులపై, మందహసం. .నీకోరిక కొన్ని రోజుల్లోనే నెరవేరుతుంద' ని మాయమైపోయింది.
విద్యారణ్యులవారు, తుంగభద్ర తీరాలలోనే విరూపాక్షుని సన్నిధిలోనే, ధార్మిక ప్రవచనాలు చేసుకుంటూ, భావి నాయకత్వం యెదురు చూస్తున్నారు. రోజులు గడుస్తున్నాయి. విద్యారణ్యునిలో ఆశ చావలెదు., అనేగొంది
రాజు జంబుకేశ్వరుని మొహమ్మద్ బిన్ తుగ్లక్ పట్టుకుని, యుద్ధం చేశాడు. ఆ
యుద్ధంలో జంబుకేశ్వరుడు మరణించాడు. ఆనేగొందిని జయించిన సంతోషంలో తుగ్లక్,
మల్లిక్ నబీ అనే వానిని తన ప్రతినిధిగా అక్కడుంచి తాను ఢిల్లీ
వెళ్ళిపోయాడు. ఇదే సమయంలో విద్యారణ్యులు, కొంతమంది యువకులతో తిరుగుబాటు
చేయించాడు. వారి ధాటికి భయపడి, మల్లిక్ నబీ ఢిల్లీకి పారిపోయి,
ఆనేగొందిలో తిరుగుబాటు గురించి వివరించగా, తనవద్ద ఖైదీలుగా ఉన్న హరిహరుడూ,
బుక్కరాయలూ అక్కడివారే కావటం వల్ల వారిని ఆ తిరుగుబాటునణచేందుకు పంపాడు
తుగ్లక్. అదను కోసం కాచుకుని వున్న హరిహర, బుక్కలు, విద్యారణ్యులవారిని
కలిసి, తమ దీనగాధ విన్నవించుకున్నారు. పాదాభివందనం చేసి, తమను
కాపాడమన్నారు. రాజస కళ వారిలో ఉట్టి పడుతున్నది. వారి మాటల్లో,
కుమ్మటదుర్గ రాజు కోశాధికారి, సంగమదేవుని కుమారులు హక్క, బుక్కలు -
వీరిరువురూ ! తురకలు కుమ్మటదుర్గాన్ని నాశనం చేసి, బందీలుగా డిల్లీకి
పట్టుకుని వెళ్ళినవారిలో వీరిద్దరూ ఉన్నారు. మతమూ మార్చారు-వీరిద్దరికీ !
అటుతరువాత తుగ్లక్ అస్తవ్యస్త పరిపాలన ప్రభావం వల్ల, దక్షిణాపథంలో తమ
శాసనన్ని ఇలపటం కోసం, స్థానికులైన కారణంగా, వీరిద్దరినీ ఇక్కడ
పరిస్థితులను చక్కబెట్టటం కోసం పంపాడు తుగ్లక్. ఇదే అవకాశంగా తీసుకుని,
వీరిద్దరూ విద్యారణ్యుని శరణు వేడారు.
విద్యారణ్యులవారికి
వీరిద్దరిలోనూ, భావి నాయకులు కనిపించారు. అభీతిస్తవం ప్రభావం ఇక్కడ కూడా
కనిపిస్తున్నందుకు అనందించారు. విద్యారణ్యులవారి ఆశ్రయంలో, వారిరువురికీ,
మళ్ళీ హిందూ ధర్మం స్వాగతం పలికింది. విద్యారణ్యులవారు కేవల శాస్త్ర
పాండిత్యమే కాదు. సామాజిక పరిస్థితుల అవగాహన, రాజ తంత్రం కూడా సమపాళ్ళలో
ఉండటం వల్ల, అటు తరువాత, హరిహర, బుక్క రాయలిద్దరూ, విద్యారణ్యుల
ఆదేశానుసారం, యువ దేశ భక్తుల బృందంతో, ఆనేగొంది కోటలో ప్రవేశించి, జయించటమే కాదు, మల్లిక్ నబీ ని ఖైదీగా పట్టుకున్నారు కూడా !
ఈ శుభ పరిణామం తరువాత,
విద్యారణ్యుల వారు, పంపాక్షేత్రంలో ఒక అనువైన ప్రదేశాన్ని యెంపిక చేసి,
ధాతు నామ వత్సర (1336 ఏ. డీ) వైశాఖ శుద్ధ సప్తమి, నాడు శంకుస్థాపన చేశారట ! విజయనగరసామ్రాజ్యస్థాపనకోసం విద్యారణ్యులవారి సమయోచిత చర్య ఇప్పటికీ ఆశ్చర్యజనకమైంది. బలవంతంగా మతమార్పిడికి లోనై, కుంగిపోయివున్న హరిహర బుక్కరాయలను మళ్ళీ హిందూమతంలోకి మార్చి, వారిరువురిలోనూ ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేశారు వారు. తన వుపాసనాశక్తితో అమ్మవారిని వేడుకున్నారు-హిందూసామ్రాజ్యస్ థాపన స్వప్నానికి తగిన భాగ్యరాశులను కురిపించమని! అమ్మయేడున్నర ఘడియల కాలం పాటు కనక వర్షం కురిపించి కరుణించింది. ఆ ధనంతో హరిహర బుక్కలకు తగిన సైనిక బలం అన్ని హంగులతో చేకూరింది. విద్యారణ్యులవారి కల విద్యానగర రూపంలో సాకారమైంది.విజయపరంపరలతో విజయనగరమైంది.
