Thursday, 23 July 2015

 తెలుగు సాహితీసమితి న్యూ జెర్సీ ఇటీవలే ముఫై సంవత్సరాల సుదీర్ఘ సఫల యాత్ర విజయోత్సవాలను కన్నుల పండుగగా చేసుకుంది.  ఉదయం తొమ్మిది గంటలనుండీ రాత్రి  పదకొండు గంటల వరకూ ఆసాంతమూ ఆసక్తికరంగా, నయనానందకరంగానూ, శృతి సుభగంగా, ఉత్తేజవంతంగానూ కొనసాగిన    సాహిత్య సంగీత నాట్య విభావరి వేల రసజ్ఞుల మనసులను దోచుకుంది.ఇక్కడి బాల బాలికల నాట్య, సంగీతాభినివేశాలు నిజంగా ప్రశంసాపాత్రాలు.  వారి తల్లిదండ్రుల శ్రద్ధాసక్తులు నిజంగా కొనియాడదగినవి. తెలుగునాడు వలెనే  అలాంటి కౌశలం ఇక్కడ అమెరికాలోనూ వెల్లివిరియటం అద్భుతమే! ఈ సందర్భంగా తెలుగు సాహితీసమితివారు ప్రతిభ అన్న పేరుతో ఒక ప్రత్యేక సంచికను వెలువరించారు. డాక్టర్.వైదేహీశశిధర్ గారు యీ సంచిక బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి,బహు చక్కని సంచికని తీసుకువచ్చారు. అందులో నా  రచనకూ స్థానం దక్కటం నా అదృస్థంగా భావిష్తున్నాను.తెలుగు సాహితీసమితి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలతో ఆ వ్యాసాన్ని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.



                ..............  
                               'గాధాసప్తశతి' లో గ్రామజీవనం                    
                                                                                                    డా.పుట్టపర్తి నాగపద్మిని                     
        ఇటీవల ఒక ఫోటో చూశాను. పాతకాలం బాటసారులకోసంలో నిర్మించిన సత్రాలూ, బావులూ, ఇంకా అక్కడక్కడా అవశేషాల్లా ఉన్న ఊర్లు! మా చిన్న తనంలోనూ ఇలాంటి సత్రాలు ఊరి బయట ఒకటి రెండు కనిపించేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా  మారిపోయింది.  ఊళ్ళలో అన్నీ నక్షత్ర కాంతుల లాడ్జీలే కనిపిస్తాయి. చిన్న చిన్న ఊళ్ళలోనూ చిన్నో చితకో లాడ్జీలే ఉంటాయి తప్ప,ఉచితంగా బాటసారుల సేద తీర్చే సత్రాలు కనిపించనే కనిపించవు.
        ఆ ఫోటోలు చూస్తుంటే, గాధాసప్తశతి లోని అచ్చమైన పల్లె వాతావరణం, బాటసారులను గ్రామస్తులు ఆదరించే పద్ధతీ, వారి ముచ్చటగొలిపే సంప్రదాయాలూ, వారి నమ్మకాలూ ఇవన్నీ గుర్తొచ్చి, కళ్ళు చెమరించాయి.
       మా అయ్యగారు పుట్టపర్తివారి వద్ద మూదువందల గాధల దాకా నాకు  పాఠం  అయ్యింది-1973-1974 ప్రాంతాలలో! వారి దగ్గర  పాఠం   అంటె, కత్తి మీద సామే! నిన్న చెప్పిన  పాఠం  యీరొజు అప్పజెప్పి తీరాల్సిందే!యేమాత్రం తేడా వచ్చినా తిట్లు తప్పవు. అయ్య కోపాన్ని తట్టుకోవటం చాలా కష్టం. ఏదో పడుతూ లేస్తూ, కొన్ని గాధలు పూర్తి చేసుకోగలిగాను కానీ, ఆగిపోయినతరువాత తెలిసింది- ఎంతగా నష్టపోయానో!ఏదో నేనాతరువాత, మరికొన్ని చదివినా, అప్పటి అనుభవం ముందు, ఇవన్నీ దిగదుడుపే! 
 మా  అయ్యగారు చూపిన మార్గంలోనే నడుస్తూ,వారు చెప్పిన, నేను గమనించిన నాటి గ్రామ జీవితం గురించి కొన్ని సంగతులివిగో మీకోసం! 
