Tuesday, 11 April 2017


 అయ్య చూసి (పి) న హంపీ(2nd Part)

..........................
కృష్ణదేవ రాయలకు తన ప్రజలపట్ల, సైనిక సంపద పట్లా, వాణిజ్య సముదాయం పట్లా, యెంతటి ప్రేమాదరాలుండేవో, కళల పట్ల కూడా అంతకన్నా రెట్టింపు అభిరుచి ఉండేదన్నది - మనకు సాక్ష్యాలతో కూడా దొరికిన ఆధారం.
కృష్ణదేవరయలవారి కీర్తి పతాకలుగా నేటికీ, గర్వంగా నిలచి ఉన్న హంపీ విరూపాక్ష దేవాలయం, రాతిరధం, విఠలేశ్వరాలయం, రాణివాసపు స్నానాగారమైన లోటస్ మహల్, సప్తస్వర మండపం, బృహదీశ్వరాలయం, లేపాక్షి, తిరుమల వేంకన్న దేవాలయ స్వర్ణ ఖచిత గోపురం, పెనుగొండ రామాలయం, ఇంకా యెన్నెన్నో !
భువన విజయ కవులైన, పెద్దన, తిమ్మన, మాదయగారి మల్లన, దూర్ఝటి, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజ భూషణుడూ, తెనాలి రామలింగ కవీ- వీరి వైభవం మాటల్లో వర్ణించలేనిది. వీరందరి ప్రబంధ రాగ ఝరులలో మునకలు వేసి రసానందాన్ని గ్రోలిన రాయలకు, ఆముక్త మాల్యద రూపంలో తన రచనాభినివేశాన్ని ప్రదర్శించుకోనిదే కునుకుకూడా పట్టలేదు అంటే అతిసయోక్తి కాదేమో ! కావ్య రచన సేయుమని ఆజ్ఞాపించినది అంధ్ర విష్ణువే ఐనా, అప్పటికే అన్నమయ్య తేట తెనుగు పదాలలో తియ్యందనన్ని జుర్రుకుని ఇంకా తనివితీరనట్టుగా వెలితిగా నిలుచుని వున్న యేడుకొండల రేనికే తన కావ్య కన్నియను సమర్పించి, తెలుగు రాయనిగా తన జీవితం సఫలమైనదని హాయిగా నిట్టూర్చాడా ఆంధ్ర భోజుడు !
కర్ణాటక సంగీత శిక్షణకు ఒక నిబద్ధతను కల్పించిన పురందర దాసులవారు కృష్ణదేవరాయల సమకాలికుడు. ఇంకా వాదిరాజులవారు, ప్రముఖ కన్నడ భక్త కవి కనకదాసు కూడా రాయల కాలంలోని స్వర్ణయుగానుభవాన్ని చవిచూసినవారే ! అదే కాలంలో భరత ముని నాట్య శాస్త్రం ఆధారంగా భరత నాట్యమూ పరిఢవిల్లిందట !
కన్నడ సరస్వతిని అర్చించి వీరశైవామృత, భావచింతారత్న, సత్యేంద్ర చోళగాధె వంటి రచనలు చేసిన మల్లనార్యుడు, కృష్ణ నాయక రచయిత తమ్మన్న కవి, భేదోజ్జీవన తాత్పర్య చంద్రిక న్యాయామృత తర్క తాండవ వంటి అజరామర గ్రంధలను రచించడమే కాదు. కృష్ణదేవరాయలవారి కులగురువుగా గౌరవాన్నందుకున్న వ్యాసరాయలవారూ, రాయలపై వాత్సల్య ధారలు కురిపించిన వారిలో ప్రధములు.
విజయనగరసామ్రాజ్యస్థాపనకోసం విద్యారణ్యులవారి సమయోచిత చర్య ఇప్పటికీ ఆశ్చర్యజనకమైంది. బలవంతంగా మతమార్పిడికి లోనై, కుంగిపోయివున్న హరిహర బుక్కరాయలను మళ్ళీ హిందూమతంలోకి మార్చి, వారిరువురిలోనూ ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేశారు వారు. తన వుపాసనాశక్తితో అమ్మవారిని వేడుకున్నారు-హిందూసామ్రాజ్యస్థాపన స్వప్నానికి తగిన భాగ్యరాశులను కురిపించమని! అమ్మ కనకవర్షం కురిపించి కరుణించింది. ధనంతో హరిహర బుక్కలకు తగిన సైనిక బలం అన్ని హంగులతో చేకూరింది. విద్యారణ్యులవారి కల విద్యానగర రూపంలో సాకారమైంది.విజయపరంపరలతో విజయనగరమైంది.
