Maa ayyagaru- A prolific Poet, Critic, Lyricist,Translator and Polyglot too..
Tuesday, 15 March 2016
Frends dears... I am very much excited with this joy of released CRITISISM books (2parts) of my revered father Dr.Puttaparthi. My dream of 25 years is now fulfilled by this edition of my father's works. I will be more happy if my father's fans, read them and share their views. They may be available at NAVODAYA and TELUGU BOOK HOUSE, both at Arya samaj Road, Kachiguda cross Roads, Hyderabad.
ప్రస్తుతము ప్రకటించిన 'ఋతుఘోష' రెండు కావ్యముల సంకలనము. ఋతువర్ణనము ప్రధానంగా నడుస్తుంది. ఒక ప్రియాప్రియుల ప్రేమగాధ అంగంగా సాక్షాత్కరిస్తుంది. ఈ సంకలనమెందుకని కవిగారినే ప్రశ్నించినాను. ఋతువర్ణనమొక్కటే ఐతే చదవడానికి బాగుండదేమోనని ఈ పని చేసినామన్నారు. చేర్చకుండా వుంటే బాగుండేదని నా ఊహ....
.............
శర్మగారిలో విశ్వనాధ, జాషువా, రాయప్రోలు, కృష్ణాశాస్త్రి మొదలగువారి పలుకుబడులు అక్కడక్కడా కనబడుతూ ఉంటాయి. శర్మగారికి తెనాలి రామకృష్ణుడన్నా పక్షపాతమే ! కొన్ని చోట్ల ఈ కవి, నేరుగా ఉమర్ఖయ్యాముకు శిష్యుడై కనిపిస్తాడు. వర్షఋతువును వర్ణిస్తూ, 'ఆత్మవేదనకొక యాకారమై తోచి నేటి రేయి నన్ను కాటు వేసె' అంటాడు. ఇట్టి పోకడలనే, 'సబ్జెక్టివ్ పొయెట్రీ ' అంటారు మర్మవిదులు.
...........
'ఆరుద్ర' కు నియమోల్లంఘనం చేయడమే స్వభావమని చెప్పినాను. కనుక యీ రచనలో, బాల వ్యాకరణాన్నీ, పాణినీయాన్నీ వెదకడం కష్టం. కవిత్వమనే పదార్థం ఇంతకు మించినది అనే దృష్టిని పట్టుకుంటే, యీ కావ్యం చదువవచ్చు.
జయంగొండార్ కవి తమిళంలో చాలా ప్రసిద్ధుడు. లలితుడుకూడా !
పరణి అని వీరకావ్యానికి పేరు. యెటువంటి వీరకావ్యం అనే విషయంలో ఒకటి రెండు వ్యాఖ్యాన భేదాలు లేకపోలేదు. కవి మొదటి కుళోత్తుంగుని ఆస్థానంలో వుండినాడు. మదటి కుళోత్తుంగుడు, మన రాజరాజనరేంద్రుని కుమారుడే ! చోళ చాళుక్యులకు చాలా సంబంధ బాంధవ్యాలుండేవి.
తమిళంలోకి మనం ప్రవేశించినప్పుడు, కొన్ని కొన్ని కొత్త సంకేతాలూ, అలంకారాలూ, ఆచారాలూ- మన కంట పడతాయి. తమిళ వాంగ్మయమే సంస్కృతంతో సంబంధంలేని ఒక మహా ప్రపంచం. ఉడుక వాద్యంతో నడుమును పోల్చడం, పగడసారెలతో స్తనమండలాన్ని పోల్చడమూ అంతే ! ................
శేషేన్ గారి 'ౠతుఘోష' కు పుట్టపర్తి 18-2-63 నాటి విపుల పీఠికా, ఆరుద్ర గారి తమిళానువాదం 'వేసవి- వెన్నెల' పై పుట్టపర్తి వారి చెణుకులూ ('63)..మరింకా యెన్నేన్నో. పుట్టపర్తి వివిధ భాషా సాహితీవిన్నాణానికి అద్దంపడుతూ..'పుట్టపర్తి విమర్శ తరంగిణి - రెండవ భాగం' లో మీముందుకు రాబోతున్నాయి....