   అసలు, గాధాసప్తశతి మొత్తం అమూల్య మౌక్తిక రాసి. ముక్తకాలంటే, వేటికవే సంపూర్ణార్థం కలిగి, చదువరులను ఆహ్లాదపరచే రసగుళికలు. భామహుని దృస్టిలో అనిబద్ధ కావ్యం ముక్తకం.   అగ్నిపురాణకారుని  దృస్థిలో        
 'చమత్కార సృస్థిలో సామర్థ్యం ఉన్న శ్లోకమే ముక్తకం. లోచనకారుడంటాడూ- 'పూర్వాపర నిరపేక్షణాపియేన రసచర్వణా  క్రియతే తదేవ ముక్తకం' అని! మొత్తానికి, వ్యంజనతోపాటూ, రస సృస్ఠీలోనూ సామర్థ్యం గల ముక్తకాన్ని, సరస ముక్తకమనీ, కల్పనతోపాటూ, నీతినీ గంభీరంగా ప్రతిపాదించే ముక్తకాన్ని సూక్తి అనీ అంటారు. చమత్కారం కూడా లేని ముక్తకాన్ని వస్తు కథన ముక్తకం అంటారు. గాధాసప్తశతిలో ఇవన్నీ ఉన్నాయనె చెప్పాలి.
 దా.జాన్ డ్రింగ్వాటర్ దృష్టిలో, మనిషి లోని మానసిక శక్తి నాలుగు విధాలు. 1. పూర్ణనియంత్రణాత్మిక బౌద్ధిక దృష్టి (Profound Intellectual controll of mateirial) 2. పూర్ణ భావాత్మక చేతన (Profound emotionsal Sensitiveness to mateirial) 3. నైతికత (Energy of Morality) 4. కవిత్వ శక్తి. (Petic energy)
వీటిలో, మొదటి రెండింటినీ, సంఘటిత శక్తి, సహృదయత అనే అనవచ్చు. మూడవది మనకు తెలిసినదే! నాలుగవదైన కవిత్వ శక్తిని, అన్నింటిలోనూ శ్రేష్తమైనదంటారాయన! (Poetic energy is the witness of the highest urgency of individual life, of all things, the most admirable and great.)                   
        ఈ నేపధ్యంలో, గాధల్లో నాటి  గ్రామీణ వాతావరణం ప్రతిఫలించే  కొన్ని ముక్తకాలలోని  మధురిమలను ఆస్వాదిద్దాం. 
 ఇక్కడొమాట చెప్పుకోవాలి. గాధాసప్తశతి నిండా శృంగారమే చిప్పిల్లుతూ ఉంటుందనీ, మరి ఇతర వ్యక్తీకరణలే ఉండవనీ ఒక అభిప్రాయం ఉంది. ఆమాటకొస్తే, మన జానపద సాహిత్యంలో శృంగారానికే పెద్ద పీట కదా! కానీ, వానిలోని  భాష అందరికీ అర్థమయ్యేది కాబట్టీ, కాస్త అందుబాటులో  ఉంది కాబట్టీ, జానపద సాహిత్యాన్ని మరింతగా వెలికి తీసి, అందులో ఉన్న ఇతర విషయకాలైన గేయాలను విశ్లేషించి, జానపద సాహిత్య హృదయాన్ని శ్లాఘిస్తున్నారు. కానీ, హాలుడు తనకిస్తమైన అప్పటి కొన్ని గాధలను మాత్రమే  సమీకరించాదు. ప్రాకృత సమాజాన్ని అధ్యయనం చేయటానికి,  అవే మనకు ఇప్పటికి  దారి దివ్వెలు. అంతమాత్రం చేత, ఆనాటి సమాజాన్ని విశృంఖల శృంగార భరితం అనటం సబబు కాదేమోననిపిస్తుంది.  ఉన్నంతలో, వాటిని విశ్లేషిస్తే, ఒక విషయం బోధపడుతుంది. గాధాసప్తశతి లోని శృంగార గాధలన్నీ మేలిమి ముత్యాల రాసులు. మధ్యలో వెలుగులు విరజిమ్ముతూ, మనల్ని ఆకర్షించే మేలు జాతి మరకత మణులూ, పచ్చలూ- అందులోని గ్రామీణ జీవన చిత్రణలు.