క్రమంగా, రాజ్య విస్తరణ జరిగింది. ముందుగా హరిహరుడు, అటు తరువాత బుక్కడు
రాజుకాగా విద్యారణ్యులవారు వారికి ప్రధానమంత్రిగా, పథ నిర్దేశకునిగా,
ఉండి రాజ్యంలో స్థిరత్వానికై కృషి చేశారు.
తానే రాజ్యానికి శిల్పి ఐనా
యేనాడూ వారు అధికార దుర్వినియోగం చేయలేదు. పైగా, సన్యాసిగానే ఉంటూ, తన
తమ్ముడు సాయనుని సహకారంతో, సర్వదర్సన సంగ్రహ అన్న పేరుతో, పండిత వర్గాలకు
చాలా ఉపయోగకరమైన గ్రంధాన్ని రచించారు కూడా ! అక్షోభ్యతీర్థుల వారిని
కలిసి, వారి పట్ల తన అపార గౌరవాదరాలను ప్రకటించారు. వారి శిష్యులైన జయ
తీర్థులవారిని విజయ నగరానికి ఆహ్వానించి, గజరోహణ గౌరవాన్ని చేసి
సత్కరించారు కూడా ! భారతీ కృష్ణ తీర్థులవారి నిర్యాణం తరువాత, శృంగేరి
శారదా పీఠానికి 12వ పీఠాధిపతిగా 55 సంవత్సరాల సేవలో 'పంచదశి', 'జీవన్ముక్తి వివేక', 'అనుభూతి ప్రకాశిక', 'పరాశర మాండవీయ', వంటి యెన్నో ధార్మిక గ్రంధాలను రచించటమే కాక, కర్ణాటక సంగీతంలో 15 రాగాలకు రూపకల్పన చేసి తన 'సంగీతసార' లో
వివరణ కూడా ఇచ్చారు వారు. ఒక విధంగా, ఆదిశంకరులవారికంటే గొప్పవానిగా
పరిగణింపబడే విద్యారణ్యులు, మతాంతర స్వీకారం చేసిన హక్క బుక్కలను తిరిగి
హైందవం లోకి ఆహ్వానించటమే కాక, వారినే విజయనగర సామ్రాజ్యాధినేతలుగా
నిలబెట్టటం, యెంతో సాహసంతో కూడిన పని. పాండ్యులు, చోళులూ, కేరళులూ-
అందరినీ తన మేధాశక్తితో, రాజు సైన్య శక్తి తో లోబరచుకుని,
దక్షిణదేశాన్నంతా, ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం ఒంటి చేతిమీదే చేయగల్గటం
ఆశ్చర్యమే కదా ! మరి వారెక్కడ తనువు చాలించారన్న విషయమై, ఇప్పటికీ అభిప్రాయ
భేదాలున్నాయట ! శృంగేరిలో వారు సమాధి కాలేదు. ముడుబాగల అని కొందరంటున్నా,
తగీన ఆధారాలు లేవు. విజయ నగర చరిత్ర గురించి, గొప్పగా పరిశోధన చేసిన
శ్రీమాన్ రాళ్ళపల్లి గోపాల కృష్ణమాచార్యులవారు (శ్రీమాన్ రాళ్ళపల్లి అనంత
కృష్ణ శర్మగారి కనిష్ట సోదరులు) అయ్యకొక స్థలం చూపించారట, పంపాపతి ఆలయంలోనే
..అదొక భూగృహం. అందులోకి దిగిపోతే, అక్కడో సమాధి ఉందట ! అదే
విద్యారణ్యులవారి సమాధి అని వారు చెప్పారట ! హరిహర బుక్కలకు, వారు
సాక్షాత్తూ పరమశివావతారమేనన్నంత భక్తి ఉన్నందువల్ల, వారీ పని చేసి
ఉండవచ్చుననే అయ్యకూ అనిపించిందట ! ఇలా దక్షిణభారత దేశ చరిత్రనే
మార్చివేసిన విద్యారణ్యులవారిని తలచుకుని కన్నీరు కార్చేవారయ్య ! 118
వత్సర సుదీర్ఘ జీవన కాలంలో, వారేనాడూ స్వార్థం కోసం పని చేయలేదు. ప్రజా
క్షేమమే ధ్యేయంగా, ఒక నిజాయతీ గల సామాజిక కార్య కర్తగా, ఒక విశ్వాస
పాత్రుడైన ముఖ్య మంత్రిగా, దైవీశక్తినే తన సంకల్ప బలంతో మాట్లాడేలా
చేసుకునే తపస్సంపన్నునిగా, ఒక ధార్మిక ప్రవక్తగా, పండితాభిమనిగా, అన్నిటా
శిఖరాయమానమైన ప్రజ్ఞ తో వెలుగొంది, భారత దేశ చరిత్రకు బంగారు కాంతులద్దిన
మహిమాన్వితునిగా విద్యారణ్యులవారిని దర్శింపజేసేవారయ్య.