నాకాంగ్లముపై ద్వేషము లేదు. అది మనదేశమునకెంతయో ఉపకారము చేసినది. ఇంగ్లీషును తిట్టు పండితులను చూసిన నాకసహ్యమే ! ఒక ఇంగ్లీషేమి? ప్రతిభాషకూడ యెంతో యుపకారమొనర్చును. ఆంగ్లేయులుకూడ మనభాషకు తక్కువ సేవచేసినవారు కాదు. దక్షిణభాషలకు మొదటి నిఘంటువును వ్రాసినవారందరునాంగ్లేయులే ! బ్రౌనుదొర మనభాషకుచేసిన సేవ సామాన్యమైనదికాదు. అదియాతనికి తండ్రినుండి సంక్రమించిన యాస్తి. అతడు వంగాదిభాషలకెంతయో సేవచేసినవాడు. ఆంగ్లేయులు సంస్కృతమునకు చేసిన సేవ మనము సిగ్గుపడవలసినంతటిది.' ఆంగ్లేయ పండితుల గురించీ, బ్రౌను దొర గురించి పుట్టపర్తి తన అభిప్రాయాలను ఇంత కుండబద్దలు కొట్టేలా వెలువరించిన సందర్భమేది? త్వరలో మీముందుండబోతున్న 'పుట్టపర్తి విమర్శ తరంగిణి - రెండవ భాగం'లో యీ వాస్తవాలు మీముందుకు రాబోతున్నాయి... .
Ayya rememberedon the eve of SIVARATRI in Today's (4th March 2016)Andhra Jyothi (Nivedana Page)
Tuesday, 23 February 2016
అయ్య పేరుతో 'శివతాండవం' ముడివడిపోయి ఇప్పటికి అరవైయేళ్ళు దాటిపోయింది. 1955నాటి ద్వితీయ ముద్రణ గుంటూరు ఆంధ్ర సంసత్ వాళ్ళు చేసినది. అప్పటికి, నలభై పదుల వయసున్న నారాయణుని ముందు మాటలొ తొణికిసలాడుతున్న వినయ సంపదకు ముగ్ధులవని వారుంటారా, అనిపించింది నాకైతే! యీ పోష్ట్ లో, దీనితోపాటూ, అయ్య యే విషయం గురించైనా వ్రాసుకునే నోట్స్ స్వదస్తూరిలో ఉన్నది పొందుపరచాను. జాగ్రత్తగా చూడండి. చిన్న చిన్న అక్షరాలలో, యెంతో శ్రద్ధగా,తనకు మరీ ముఖ్యంగా తోచిన విషయాలను, రేఖాంకితం చేసుకోవటం- ఇవన్నీ, యెంతో యేకాగ్రతతో చెసుకునేవారాయన యెప్పుడూ - రాత్రీ పగలూ తేడాల్లేకుండా! మిద్దె మీద ఉన్నంతసేపూ, సాహితీ గహనవనాల్లో, అలసటెరుగక విహరించిన ఆ కవికిశోరం - మిద్దె దిగి కిందికి, యీ వాస్తవ ప్రపంచంలొకి వస్తే, యెంత తేడా తెలుస్తుండేదో కదా! అయ్య మాటల్లోనే.... 'యెంతసేపూ, పప్పూ, వుప్పూ, చింతపండూ సంపాదనలోనే తనకలాడి, యేదో అలిసిపోయినట్టు, గుర్రుపెట్టేవాళ్ళకేంతెలుస్తుంది, యెంత శ్రమ పడితే, పాండిత్యం ఒంటపడుతుందో!" ఇంతకూ, శివతాండవం శిఋషిక కిందున్న ఆంగ్ల కొటేషన్ గమనించండి. జీవిత రహస్యం యేమిటంటే, పెద్ద ఆశయాలను సాధించే క్రమంలో, చిన్న చిన్న అకర్షణలను త్యగం చేయవలసు ఉంటుందని...నాకైతే, ఇదేవిధంగా అర్థమైంది...మీరూ ఆలోచించండి - మీకేవైనా కొత్త అర్థాలు తడుతాయేమో!