     ఇప్పుడిక అసలు విషయంలొ ప్రవేశిద్దమా!      
     ఊరి ముందు ఒక పెద్ద మర్రిమాను, దాని చుట్టూ అరుగూ కూడా  ఉంటే, బాటసారులకు ఎంత అనుకూలంగా ఉంటుంది కదా! గాధాకారుడదే అంటున్నాడు. 
           సుఅణో జం దేస మలంకరేఇ తం విఅ కరేఇ పవసంతో, 
           గామాసణ్ణుమ్మూలిఅ మహావడట్టాణ సారిచ్చం. (1-94) 
 వటవృక్షం, ఊరిపొలిమేరలో ఉంటే, ఊళ్ళో సత్పురుషుడు ఉన్నట్టే! అంతా సంతోషంగా, శ్రీరామ  రక్షగా ఉంటుంది.అదే ఆ సత్పురుషుడు పోతే, ఊరంతా పాడైపోయినట్టే! మర్రిచెట్టు కూలిపోయినా, ఊరిపొలిమేరంతా బిక్కు బిక్కుమన్నట్టు ఉంటుంది.  మర్రిచెట్టును సత్పురుషునితో పోల్చటం గాధాకారుని గొప్పదనం కాదూ! 
మర్రిచెట్టునుదాటి కాస్త ఊరిలోకి వెళ్తే, అక్కడొక కుండలకపిల కనిపించింది గాధాకారునికి! దాహం వెసింది.మంచినీళ్ళు తాగాలనిపించింది. కుండలతో నీళ్ళు చేదుకునే సమయంలోనూ,ఒక సంగతి గుర్తొచ్చిందతనికి!కుండల కపిలను చూస్తే  దుష్టులు   గుర్తొచ్చారట పాపం! ఎలా? ఖాళీగా ఉన్నపుడు, తేలికగా, ముఖం వేళ్ళడేసుకుని ఉండే కపిలలు, బావిలోకి వెళ్ళి నీళ్ళతో నిండి, బయటికి వచ్చేటప్పుదు, నీల్గుకుంటూ, గొప్పగా గర్వంగా బయటికి వస్తాయట! దుష్టులూ అంతే! తమ అవసరం వచ్చినప్పుడు, వినయంగా వెళ్తారు. పని ముగిసిన తరువాత, పెడమొగం పెడతారు.ఆ గాధ ఇదీ! 

              ఉఅఅం  లహిఉణ  ఉత్తాణిఆఅణా  హోంతి కే  వి  సవిసేసం 
              రిత్తా ణమంతి  సుఇరం  రహట్ఠ  ఘడిఅ  వ్వ  కాపురిసా..(5-90) 
        నీళ్ళు తాగి కాస్త సేదదీరి, ఊళ్ళోకి అడుగులు వేశామోలేదో, మళ్ళీ, నోరెండుకు పోతోంది.ఏమి యెండలండీ బాబూ! యెండలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, ఇదిగో ఇలా! 
           థో అం పిణ ణీసరయీ మజ్ఝణ్ణే ఉహ సరీరతలలుక్కా 
           ఆఆవభఏణ చాఈ వి పహిఆ తా కిం ణ వీసమసి (1-49) 
    'అబ్బబ్బా! ఈ ఎండ ఎంత తీవ్రంగా ఉందంటే, చెట్టు నీడ కూడా భయపడి చెట్టుకిందే దాక్కుంది .'చూశారా!  ఆహా! గాధాకారుని అత్యుక్తి అమోఘంగా లేదూ? సాధారణంగా మట్టమధ్యాహ్నం ఎండ, చెట్టు కిందే పడుతుంది.ఆ  వాస్తవాన్ని, యీ ముక్తకంలో ఎంత బాగా వ్యక్తీకరించాదో! నీడకు భయాన్ని ఆపాదిస్తూ 'చెట్టుకిందే తలదాచుకుంది పాపం' అనటంలోనే ఉంది ప్రజ్ఞంతా!
