Monday, 30 November 2015


(సంవత్సరం వివరాలు లేవుకానీ విశాలాంధ్ర వార్తాపత్రికలో చాలా విపులంగా వచ్చినె అంశమిది...)
                          గురజాడ మహా కవి మాత్రమే కాదు-
                          మహా పురుషుడు కూడా'  -  పుట్టపర్తి
కడప లో జరిగిన గురజాడ వర్ధంతి సభలో (30th Nov) పుట్టపర్తి నివాళి (తేదీ లేదు కానీ యీ విశేసలు విశాలాంధ్ర వర్తాపత్రికలో వచ్చాయి)
      పది వుపన్యాసాలకంటే, మహాకవి వాక్కు ఒక్కటి వేల  హృదయాలను కదిలింపగలదు. భావుకుడైన  కవికి అట్టి శక్తి ఉంది. సృజనాత్మక శక్తిలోని ఆ మెరుపును, అ ఆంతరిక జ్యోతిని గమనించి వినియోగించుకోలేకపోతే,  సామాజిక వుద్యమాలు తమ ప్రయోజనాలను  నెరవెర్చలేవు. నాటి సామాజిక వుద్యమాలకు  చేయూతనిచ్చిన గురజాడ ఒక విద్యుత్తు. ఆయన ఒక మహాకవే కాదు. ఒక మహాపురుషుడు కూడా! సాహిత్యకారులలో  చాలామందికి ఆత్మస్తుతి ఒక చాపల్యంగా వుంటుంది. ఆత్మవిశ్వాసం అన్న రూపంలో అది కొంతవరకూ అవసరమేమో  కూడా! కానీ దాని పాలు  మితిమీరితే దురభిమానం అనికూడా విమర్శించగలవాళ్ళున్నారు.  గురజాడమీద కూడా ఆ కాలంలో నిందాపూర్వకమైన దురుసు విమర్శలు కొన్ని వచ్చాయి. కానీ ఆయన అన్నింటినీ శాంతంగా పరిశీలించి, సరసంగా సమధానం చెప్పారు. గొప్పవాళ్ళ లక్షణం అది. అంతకంటే గొప్పది ఆయన  సాహసం. యెండుగడ్డి వంటి శుష్క పాండిత్యమే కవిత్వం అనుకునే రోజుల్లో, అంతమంది కవి వృషభులనూ, కవి శరభులనూ ధిక్కరించి, సంప్రదాయానికి  యెదురు నిలబడే సాహసం సామాన్యమైనది కాదు. ఆనాటి పండితులుకూడా  సామాన్యులేమీ కాదు. దిగ్దంతులవంటి వారు. శతావధానులు. వాళ్ళందరూ వ్యావహారిక భాషకు వ్యతిరేకులు. వాళ్ళ గ్రాంధిక  భాషావాదాన్ని చీల్చి చెండాడిన పిడుగు వంటి  గిడుగు లక్షణకతకాగా, ఆయన లక్షణాలకు  లక్ష్యంగా  గురజాడ సాహిత్య సృష్టి చేశాడు. 
     ఆనాటి సంఘ సంస్కరణోద్యమానికి వీరేశలింగం ఒక మహానేత. ఆయనకు అన్నివిధాలుగా అండదండలుగా వుండినవాడు గురజాడ. ఐనా , కందుకూరినికూడా విమర్శించేందుకు వెనుకాడని సత్యప్రియుడు గురజాడ. శ్రీ కందుకూరి రచనల్లోని శృంగారాన్ని నిస్సంకోచంగా ఆయన విమర్శించారు. 
  కవి క్రాంత దర్శి. నేటి పరిస్తుతులు గమనించి, రేపటికోసం సూచనలు చేయటమే క్రాంతదర్శి పని. అటువంటి గుణం గురజాడలో వుంది. ఒకనాటి అతివాదులు మరికొన్నాళ్ళకు మితవాదులు కావటం మనం చూస్తూనే వున్నాము. ఈ దృష్టితో చూస్తే గురజాడ యెల్లప్పటికీ అతివాది. అయన బ్రతికి వుంటే, మనలోని అతివాదులకంటే అతివాదిగా వుండేవాడనిపిస్తుంది. నాచ్ భోగం మేళాల సమస్య సానుల సమస్య,  కేవలం  నైతిక సమస్య అని ఆనాటి వాళ్ళ అభిప్రాయం. నీతిబోధనలతోనే సానులను సంస్కరించవచ్చునని అనుకునేవాళ్ళు. కానీ వేశ్యావృత్తి, ఆర్థిక సమస్యతో ముడిపడివుందని యీనాడు అందరికీ తెలిసినదే! ఆవిషయాన్ని అనాడే గుర్తించాడు గురజాడ. సంస్కర్త హృదయం అన్న కథలో ఆయనకున్న దృక్పథం స్పష్టంగా కనపడుతుంది. పరివర్తనచెందే కాలంతోపాటూ పరిణమించగల మేధస్సంపదా, విశాల హృదయమూ, సత్యప్రియత్వమూ మహాపురుషుని గొప్పగుణాలు.
      గురజాడ నిజంగా మహాకవి. ఆయనను ఇతరులతో పోల్చి, తెలుగువాళ్ళు గుడ్డివాళ్ళు కాబట్టి గురజాడ గొప్పదనాన్ని గుర్తించలేరని కొందరంటారు.  ఇందులో సత్యం ఉన్నమాట నిజమే కానీ, ఇలాంటి పోలికలు ఒక దౌర్బల్యం. వుదాహరణకు ఇక్బాల్, బంకిం ల రచనలు మనకు తెలియవు. మన కన్యాశుల్కం వంటి నాటకం తమిళులకు మళయాళీలకు లేనిమాట  నిజమే కావచ్చు. కానీ భారతి రచనల వంటి గానాత్మక కవిత్వం మనకు లేదు. అట్లే వల్లత్తోల్ వలె బహు గ్రంధాలను వుత్తమమైనవి  రచించిన మహాకవులు మనకు లేరు. తమ రచనలతో బీరువాలు నింపిన కవులు మనకూ ఉన్నారు. కానీ వాళ్ళు,  గుణంలో వల్లత్తోల్ కు దీటు రారు.  మన పరోక్షంలో కూడా ఇతరులు మన్నించేటట్లు మనం మాట్లాడుకోవడం న్యాయం.
    గురజాడ దేశభక్తి గీతం చాలా గొప్పది. తెలుగులో అటువంటిది మరిలేదు. అంతమాత్రాన ప్రపంచ సాహిత్యంలో అటువంటిది లేదు...
   (to be continued pl)

No comments:

Post a Comment