Monday, 15 February 2016
రాసీమ రత్నం- బెళ్ళూరి
అయ్య బెళ్ళూరి శ్రీనివాసమూర్తిగారిని చాలా ఇష్టపడేవారు. చిన్న తనంలో వారిని బాగా దగ్గరగా చూసినట్టే గుర్తు. వారు, మా తాతగారు శ్రీమాన్ పుట్టపర్తి శ్రీనివాసాచార్యులవారికి శిష్యుడుకూడా కావటంవల్ల, వాళ్ళిద్దరి మధ్యా స్నేహ బంధమలా పెనవేసుకుందేమో! వారి రచనల బైండింగ్ ఒకటి నాకు శ్రీమాన్ రావినూతల శ్రీరాములుగారి ద్వారా యెప్పుడో అందింది. తపోవనము (1954) తో పాటూ ఇందులో, కావ్యగంగ (1957) అన్న దనిలోని కొన్ని రసగుళికలు, మీకోసం! ఇందులో వున్నవి.. గురు ప్రశంస పేరిట, మా తాతగారిగురించిన పద్యాలు, అయ్యకు అనంతపురంలో వీడ్కోలు సందర్భంగా వారు చదివిన పద్యలూ, రాయలసీమ గురించి వారి రసరమ్య భావనలూ...వీటిని ఆస్వాదించండి! ఇంకా యీ సంకలనం ఆకర్షణను అద్భుత చిత్రాలు (చిత్రకారునిపేరు నా కంటికి కనబడలేదు మరి) అదనం....
ఈ రోజు ప్రేమ దినోత్సవం. నిన్నటి నా పుస్తక శోధనలో బయటపడిన 12,మే 1982 నాటి ఆంధ్ర ప్రభ ప్రత్యేక సంచిక (వారపత్రిక) లో చిన తిరుమలయ్య వ్రాసిన శృంగార మంజరిలొని యీ ముచ్చటగొలిపే వివరణ చూడండి.
గాలిపటాలలో, కస్తూరిలో అద్దిన లేఖినితో ప్రేమలెఖ వ్రాసిన ఆ నాయకి వర్ణన యెంత మనోజ్ఞం! యేమొకో చిగురుటధరమున.....ఇదీ అంతే! రుక్మిణీదేవి కూడా, శ్రీకృష్ణుని వలచి ప్రేమలెఖ పంపింది కదా మరి! అన్నమయ్య అలమేలు మంగ, తన పతి మనసు గెలుచుకునేందుకు, అరతెర మరుగున నుంచీ నాట్యం చేసిందని అన్నమయ్య అంటాడు అలరులుగురియగ ఆడెనదే..అన్న పదంలో! అప్పటి రోజుల్లో, వీధినాటకలలోనో మరెక్కడో,(అప్పటికి భామాకలాపం వుండేదా?) తెరమరుగు నుండీ నాయిక పాత్ర ప్రవేశించే విధానం అన్నమయ్య రచనలో ప్రతిబింబించిందని అయ్య చెప్పినట్టు గుర్తు - నాచేత శ్రీ రామకృష్ణాహైస్కూల్ లో యీ పాటకు నాట్యం చేయించినప్పుడు! మా తులజక్కయ్య, బాలసరస్వతిగారి నాట్యాభినయ గ్రంధాన్ని దగ్గర పెట్టుకుని, ముద్రలూ అవీ అయ్య సూచనల ప్రకారం నాకు నేర్పించింది. 'కందువ తిరువెంకతపతి మెచ్చగా అన్న చోట, దశావతారాలూ యివిధంగా అభినయించమని చెప్పి చెసి చూపించారు అయ్య స్వయంగా! . ఇక ప్రదర్శన తరువాత, మ అయ్య నన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నరు - మురిపెంగా! అమ్మ ఇంట్లో దిష్టి తీసింది! అయ్యో..కేవలం స్మృతి పటలంపై మాత్రమే రికార్డ్ చేసుకోగలిగానే, అని ఇప్పుడు యెంత ఆవేదనో! అప్పటి ఫోటొలు కూడా యేవీ లేకపోవటం - యెంతటి తప్పిదం కదా! (ఆ పాట ఇప్పటి నా గానంలో _ శంకరాభరణ రాగం)
మా అయ్యగారికి హిందీ కవులలో నిరాలా అంటే యెందుకో చాలా ఇష్టంగా వుండేది. ఒకనొక ఇంటర్వ్యూ లో వారన్నారు..'నాకూ, నిరాలాకూ చాలా పోలికలున్నందువల్లేనేమో, అతనంటే, నాకు మహా ఇష్టం. అతనూ నావలెనే చాలా కష్టపడినాడు జీవితంలో. ధనాభావంతో, నిష్టుర దారిద్ర్యంతో చివరి రోజుల్లో, ఆయన బిడ్డకు జబ్బు చేస్తే పాపం సరైన వైద్యమూ చేయించలేక పోయినాడు. ప్రపంచంలో దారిద్ర్యంకంటే మించిన పాపం లేదేమోననిపిస్తుంది. ఇప్పుడు ఆయన రచనలకు నీరాజనాలర్పిస్తున్నారు.' (నేను 2002 లో ప్రచురించిన 'సరస్వతీపుత్రునితో సంభాషణలు' పేజీ 38)
నిరాలా వ్రాసిన 'రాం కీ శక్తి పూజా' మాకు ఎం. ఏ. లో వుండేది. యెన్నిసార్లు చదివి వుంటానో లెక్కలేదా రచనను! ఆధ్యాత్మ రామాయణ ప్రభావం బాగా కనిపిస్తుందందులో!