 అదిగదిగో! అక్కడొక చలివేంద్రం ఉన్నట్టుందండోయ్! బాగానే గుంపు కనిపిస్త్తున్నది..అమ్మయ్య.. దగ్గరికొచ్చేశాం. అరెరే! బాటసారుల దోసిళ్ళలో చెంబుతో   నీళ్ళు పోస్తున్న అందగత్తెను చూస్తుంటే మతి పోతోందే! యేమందం, యేమందం! 
        ఉద్ధచ్చో పిఅయి జలం జహజహ విరలంగలీ చిరం పహిఓ 
        పావాలిఆ వి తహతహ ధారం తణుయిం పి తణుయేయి. (2-61)
    ఆ చిన్నది బహు వయ్యారంగా నీళ్ళు పోస్తుంటే, అదిగో, ఆ యువకుడు దోసిలితో పట్టి  తాగుతున్నాడు అ అందగత్తెను తదేకంగా చూస్తూ! అరెరే! ఎంతకీ దోసిలి నిండదేమిటి? పైగా నీళ్ళన్నీ ఓవైపు కారిపోతున్నాయి కూడా! తలెత్తి ఆ చిన్నదాని అందం తాగుతున్నాడా అన్నట్టుగా ఉంది తప్ప, దాహం తీర్చుకుంటున్నట్టే లేదు. ఆ వయ్యారి కూడా తక్కువేమీ తినలేదు లెండి. నీళ్ళధార బాగా తగ్గించి మరీ పోస్తున్నది ఆ యువకుని దోసిలిలో! ఇద్దరికిద్దరే! అందుకే కాబోలు, ఇక్కడింతమంది గుమిగూడారు! వీళ్ళ కథ ఇప్పుడప్పుడే ముగిసేట్టులేదులెండి. మరేదో ఒక మార్గం చూసుకోవాలిక! 
 అదిగదిగో! అక్కడేదొ మంచినీటిచెరువు  ఉన్నట్టే ఉంది..పక్షులు ఎగురుతున్నాయక్కడ!హమ్మయ్య! చూశారా!వచ్చేశాం.. ఎంత నిశ్శబ్దంగా ఉందిక్కడ! అరెరే! చెరువు ఎంత నిశ్చలంగా ఎవరొ ఆకాశాన్ని నీళ్ళల్లో పదిలంగా తల్లక్రిందులుగా పెట్టినట్టే లోపల ప్రతిబింబిస్తూ  ఉందే! అదిగో! ఆ..నెమ్మదిగా అడుగులు వేద్దాం..చూశారా! అంత పెద్ద ఆకాశం మీద పడినా ఒక్క కమలమూ నలగ లేదు. ఒక్క హంసా యెగిరి పోలేదు..  
             కమల అరాణ మలిఆ హంసా ఉడ్డావిఆ ణ అ పిఉచ్చ్హా 
             కేణావి గామ తడాయే అంభం ఉత్తాణఅం వ్వూఢం (2-10) 
 అదిగదిగో! ఇంకో చిత్రమూ చూడండి.. 
            ఉఅ ణిచ్చల ణిప్పందా భిసణి పత్తమ్మి రేహయి బలాఆ 
            ణిమ్మఅ మరగఅ భాఅణ పరిట్ఠిఆ సంఖ సుత్తివ్వ (1-4)
     అదిగో, అదేమిటీ? మేలు జాతి మరకత మణులు తాపించిన పాత్రలో, చందనమదీ ఉంచేందుకు పెట్టిన శంఖ నిర్మితమైన   భరిణె లా అందంగా కనిపి స్తున్నదేమిటబ్బా? అరెరే! శంఖం కాదండీ.. విచ్చిన తామరల మధ్య నిశ్చలంగా కూర్చుని వున్న కొంగ సుమా! యేమాశ్చర్యం! అంటే.. చాలాసేపటినుంచీ ఇక్కడికెవరూ రానేలేదన్నమాట! భలె బాగుందికదూ..ఇది ఇక్కడి ప్రేయసీప్రియులకు చక్కటి సమాగమ ప్రదేశంలా ఉంది. ఎవరూ రారు అంతగా మరి..మనమేదో బాటసారులం.నీళ్ళు వెదుక్కుంటూ వచ్చామంతే కానీ ఊళ్ళో వాళ్ళకి ఇక్కడేంపనీ? పదండి..మనమూ నీళ్ళు తాగి మన దారిన మనం పోవాలి.. "
           బాటసారుల అనుభవాలెలా ఉండెవో మచ్చుకు కొన్ని ఇవన్నమాట!  అప్పటి గ్రామాల్లొ, వరి చేలు బాగా ఉండేవి.(4/30, 7/91) చెరుకు పంట  గురించే కాక చెరుకు తీయటాన్ని కూడా వర్ణీంచారు గాధాకారులు. ఇంకా జొన్నలూ,రాగీ,  పత్తి, నువ్వులూ, కాకరా, దోస మొదలైన పంటల గురించిన ముక్తకాలూ కనిపిస్తాయి.పత్తిని ఆడా మగా కలిసి యేరేవారటకూడా! (2/77)  మామిడి తోపులు పల్లెల్లో బాగానే ఉండేవట!(1/62,2/43)మామిడి తోపులలో ప్రేయసీప్రియులు కలుసుకోవటం గురించి యెక్కువగానే వర్ణనలున్నాయి.అంతే కాదు.మామిడి తోరణాలతో  ఇంటి ని అలంకరిచటమూ ఉండేది. 