కృష్ణదేవరాయలవారి కులగురువుగా గౌరవాన్నందుకున్న వ్యాసరాయలవారూ, రాయలపై వాత్సల్య ధారలు కురిపించిన వారిలో ప్రధములు. అసలు కృష్ణ దేవరాయల అస్థిత్వానికే ఆధరంగా నిలిచిన వ్యాసరాయలవారిని కూడా స్మరించి తరించవలసిన అవసరం మా అయ్యగారి మాటల్లోనే ఇలా ఉంది.
       ఒక దేశాధినేతగా, ఒక పరిపాలనాదక్షునిగా,ఒక కళాభిమానిగా,
 ఒక వాణిజ్య వేత్తగా,  న్యాయ

సం రక్షకునిగా, బహుముఖీనమైన వ్యక్తిత్వంతో దక్షిణ భరత దేశ చరిత్రనే తన వెంట నడిపిన ధీశాలి రాయలవారిని తన ఉపాసనాబలంతో తిరుగులేని నాయకునిగా నిలిపిన పరమ పవిత్ర యోగివర్యుడే వ్యాస రాయలవారు.

మధ్వ మత సమున్నత వ్యాప్తికి మూలస్థంభమనదగిన శ్రీపాద రాయలవారి శిష్యుడైన వ్యాస రాయలవారు, పుట్టుకతోనే అసమాన మేధస్సుకూ, అమేయ సాధనాసంపత్తికీ, ప్రసిద్ధి చెందిన కారణం, అసలు బాలునిగానే వారు సన్యాసం స్వీకరించటం, భగవదాజ్ఞ వల్లే సాధ్యమైనదని తెలిపే కథ. సాళువ నరసిం హ రాయని కాలంలోనే తిరుమల పవిత్ర మందిరంలో కలియుగ ప్రత్యక్ష దైవం పూజాదికాలలో జరిగిన దోష నివారణకై, వ్యాసరాయలవారిని ప్రార్థించి, అక్కడ వారిని ఉండేలా నిలిపారట ! పన్నెండు వత్సరాలు, నిరాఘాటంగా, పూజాదికాలు జరిపి, దోష నివారణ చేసి, అటు తరువాతి నిత్య పూజలకై, వంశపారంపర్య పూజారులను నియమించి తాము తపస్సమాధిలోకి వెళ్ళీపోయారు - వ్యాసరాయలవారు. ఈలోగా, విజయనగర సామ్రాజ్య రమ శ్రీకృష్ణదేవ రాయలవారిని వరించింది. కానీ చిన్న అపశృతి. రాయలవారి జాతకరీత్యా వున్న కుహూ యోగం వారిని కబళించివేస్తుందని జాతక పండితుల హెచ్చరిక !
అమరసిం హుని 'నామలింగానుశాసనం' లో వక్కాణించినట్లు, ఒక అమావాస్య నాడు, రవి, కుజ, శని, రాహువుల కలయిక పన్నెండవ ఇంటిలో జరిగినపుడీ ప్రమాడం సూచించబడినట్టు తెలుస్తున్నది. (తేదీల ప్రకారం, 4 ఫిబ్రవరి, 1514 వ సంవత్సరం, అమావాస్య రోజు, స్వభాను వత్సరం, మాఘ అమావాస్య, శతభిష నక్షత్రం ఆరోజు సూర్య గ్రహణమూ వుండివుండవచ్చునని స్వామి కన్నుపిళ్ళెగారి వ్యాఖ్య ) ఫలదీపిక (6/61) ప్రకారం, యీ ' కుహూ ' యోగ ఫలంగా - జాతకునికి బంధు మిత్ర పరివార జనులందరినుండీ వియోగమే కాక, నివసించేందుకు నీడ కూడ కరవై, ఆఖరికి, ప్రాణహాని సంభవించే ప్రమాదమున్నదని చెప్పటం మరింత అందోళనకు గురి చేసింది అందరినీ