(అరుణ్ రామాయణ్ అన్న అరుణ్ పోద్దార్ హిందీ రామాయణం చదివినప్పుడూ నేనిలాగే యెంతో వుద్వేగానికి గురైనాను. నేను సౌందర్య లహరి బాగా పారాయణం చేసేదాన్నప్పట్లొ. మొదటిరొజు మొదటి శ్లోకం 108 సార్లు చేసి, తక్కిన శ్లొకాలన్నీ చదివేయటం. రెండొ రోజు రెండవ శ్లొకం 108 సార్లు. మూడో రోజు మూడవ శ్లోకం- అలా, నూటా యెనిమిది శ్లోకాలూ, 108 రోజుల్లో పారాయణం చేయమని అమ్మ ఇచ్చిన సలహాను నేను అలా దీక్షగా చేస్తుంటే అయ్య కూడా యెంతో ఇష్టంగా గమనించేవారు కూడా! అప్పుడు అమ్మా, అయ్యా యేంచెబితే అవి చేయటమే, జీవిత లక్ష్యాలు అప్పట్లో! .)
నిరాలా వ్రాసిన యీ సరస్వతీ వందన పాడాలని యెన్ని రోజులుగానో అనుకుంటున్నాను. రేపు మాఘ పంచమి. సరస్వతిదేవి మా నాయనమ్మ. ఆమెకు ప్రణమిల్లుతూ రికార్డ్ చేశాను మరి! (అభేరి రాగ చాయలతో) మా అయ్య ఇంకా వాళ్ళమ్మ దగ్గరే కూర్చుని, తన కావ్యగానం చేస్తూనే వున్నారో, లేదూ, అమ్మ ఆశీర్వాదంతో, యెక్కడైన అవతరించి వుంటారో, తెలియదు. యీ నా జన్మకు యీ కృప చాలునంటారేమో మరి!
......................
7-2-16
................ అయ్యకూ, అయ్య అభిమనులకూ- అందరికీ యెంతో ఇష్టమైన భక్తిగీతమిది. ఒక విధంగా, జీవిత సారాన్నంతా, మూడు చరణాల్లో విశదపరచే యీ భక్తి గీతం-1970లలో, ఆకాశవాణి హైదరాబాద్ వారి కోరికపై అయ్య రాశారు. శ్రీ పాలగుమ్మి విశ్వనాధం గారి సంగీత నిర్వహణలో, హైదరబాద్ సోదరీమణులుగా విఖ్యాతులైన శ్రీమతి లలిత, హరిప్రియ గారలు గానం చేశారు. యెంతో అర్థవంతమైన యీ పాట, రికార్డింగ్ ను సరైన రీతిలో, భద్రపరచలేకపోయినందుకు, వ్యక్తిగతంగానూ, ఆకాశవాణి ఉద్యోగినిగానూ, యెంతో బాధపదుతున్నా, నాకు వచ్చినరీతిలో, ఇలా మీముందుంచగలుగుతున్నందుకు లేశమాత్రం సంతోషంగా ఉంది. ఇదిగో సాహిత్యం-మీకొసం..... కడకు మిగిలేది ఇది ఒకటే, యెడద జపించిన భగవన్నామము..కడకు... అష్టైశ్వర్యములమరినగానీ, ఆచారమ్ములు నెరపిన గానీ, అఖిల శాస్త్రములు చదివిన గానీ, ఆహా! యను యశమమరినగానీ...కడకు... హఠయోగమ్ములు బట్టినగానీ, ఆశ్చర్యంబులు చూపినగానీ, అతివలకన్నుల క్రీనీడలలో, ఆత్మార్పణములు చేసినగానీ...కడకు.. ఆకాశంబులు గొలిచినగానీ, అబ్ధి జలము శోధించినగానీ, చంద్రలొకమునకేగినగానీ, సకలజగముతానేలినగానీ..కడకు...