                   సా తుహ కయేణ బాలా అ అణిసం ఘరదార తోరణ అణిసణ్ణా 
                  ఓససయీ వందణ మాలి అ వ్వ ది అ హం వి అ వరాయీ (3/62)
    దూతిక ఒక యువకునితో అంటున్నది-'ఆ అమాయకురాలు, మమిడి తోరణంలా నీకోసం, పవలూ రేయీ పడిగాపులు కాస్తూ అలాగే వేచి ఉంది. కాస్త కనికరించు.'  ' పవలూ, రేయీ' అంటే, నిరంతరమూ అలా నిలుచునే ఉంటుందన్నమాట ఆగంతకుడైనవారి కోసం!  మామిడి తోరణం ఎప్పుడూ యెదురు చూస్తున్నట్టుగానే,ఆ అమ్మాయీ ఎదురుచూస్తూ, వాడిపోతోందని అర్థం. అంటే, హాలుని కాలంలో మమిడితోరణాలు ఇంటిగుమ్మాలకు కట్టే ఆచారం ఉండేదని స్పస్తంగా తెలుస్తున్నది. ఇంకా ఇలాంటి ఎన్నో ఆచారాల గురించి, గాధల రూపంలోనే హృద్యంగా వర్ణించారు కవులీ గాధల్లో!                          
                     ఇంకా నేరేడు (2/80) బిల్వం (9/19) కూడా పెంచేవాళ్ళు మాలతి(1/92),వకుళ(1/63),కుంద(5/26),కదంబ(1/37),శిరీష(1/55),పారిజాత(5/12)వృక్షాలను ఇళ్ళల్లోపెంచుకునేవారట కూడా! గ్రామాలకు దగ్గరగా ఉన్న అడవుల్లో, వేప(1/30)వట(1/7మొదలైన వృక్షాలు ఉండేవట! ఇంత చక్కటి వాతావరణంతో అలరారుతున్న పల్లెపట్టుల్లో ఆనాటి ప్రజలు ఎంత నెమ్మదిగా, ఆనందంగా జీవనం సాగించేవారోకదా, అనిపించదూ మనకు? నేడు నగరాలకూ, పల్లెపట్టులకూ, పెద్దగా తేడ ఉండటమేలేదనిపిస్తున్నది. ఎటుచూసినా, కాంక్రీటు అడవులే కదా దర్శనమిస్తున్నాయి మనకు! పల్లెటూళ్ళలోనూ వేగ నాగరికత చాయలు కనిపిస్తూనే ఉన్నాయి కదా మరి! 
    గాధాసప్తశతి లోని స్త్రీలు మనలా శిరోజాలంకరణకు, మల్లెలు, జాజిపూలూ, కనకాంబరాలు వాడేలా కాక, నేరేడు చివుళ్ళు కూడ వాడేవారట! (2/80) మగవాళ్ళు కూడా కర్ణావతంసాలు పెట్టుకునేవారట!మామిడి పూగుత్తులు (4/31) పాద్రి పూలూ కూడా ధరించేవారని కొన్ని గాధల్లో ఉంది. (5/69) 
    బాటసారులకు ఇళ్ళబయట పడుకునేందుకు అనుమతించటంతోపాటూ, తలకిందికి గడ్డిమోపుకూడా సరఫరా చేసేవాళ్ళట! (4/79) బాగుంది కదూ! 