ఈ ఆపదనుంచీ, తనను రక్షించే మహాపురుషునికై పరితపిస్తూ, గజరాజానికి పూలదండ నిచ్చి, అది యెటు వెళ్తే అటు పరుగులు పెడుతున్న సమయం. అది యెక్కడో, కొండకోనల్లో ధ్యానమగ్నుడై వున్న వ్యాసరాయలవారి కంఠసీమలో పూలమాలను అలంకరించింది. శ్రీకృష్ణదేవరాయలకు ఊపిరి లేచి వచ్చింది. వారి పదములంటి, శరణు వేడాడు. వారంగీకరించారు. విజయనగర ప్రవేశం చేశారు. కుహూ యోగమున్న రోజు, సిం హాసనాన్ని అధిష్ఠించారు. వారిని ఆ ఘడియలలో కుహూ యోగం, ఒక విష సర్పం రూపాన కాటువేసేందుకు వచ్చింది. అప్పుడు వారు దాని వైపోచిరునవ్వుతో చూశారు. అలా నవ్వుతూనే, దానిపై, తన ఉత్తరీయాన్ని వేశారట ! అది కనురెప్ప పాటులో, మలమల మాడి, బూడిదగా కిందికి రాలింది. తాను సం హాసనాన్ని అధిరోహించిన అవసరం, అలా శుభప్రదంగా పరిణమించిన మరుక్షణం, వ్యాసరాయలవారు, శ్రీకృష్ణ దేవరాయలను పున: పట్టాభిషిక్తుని చేశారట ! తనకు ప్రాణ భిక్ష పెట్టినందులకు కృతజ్ఞతాసూచకంగా, వారికి స్వర్ణ సిం హాసనం పై, నవరత్నాభిషేక మహోత్సవం రాయలవారు అనితరసాధ్యంగా చేశారని చరిత్ర !
విజయనగరాధీశుని కుహూ యోగం విపత్తు నుంచీ, విముక్తి కలిగించిన వ్యాస రాయలవారు ఉపాసనా బలంతో, భక్తి తన్మయతతో, బాల కృష్ణుని సైతం తమ కనుసన్నలలో ఆడించేవారట ! యమునాకల్యాణి రాగంలో 'కృష్ణా నీ బేగనె బారో' అంటూ కృష్ణుని రా రమ్మంటూ, తమ మధుర స్వరంలో వారు పిలిస్తే చాలు, పట్టుపీతాంబరం ధరించి, శ్రీచందన ఘుమ ఘుమలు అలముకొంటుండగా, కాళ్ళగజ్జియల ధిమిధిమి ధ్వనులతో నాట్యమాడుతూ, ఆ లీలామానుష వేషధారి, ప్రత్యక్షమవ్వాల్సిందే మరి !
హంపిలో ' యంత్రోద్ధారక ప్రాణదేవరు ' ప్రతిష్ట చేయాలని సంకల్పించారు వ్యాసరాయలవరు. వాయు చిత్రాన్ని వరు వ్రాసిన మరుక్షణం, ఆ చిత్రం మాయమైపోయేదట ! ఇలా పన్నెండు రోజులు గడిచింది. అ రోజు పదమూడోరోజు. వ్యాస రాయలవారు, వాయు పటం గీచి, దాన్ని ఒక యంత్రం మధ్యలో బిగించరు. పన్నెండు వానరాలు, ఒక దాని వాలాన్ని మరొకటి పట్టుకుని ఉన్నట్టుగా ఆ వాయు చిత్రం చుట్టూరా చిత్రీకరించారు వారు. ఇక ఆ బంధంలో నిలిచిన వాయు జీవోత్తముల వారు, బైటికి వెళ్ళలేక అలాగే అక్కడే నిలచిపోయారనీ, దాన్నే హంపి లో వారు స్థాపించారనీ, అ యంత్రం ఇప్పటికీ అక్కడ ఉన్నదనీ ప్రతీతి.
ఇదిలా ఉండగా, అయ్యా అమ్మా ప్రతి చోటా, ప్రాకారాలపై ఉన్న శిల్పాలను చాలా నిశితంగా చూస్తుంటే 'అబ్బా, యేముందబ్బా, యీ శిల్పాలలొ!' , అని అప్పటికి (నాది చిన్న వయసు కదా అప్పుడు) విసుగొచ్చినా, తరువాత పెద్దైన తరువాత చర్విత చర్వణం చేసుకుంటే, అయ్య గత జన్మలో యీ ప్రాంతాలతో గట్టి బంధమే కలిగి ఉండేవారనిపిస్తుంది, ఇప్పుడు !