Friday, 5 February 2016
(Ayya with Dr.Tripuraneni Hanuman Choudary garu in the backdrop of the main door I painted - might be in 1975 or '76)
............... 'ఆ.. నాగా..ఇదిగో.... (11-1-16 .. పోస్ట్ తరువాయి....) యీ ప్రభ మూడు నాలుగేళ్ళు నడిచిందనుకుంటా! అయ్య '72లో రెటైర్ అయ్యారు. మా అన్నయ్య అరవింద్ జీతం పెద్దగా వుండేది కాదు ఇంటి అవసరాలు ఆదుకునే స్థాయిలో! ముగ్గురు పెళ్ళిల్లైన అక్కయ్యలూ, వాళ్ళ అవసరాలూ..అబ్బో! రోజులెట్లా గడిచెవో మరి! యీ లోగా అయ్యకు పద్మశ్రీ రావటమూ, సంజీవరెడ్డిగారు కడప కలెక్టర్ గా వచ్చినప్పుడు, అయ్య షష్టి పూర్తి పెద్ద యెత్తున జరిగి ఓ ఇరవై ఐదు వేల రూపాయల పర్స్ (సరిగ్గా గుర్తులేదండీ..ఐనా అవన్నీ పెద్దవాళ్ళ విషయాలు అప్పట్లో) ఇవ్వటమైంది. జిల్లెళ్ళమూడి అమ్మ కరుణతో, చీరాలా, పేరాలా (అప్పుడు అయ్యతో నేనూ వెళ్ళానండొయ్ అక్కడికంతా!) అటు వైపు బాగా సన్మనాలవీ జరిగి రెక్కలు అల్లార్చుకునే సమయానికి అమ్మ తీవ్ర అనారోగ్యం! మాటి మాటికీ, ఆసుపత్రి పాలు కావటం, డబ్బు నీళ్ళలా ఖర్చైపోవటమూ! ఆ రోజులు తలచుకుంటే కడుపులోంచీ యేడుపు యెగదన్నుకుని వస్తుంది. ఆర్థిక స్థోమత అవసరం అప్పుడప్పుడే తెలుస్తున్న రోజులవి! తరువాతి కాలంలో, అయ్య తన పెద్ద రచనలు పండరీభాగవతమూ , జనప్రియ రామాయణమూ, వేసుకున్నారు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడి రేట్లతొ ఇచ్చిన పేపర్తో కాస్త ధైర్యంగానే! కానీ, అప్పటికే, తెలుగు సాహిత్యభిలాష మసకబారుతున్నట్టుందేది. ఆ గ్రంధాలెవరూ గ్రంధాలయాలకంటూ కొనలెదు.పండరీభాగవతం, చెక్క బీరువాల్లో వుండటం వల్ల, వర్షపు నీళ్ళు దిగి, చెదలు పట్టి పోయాయి చాలా కాపీలు!..అయ్య ఆ చెదలు పట్టిన పుస్తకాల మధ్య కూర్చుని నిర్వేదంగా, యే భావమూ ప్రకటించని గాజు కళ్ళతో, అన్న మాటలు ఇంకా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి 'చివరికి, నా పండరీభాగవతాన్ని చెదలే చదివినాయన్నమాట ప్రీతిగా! ' అని! అట్లా, అయ్యకు తన పుస్తకాలను తానే ముద్రించుకోవటం కూడా తప్పేనని తెలుసుకునే వేళకు జరగాల్సిన నష్టం జరిగేపోయింది. జనప్రియ రామాయణం, శ్రీనివాస ప్రబంధమూ, అయ్య పోయిన తరువాత, కొన్ని బ్రౌన్ లైబ్రరీకీ, కొన్ని..