 సరే! పడుకునేందుకు ముందు బాటసారులకు కాస్త ఉబుసుపోక కబుర్లు కూడా కావాలి కదా మరి! ఒకతనన్నాడూ.క్రితంసారి తాను ప్రవాసానికి వెళ్ళినప్పుడేమైందంటే, తాను ఊరి చెరువులో స్నానానికి వెళ్ళాడట! తీరా వెళ్ళేసరికి,  అక్కడ, ఆడవాళ్ళు కూడా, జలకాలాడుతున్నారు. తానూ నీళ్ళలో దిగాడు. ఇంతలో ఏమైంది?
            పిసుణేంతి కామినీణం,జలలుక్క పిఆవ ఊహణ సుహేల్లిం
            కణ్డఇఅ కవోలుత్ఫుల్ల ణిచ్చలచ్చీయిం వఅణాఇం.(6/58)
 యెవరో తన కాళ్ళు లాగుతున్నారట! చచ్చే భయం  వేసింది. కొంపదీసి మొసలి కాదుకదా? భయపడి గట్టిగా  అరిచేసరికి, చుట్టుపక్కల వాళ్ళు, నీళ్ళలోకి వంగి విడిపిస్తుంటే యేమైంది? ఎవరో యువకుడు, తన ప్రియురాలనుకుని, తనకాళ్ళు పట్టి లాగాడన్న మాట! అందరూ ఒకటే నవ్వులు! 
  అతని మాటలు విని తక్కిన ఇద్దరూ కూడా కిసుక్కున నవ్వారు. మరిప్పుడు రెండవ బాటసారి తన అనుభవం ఇలా చెప్పాడు. అది చలి కాలం. ఒక  వూరిలోని దేవాలయం దగ్గర మునగదీసుకుని పడుకున్నాడు. చలి పడుకోనీయటమే లేదు. అక్కడా ఇక్కడా గడ్డీ, గాదమూ  యేరుకొచ్చి, నెగడు వేసుకున్నాడు.  అవి ఒకసారే అంటుకుంటాయా మరి?  ఒక పట్టాన రాజుకోవటమే లేదు.ఊది, ఊదీ,తన బట్టలూ పిడకల కంపు కొడుతున్నాయి. అంతేనా! ఒకటే పొగ! పిడకలూ, గడ్డీ ఎగదోస్తూ కూర్చున్నాడు రాత్రంతా! నెగడును కర్రతో కెలుకుతూ ఉంటే, లోపల యెర్రగా కనిపిస్తుంది. ఆరిపోతే  నల్లగా పెద్ద రాసి. యెలుగు బంటిలాగే  ఉందట ఆ రాశి! నెగడును కుళ్ళబొడుస్తుంటే, ఆ  యెలుగు బంటి పొట్ట  చీలుస్తున్నాట్టే  అనిపించిందట తనకు! అలా, రాత్రంతా ఒంటరిగా గడిపానని చెప్పుకొచ్చాడతగాడు! తక్కిన ఇద్దరూ  జాలి పడ్డారు అతగానిపై!  ఆ గాధ ఇదీ..