శిల్పాల వెనుక ఆయా శిల్పుల సహజ నైజం కూడా కనిపిస్తుందట ! విట్ఠల, విరూపాక్ష, కృష్ణ స్వామి గోపురాలు, అచ్యుతాలయం - ఇక్కడి కల్యాణ మంటప స్థంభాలపై ఉన్న బొమ్మలలోని సహజ శృంగారం, ఆ బంధాలూ, అన్నీ కళాశాస్త్ర బద్ధంగానే ఉన్నయని అమ్మా, అయ్యా అనుకునే వారని, తరువాతెప్పుడో, (నేను పెద్దైనతరువాత అమ్మతొ అక్కడికి వెళ్ళినప్పుడు) తనే చెప్పింది. ఇలాంటి విశేషాలు మనకు దొరకాలంటే కళ్ళల్లో వొత్తులు వేసుకుని వెదకాలట మరి ! క్రోధ ప్రదర్శన కోసం, భీమసేన దర్వాజా దగ్గరి, భీమసేన విగ్రహం ముఖ కళను చూడాలట ! మహర్నవమి దిబ్బ వెనకున్న గుడిలోని భేతాళాకారాన్ని చూడాలట ! విఠలాలయం కల్యాణ మండపం లోపలి స్తంభాలలో చెక్కి ఉన్న శిల్పం మరీ ప్రత్యేకమైనదట ! ఒక హైందవుడు, ఒక తురకవానిని క్రోధం నిండిన కళ్ళతో గడ్డం కింద కత్తి పెట్టి చంపబోతున్న వైనం చూసి తీరాల్సిందేనట ! విఠలాలయ భిత్తికా భాగాలలో, చుట్టూ ఉన్న బొమ్మలలో, గుర్రాలను నడిపించుకుని వస్తున్న ఒక పోర్చుగీసు వ్యాపారి బొమ్మ ఉందట . అతని కన్నుల్లో, తన గుర్రాలకు తగిన ధర వస్తుందా లేదా అన్న సందేహమూ, కొట్టవచ్చినట్టు కనబడేలా ఆ శిల్పి చెక్కిన తీరు, అత్యద్భుతమట ! ఇటువంటివి, నిజానికి, చిత్ర ప్రపంచం లోనో, కవిత్వ వర్ణనల్లో చూడగలమెమో కానీ శిల్ప ప్రపంచంలో చూడటం తటస్థిస్తుందా అసలు అని అనుమానం వస్తుంది తప్పక. కదూ?
హంపీ శిల్ప కళగురించిన అతి గొప్ప విశ్లేషణ అయ్య మాటల్లోనే , కవి సార్వభౌముడు, కలి మహరాజ చండ ముద్రాధరులచే, అనిపించినట్లు, స్వచ్చమైన జాతి భూలోకంలో లేదు. కాల చక్రపు చంక్రమణంలో ప్రతి జాతీ, అనేక కారణాలచేత, సంకరమై ఉంటుంది . ఈ సాంకర్యమే, రసపోషణకు మూలమని కొందరు శాస్త్రజ్ఞుల అభిప్రాయం. కాబట్టి ప్రతి జాతికీ, యెక్కడొ ఒకచోట, సాంకర్యం తప్పదు. విజయ నగర శిల్పం కూడా ఆ సాంకర్య సూత్రానికి లోబడినదే ! దీని సహజ లక్షణం - హైందవం. హైందవములో ద్రావిడము. ద్రావిడ శిల్ప కళలో, యెన్ని సాంకర్యములున్నాయో, అవి అన్ని ఇందులోనూ కనబడతాయి. అరబ్బీ, యవన కళా లక్షణములక్కడక్కడా యీ శిల్ప కల్ళలో ఇమిడి ఉన్నాయి. ఇలాంటి సాంకర్యములో, యీ శిల్ప కళ, తేజోవృద్ధిని చెందినదే కానీ, తన సహజ భావాన్ని కోల్పోలేదు. విజయ నగరాన్ని చూచిన వారందరూ, దాన్ని స్వర్గ ఖండమంటారేకనీ, విదేశ ఖండమని యెంత మాత్రమూ అనరు. ' ( 'హంపీ-విజయ నగరము ' -పుట్టపర్తి, ) 
..................
............................

No comments:

Post a Comment