(యేడుపొస్తూంది) రక రకాలుగా మాయమైపోయాయి.. . పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, అయ్యను చూసిన స్ఫూర్తి తో, నేనూ యీ ప్రచురణ రంగంలోకి, అయ్య పుస్తకాలను ప్రచురిస్తూ, ఆడ అభిమన్యునిగా ప్రవేశించాను. నేను వేసిన పుస్తకాలవల్ల, లాభాలెన్ని వచ్చాయన్నది కేవలం అనుభవైక వేద్యమే ! వ్యాపార చతురత ముఖ్యంగా వుండవలె కదా! వుద్యోగినులుగా వుంటూ, ప్రచురణ రంగంలో కూడా ప్రతిభ కనబరుస్తూ, సక్సెస్ సాధించిన మహిళలు, చాలా తక్కువే యెలాగైనా! యేమైనా చెప్పండి అదిప్పటికీ నాకు రాని కళే! యేమైనా మాట్లాడేవాళ్ళని 'మీరూ పుస్తకాలు వేసి చూడండి, తెలుస్తుంది ఆ బాధేమిటో ' అనేస్తాను నేనైతే! గట్టుపై కూర్చుని యెన్ని మాటలైనా మాట్లాడవచ్చు. దిగితే కదా లోతు తెలిసేది. అక్కడో వూబే ఉండొచ్చు. మొసలే వుండొచ్చు. సుడిగుండమే కావచ్చు. యేమీ లేకపోనూ వచ్చు. అదంతా అదృష్టం.. యెంతకూ దృష్టం కానిది మరి! పుస్తకాలు వేసి అమ్ముకోవటానికి నానా తిప్పలూ, నానా గడ్డీ తింటూ అగచాట్లూ పడుతున్న వాళ్ళకే యీ విషయాలు తెలుస్తాయి. పైగా అయ్యనుంచీ, వారసత్వంగా వచ్చిన కొన్ని సుగుణాలుండనే వున్నాయాయె! చొరవ లేదు. వుద్యోగస్తురాలినైనా, లంచాలిచ్చి పనులు చేయించుకోవడమన్న విద్య రాకపాయె! పుచ్చుకునే విద్య ఒస్తే, ఇచ్చే విద్యా వస్తుందట! అదే రాదు కదా మరి! యేమి మాట్లాడినా అయ్యకే చెడ్డపేరొస్తుందనే భయమూ! ఐనా, కిందపడి దెబ్బ తగిలినా, అనుభవం మాత్రం చక్కటిదే, అన్నట్టు, పుస్తకాలమాటెటున్నా, పుట్టపర్తాయన బిడ్డగా, వచ్చిన గుర్తింపే యీ జన్మకు చాలు అన్నట్టుంది నాకైతే! యేమంటారు? ............................
మా అమ్మ శ్రీమతి పుట్టపర్తి కనకమ్మగారు వ్రాసిన యీ పాట, అమ్మను యెరిగున్నవాళ్ళందరికీ, యెంతో ప్రీతిపాత్రమైన పాట! మా అయ్యకూడా, కళ్ళు మూసుకుని, తాదాత్మ్య స్థితిలో, భక్తి పారవశ్యంలో యీపాట వినటం-మేము గమనించిన సత్యం. అమ్మ 1983 లో (22nd March) తన శ్రీరామ సాన్నిధ్యానికి చేరుకున్నప్పుడు, మేమంతా, ఆమె శాశ్వత వియోగాన్ని భరించలేక-యీ పాటను అశృతప్త నయనాలతో పాడుతుంటే, అయ్య, చిన్న పిల్లవాడివలె, భోరున యేడ్వటం- అందరి హృదయాలూ తరుక్కుపోయిన క్షణాలు. కరణం, మా అయ్య జీవితానౌక, నిజమైన సరంగు అమ్మే కదా మరి! ఇల్లాలిగానూ, సాహితీపధ సహగామిగానూ, ఆ సరస్వతీపుత్రుని అంతర్వాహిని అంతశ్శక్తి కూడా ఆమే! ఆమే! అమ్మకు కన్నీటి నివాళీ!