                  ఫాలేయి అఛ్ఛ భల్లం వ ఉఅహ కుగ్గామ దేవుల ద్దారే 
                  హేమంత ఆల పహిఓ విఝ్ఝాఅంతం పలాలగ్గిం. (2/9) 
  ఇప్పుడిక మూడవ బాటసారి అందుకున్నాడు. క్రితం సారి తానొక ఇంటిముందు ఇలాగే పడుకున్నాడు.రాత్రి బాగా పొద్దు పోయింది. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు.ఒక్కసారిగా  ఇంట్లోంచీ ఒకటే యేడుపులూ పెడ బొబ్బలూ! ఇంటి  ఇల్లాలు ప్రసవ వేదన పడుతున్నట్టుంది.   చాలా మంది ఆడవాళ్ళు  ఆమెను సముదాయిస్తున్నారు. కాస్త వేడి నీళ్ళు    తాగించండి అని ఎవరో అంటే, 'యేమీ వద్దు అంటూంది ఆమె. 'అసలేమీ వద్దంటే ఎలాగే తల్లీ' అన్నారెవరో! 'అమ్మ నాయనో! ఓరిదేవుడో! ఇంత కష్ట పడాలా పిల్లల్ని కనాలంటే? మొగుడూ వద్దూ, మొద్దులూ వద్దు. నాకు పిల్లలొద్దురో దేవుడా!' అని ఆ గృహిణి ఒహటే ఏడుపు! 'దీన్నే అంటారు ప్రసూతి వైరాగ్యమనీ!' అంటూ భళ్ళున నవ్వేస్తున్నారట  చుట్టూ చేరిన ఆడాళ్ళు!బయట పడుకున్న తనకీ పట్టరానంత నవ్వు వచ్చిందట! ప్రపంచంలో కాపురాలన్నీ ఇలాగే సాగుతుంటాయి మరి! (2/26)
         మన నిత్య జివితంలో పాదుకుని పోయి వున్న  కొన్ని నమ్మకాలకు అచారాలకు మూలాలు,   కొన్ని గాధలలో  కనిపించటం మనల్ని  ముగ్ధులను గావిస్తుంది. పొలం పనులు మొదలు పెట్టేటప్పుడు,  మడకపై   శుభ సంకేతంగా స్వస్తిక గుర్తునుంచటం (2/61)   బంగారు 'శ్యామ శబల వ్రతం' చేయటం వల్లే,  అందమైన ఆడవారి ఆభూషణంగా మారి, వారి అందమైన శరీరాలను అంటిపెట్టుకునే  భాగ్యాన్ని పొందిందనటం (3/11)   కోపకారణంగా  పగలంతా భర్త తో మాట్లాడకపోయినా,   రాత్రి,  అతని పాదల వద్దే భార్య పడుకుందనటం (7/27)  ప్రియునికి లేఖ వ్రాస్తూ,  ముందుగా 'స్వస్తిశ్రీ ' అన్న కుశల సూచక  పదాన్ని వ్రాసిందనటం (3/44) ఇలాంటి  వర్ణనలతో, గాధా సప్త శతి - 'ఇది మన జీవితాల దర్పణమే' ననిపిస్తుంది.  ఇంక, శకునాలు, పెళ్ళి సంబరాలు, పెళ్ళి పాటలు, సూర్య నమస్కరాలు, సంధ్యా వందనాలు,గుప్త నిధులు, సతీ సహగమనాలతొపాతూ, ఎలుగుబబ్త్లు,నెమళ్ళు, జింకలు, సాలెపురుగులు,బర్రెలు మనలను తమతో నడిపిస్తాయి.   ఇంద్రధనుస్సులు మనల్ని మురిపిస్తాయి.  క్రీస్తు శకం 6-7 సంవత్సరాల మధ్యవాడైన  హాల చక్రవర్తి సంకలనం చేసిన మహారాష్ట్రీప్రాకృతం   లోని యీ గాధాసప్తశతిలో, గోదావరి, నర్మద, రేవా నదుల ప్రసక్తితోపాటూ,కొందరు తెలుగు కవుల గాధలూ, అత్తా(అత్త) అద్దాయే(అద్దం) తుప్ప(నేయి) రంప(రంపపుపొట్టు) మయిల (మైల) చోజ్జం(చోద్యం) వంటి తెలుగు పదాలు ఉండటం వల్ల, తెలుగు భాష ప్రాచీనతకు ప్రామాణికత చేకూరిన తృప్తీ దక్కుతుంది.
        ఇన్ని విశేషాలున్న  గాధాసప్తశతికి, కేవలం శృంగార శతకంగానే ముద్ర వేయటం, అంత భావ్యం కాదేమోననిపిస్తుంది. పైగా, ఇప్పుడు, మనల్ని మళ్ళీ పల్లెలవైపు నడిపించే శక్తి కూడా యీ గాధలకు ఉందంటే అది అతిశయోక్తి కాదేమోకూడా!                                  డా.పుట్టపర్తి నాగపద్మిని     
                                                   .......................  
       


No comments:

Post a Comment