విజయ నగర క్రమ వికాసంలో కృష్ణదేవరాయలవారి పరిపాలన కాలం
మధుర ఘట్టం. దేశ ప్రజలు రాజును పొగడటం సర్వ సాధారణం. కానీ విదేశీయులు
కూడా అతని రాజ్య చతురతను పొగడటం అద్భుతం.
బ్రిటిష్
వారి రికార్డుల ప్రకారం, రాయల కాలం నాటికే, డైనమైట్ల వాడకం ఉండేదంటె,
అప్పటి ప్రగతిని అంచనా వేసుకోవచ్చును గదా ! వ్యవసాయంలో, కేవలం, మూడు
నెలల్లోనే పంట చేతికి వచ్చే కొత్త వంగడాలు ఉండేవిగా తెలుస్తున్నదని,
అయ్యగారి మాటల్లో విని ఆశ్చర్యం నుండీ తేరుకోలేకపోవడం మా వంతయ్యేది.
డొమింగో
పేస్ అనే పోర్చుగీసు యాత్రికుడు 1522వ సంవత్సరంలో హంపీ విజయనగరాన్ని
సందర్శించినప్పుడు, ఆ రాజ్య వైభవాన్ని సంపూర్తిగా వీక్షించటానికి సంవత్సర
కాలమైనా చాలదేమోనని సందేహించాడట ! రోం కన్నా చాలా విశాలమైన యీ రాజ్యం,
యేడు ప్రాకారాల మధ్య కట్టుదిట్టమైన సైనిక బందోబస్తు మధ్య అత్యంత విలాస వైభవ
కాంతులతో జాజ్వల్యమానంగా అలరారుతుండేదట ! సామాన్య ప్రజలు కూడా చక్కటి
ఆభరణాలతో అలంకృతులై, ఆనందంగా ఉండేవారు. వర్ణ వర్ణ పుష్పాలూ, అందులోనూ,
జాజిపూలూ, గులబీలూ అంటే మహా ఇష్టం ఆనాటి ప్రజలకు. యెటు చూసినా సంతృప్తి.
యథా రాజా తథా ప్రజా . రాజు ఒక్క రూపాయి కూడా బొక్కసం నుండీ తన కోసం కానీ తన
కుటుంబం కోసం కానీ తీసుకుని ఖర్చు చేయడమన్న మాటే ఉండేది కాదు.
సంవత్సరానికి, ఒక కోటి బంగారు నాణాలు ప్రజలనుండీ ప్రభుత్వానికి జమ ఐతే, అ
ఆదాయమంతా, తిరిగి ప్రజల సామాజిక, అర్థికభివృధి కార్యక్రమాలకొసమే ఖర్చు
పెట్టబడేది. అటు కటకం నుండీ, ఇటు గోవా సముద్ర తిరం వరకూ, ఇటు హిందూ మహా
సముద్ర తీరం నుండీ, అటు రాయచూరు వరకూ విస్తరించి ఉన్న శాంతి సామ్రాజ్యమిది '
అని నోరారా అతను పొగిడాడట !
మరో
పోర్చుగీసు యాత్రికుడు, బర్బోసా, ప్రత్యేకించి, రాయలవారి పరమత సహనాన్ని
వేనోళ్ళ కొనియాడాడు. ప్రతి వ్యక్తికీ, తాను నమ్మిన ధర్మాన్ని అనుసరించే
స్వాతంత్ర్యం, కృష్నదేవరాయలివ్వటాన్ని వారి ఉదార వ్యక్తిత్వానికి ప్రతీకగా,
చెప్పాడతను.
వీరికంటే
కాస్త ముందు విజయనగరాన్ని సందర్శించిన యాత్రికులలో ఇటలీ నుండి నికోలో
(1420) మధ్య ఆసియా నుండీ అబ్దుల్ రజాక్ (1446) వచ్చినవారు. 'Eyes of pupil, have never seen and the ear of intelligence never heard of such city' అని
రజ్జాక్ విజయనగరం గురించి వ్రాశాడు. ధర్వాడ జిల్లా లోని మాసూర్ లో
కృష్ణదేవ రాయలు త్రవ్వించిన కలువను ప్లేఫేర్ అన్న బ్రిటిష్ ఇంజినీర్
చూసి, ఇంత పెద్ద కాలువను త్రవ్వించడం, 19వ శతాబ్దపు మధ్య యూరోప్ దేశాలకు
ఇప్పటికీ సాధ్యమయ్యే పని కాదు, అని ఆశ్చర్యంతో అన్నాడట ! థామస్ మన్రో
కూడా రాయల యీ సామర్థ్యాన్ని వేనోళ్ళ కొనియాడినట్టు చరిత్ర సాక్ష్యం
చెబుతున్నది.
..............................
(ఇటీవల ప్రచురించిన నా వ్యాస సంకలనం వ్యాస రించోళి నుంచీ...)
Show details
Subscribe to:
Posts (Atom)